- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ అడిక్టర్స్.. ‘డిజిటల్ డిటాక్స్’తో సమస్యకు పరిష్కారం
దిశ, ఫీచర్స్: స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్, వివిధ ఎలక్ర్టానిక్ డివైస్‌లు మానవ జీవితంలో భాగమై పోయాయి. సమాచారం తెలుసుకోవడానికి, సందేశాలు పంపడానికి, ఇతరులతో మాట్లాడటానికి, చదువులో, ఉద్యోగంలో అవసరమైన స్కిల్స్ పెంపొందించడానికి వాటిపై ఆధారపడుతున్నాం. కొందరు ఆన్‌లైన్ వేదికగా మోసం చేయడానికి, సిస్టమ్స్ హ్యాక్ చేయడానికి, పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కూడా అవి దోహదపడుతున్నాయి. మరో విధంగా ఇన్వెస్టిగేషన్లలో, ఆధునిక పరిశోధనలలో కూడా యూజ్ అవుతున్నాయి. అవసరాన్నిబట్టి మంచికోసం వివిధ ఎలక్ర్టానిక్ డివైసెస్‌ను, స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించుకుంటే పర్లేదు. కానీ ఈరోజుల్లో చాలామంది వాటికి అడిక్ట్ అవుతున్నారు. రాత్రింబవళ్లు స్ర్కోల్ చేస్తుండటం ఒక వ్యసనంగా మారుతోందని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే డిజిటల్ డిటాక్స్ నియమాల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు.
89 శాతం పర్సనల్ యూజ్
తాజా పరిశోధనల ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు తమ స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. 2022 సంవత్సరంలో ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో గడిపే గంటల సంఖ్యలో 39% పెరిగింది. సగటు స్మార్ట్‌ఫోన్ యజమాని రోజుకు 150 సార్లు తన ఫోన్‌ను అన్‌లాక్ చేస్తున్నాడు. భారతదేశంలోని ఒక కార్టూన్ ఛానెల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. 95% మంది పిల్లలు మొబైల్ ఫోన్‌లతో ఇళ్లలో నివసిస్తున్నారని వెల్లడైంది. 62 % మంది ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారు లేదా ఇమెయిల్‌లకు సమాధానం ఇస్తున్నారు. 89 % మంది యువకులు పర్సనల్ విషయాలను చర్చించడానికి తమ సెల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు 37% మంది తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను బెడ్‌పై పెట్టుకుని నిద్రపోతున్నారు. 33.3 % మంది వ్యక్తులు అర్ధరాత్రి దాటాక కూడా ఫోన్‌లను చెక్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే సమాజంలో స్ర్కీన్ వ్యసనం పెరిగిపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కఠినమైన ‘డిజిటల్ డిటాక్స్’తో ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు. ఒక వ్యక్తి స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండే పరిస్థితినే డిజిటల్ డిటాక్స్ అంటారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, భౌతికంగా సమాజంతో కనెక్ట్ అవడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తారు.
నెగెటివ్ ఎఫెక్ట్, నోమోఫోబియా
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ వంటివి మన జీవితంలో భాగమై పోయాయి. అయితే అవి మనకు తెలీకుండానే మన జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఏమిటి? ఎందుకు తదితర విషయాలను, నోటిఫికేషన్లను చెక్ చేసేందుకు వాటిపైనే ఆధారపడుతున్నాం. అదే సందర్భంలో మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడతోంది. ఇటీవల తమిళనాడులో ఓ 9 ఏళ్ల ‘ఇన్‌స్టా క్వీన్’ తన పేరెంట్స్ మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. వ్యసనానికి ఇది తీవ్రరూపంగా చెప్పవచ్చు. ప్రధానంగా చాలామంది నోమోఫోబియా (మొబైల్ ఫోన్ కనెక్టివిటీ నుంచి విడదీయబడతారేమోననే భయం)బారిన కూడా పడుతున్నారు. ‘‘నా కిడ్నీ తీసుకో, కానీ నా ఫోన్ తీసుకోవద్దు’’ అన్నంతగా టీనేజర్లలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వ్యసనం వ్యాపించిందని ఇటీవల చైనా నిపుణులు గుర్తించారు. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి ఆ దేశం 300 కఠినమైన ‘డిజిటల్ డిటాక్స్’ క్యాంపులను ప్రారంభించింది. యూఎస్ స్కూల్ బోర్డు కూడా సోషల్ మీడియా వ్యసనం నేపథ్యంలో మెటాపై దావా వేసింది.
