శునకాలకు 'సిక్స్ స్టార్' హోటల్.. విలాసవంతమైన ఆతిథ్యం!

by Disha News Desk |
శునకాలకు సిక్స్ స్టార్ హోటల్.. విలాసవంతమైన ఆతిథ్యం!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా 'ఫైవ్ స్టార్' హోటల్స్ అన్నీ కస్టమర్లకు విలాసవంతమైన ఆతిథ్యాన్ని అందిస్తాయి. అయితే ఇవి మనుషులకు మాత్రమే లగ్జరీ ఫెసిలిటీస్ అందిస్తుండగా.. ఇప్పుడు పెంపుడు జంతువులకూ ఈ తరహా సేవలందించేందుకు కొన్ని హోటల్స్ వెలిశాయి. తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోనూ ఒక 'సిక్స్ స్టార్' హోటల్ ప్రారంభమైంది. ఈ 'సూపర్‌వూఫ్' డాగ్ హోటల్‌ 'డే కేర్‌'లోని కుక్కలకు 'సిక్స్-స్టార్ సర్వీస్'లో భాగంగా 'బాతింగ్, హెయిర్ కట్, బ్రషింగ్, పాదాలకు మెడికేషన్ సహా వస్త్రధారణ' వంటి అనేక సేవలు కల్పిస్తున్నారు.

'24 గంటల పర్యవేక్షణ అందిస్తున్నాం. స్ప్లాష్ పూల్, జెయింట్ లాంజెస్ సదుపాయాలతో శునకాలకు విలాసవంతమైన అనుభవాన్ని అందించాలనుకుంటున్నాం. డాగ్ షాంపైన్ మా ప్రత్యేకత. దీన్నే చాంపాస్ అంటారు. షాంపైన్ వంటి సీసాల్లో మూలికలతో కలిపిన నీటిని కుక్కలకు అందిస్తాం. అయితే పెట్స్ యజమానులు ఓ నియమం పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్మిట్ చేసే ముందు కుక్కలకు పూర్తిగా టీకాలు వేయాలి. చెక్‌ ఇన్‌కు 48 గంటల ముందు అనారోగ్య సంకేతాలను చూపించకూడదు' అని సూపర్‌వూఫ్ హోటల్ యాజమాన్యం తెలిపారు.


అయితే ప్రపంచంలోని అత్యంత అసమాన(అన్-ఈక్వల్) దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటిగా ఉంది. ఈ దేశ జనాభాలో సగం మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో శునకాలకు సిక్స్ స్టార్ సౌకర్యాలు కల్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఇలాంటి పేద దేశంలో సూపర్‌వూఫ్ వంటి సంస్థల ద్వారా కుక్కల కోసం అందిస్తున్న విపరీత సౌకర్యాలను ప్రోత్సహించడం అసహ్యంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story