మహమ్మారిలా విస్తరిస్తోంది
స్కూలు పిల్లల్లో కూడా ఇటీవల స్మార్ట్ ఫోన్ వ్యసనం ఒక మహమ్మారిలా మారింది. పేరెంట్స్ అవసరాల రీత్యా ఫోన్‌లు, స్ర్కీన్‌లు వాడుతుంటే పిల్లలు వాటిని అనుకరిస్తూ తప్పుదారి పడుతున్నారు. ఈ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ పిల్లల ముందు ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోవడమేగాక, వాటి గురించిన మంచీ చెడును వివరించడంలో చాలామంది పేరెంట్స్ విఫలం అవుతున్నారు. ఈ కారణంగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ‘‘మనం మునుపెన్నడూ లేనంతగా స్మార్ట్ ఫోన్లకు, కంప్యూటర్లకు కనెక్ట్ అయ్యాం. చివరికి మన పిల్లలు డిజిటల్ సన్యాసులుగా(digital hermits) మారుతున్నారు. సోషలైజ్ అయ్యే పరిస్థితి వారిలో కనిపించడం లేదు. మన సంబంధాలు WhatsApp సందేశాలతో కొనసాగుతున్నాయి. ప్రతీ ఈవెంట్, ప్రతీ చర్చ, ప్రతీ సంఘటన, ప్రతీ హృదయపూర్వక సంభాషణ స్క్రీన్ ద్వారా చేస్తున్నాం. దీనివల్ల మనం ఎంతో కోల్పోతున్నాం’’ అంటున్నారు బెంగుళూరుకు చెందిన ఐటీ నిపుణుడు రణధీర్ వర్మ. 2021లో స్క్రీన్ టైమ్ తనను వెయ్యి వోల్ట్‌ల లాగా తాకిందని అతను చెప్తున్నాడు. అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నానని డిజిటల్ డిటాక్స్ ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చాడు. లాక్డౌన్ సమయంలో 6.5 గంటల స్క్రీన్ టైమ్ నుంచి తాను నేను 2.5 గంటలకు తగ్గించగలిగానని, డిజిటల్ డిటాక్స్ తనలో మార్పు తెచ్చిందని మరో వ్యక్తి పేర్కొన్నాడు.
డిజిటల్ డిటాక్స్ రూల్స్ ఇవే..
* ఫోన్ డిస్‌ప్లేను గ్రేస్కేల్‌కి మార్చడంవల్ల అది తక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ కారణంగా తక్కువ యూజ్ చేసే అవకాశం ఉంటుంది.
*మీ మొబైల్ ఫోన్లలో నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయండి. ఫోన్ యూజ్ చేయకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది.
* పనిలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకండి. అవసరమైతే రాత్రి 9 గంటల తర్వాత కాసేపు బంధువులతో మాట్లాడటం, చాటింగ్ చేయడం వంటివి చేయండి.
* సోషల్ మీడియాను ఎప్పుడూ చెక్ చేయకుండా ఉండేందుకు ఆన్/ఆఫ్ పద్ధతి ఫాలో అవండి. అవసరానికి మించి స్పందించకండి.
* రోజంతా స్క్రీన్ నుంచి దూరంగా ఉండేలా ప్రయత్నించండి.
*స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే.. సామాజిక స్పృహ కూడా అలవర్చుకోవాలి. ఎప్పుడూ ఫోన్లలోనే కాకుండా మీకు నచ్చిన వ్యక్తులతో నేరుగా కలిసి మాట్లాడటం చేయండి. ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకోవడాలు, సరదా సంభాషణలు, హృదయపూర్వక చిరునవ్వులు మిమ్మల్ని డిజిటల్ డిటాక్స్ వైపు మళ్లించి వ్యసనం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.