Sleeping Tips : నిద్రకు ముందు ఈ ఒక్క పని చాలు.. ఆ సమస్యలు అస్సలు రావు!

by Javid Pasha |
Sleeping Tips : నిద్రకు ముందు ఈ ఒక్క పని చాలు.. ఆ సమస్యలు అస్సలు రావు!
X

దిశ, ఫీచర్స్ : ఎలాంటి అనారోగ్యాలు లేకున్నా తలనొప్పి, మెడనొప్పి, కండరాల్లో ఇబ్బంది వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పనిచేస్తే చాలు. ఆ సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే.. నిద్రపోయేటప్పుడు తలకింద దిండు (Pillow) తీసి వేయడం. ఎందుకంటే ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేయడంవల్ల కొందరిలో పలు సమస్యలకు కారణం కావచ్చు. అలాంటప్పుడు దిండు లేకుండా పడుకోవడం వల్ల ఆరోగ్యంపరంగా అనేక లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.

*మెడ నొప్పి తగ్గుతుంది : తలకింద ఎత్తైన దిండు పెట్టుకోవడంవల్ల వెన్నెముక, అలాగే దీనికి అతుక్కుని ఉండే మెడ భాగంలో సహజమైన భంగిమకు ఆటంకం కలుగుతుంది. పైగా మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెడ, వెన్ను నొప్పి తరచుగా రావడం, తిమ్మిరి పట్టడం వంటి సమస్యలు మీలో ఎలాంటి అనారోగ్యాలు లేకపోయినప్పటికీ వస్తున్నాయంటే.. రాత్రిపూట తలకింద దిండు లేకుండా నిద్రపోయి. చూడండి దీనివల్ల మెడనొప్పి తగ్గిపోవచ్చు.

* తలనొప్పికి ఉపశమనం : ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా తెల్లవారు జామున, ఉదయంపూట తలనొప్పి వస్తోందంటే.. తలకింద వేసుకునే దిండు వల్ల కూడా కావచ్చు. ఇది సరిగ్గా లేనప్పుడు, ముఖ్యంగా ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు మెడ కండరాలపై ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంగా రక్త ప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలిగి తలనొప్పికి దారితీస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. కాబట్టి తలదిండు లేకుండా పడుకుంటే తల, మెడ భంగిమలు సక్రమంగా ఉంటాయి. తలనొప్పి, మైగ్రేన్ వంటివి రాకుండా ఉంటాయి.

*స్కిన్ ప్రాబ్లమ్స్ రావు : కొందరిలో దిండుపై పడుకునే తీరును బట్టి అది చర్మంపై ఒత్తిడికి కారణం కావచ్చు. ముఖానికి రాసుకుపోవడంవల్ల మొటిమలు, దద్దుర్లు వంటివి వస్తాయి. దిండుపై ముఖం ఆనించి పడుకునే అలవాటు రక్త ప్రసరణకు ఆటంకం కలిగించడంవల్ల ముఖంపై ముడతలకు, వృద్ధాప్య ఛాయలకు దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి దిండు లేకుండా పడుకుంటే ఈ సమస్యలేవీ ఉండవు.

*గురక నుంచి ఉపశమనం : గురక సమస్య ఉన్నవారు తలకింద దిండు పెట్టుకొని పడుకోవడంవల్ల మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెడ నరాలు, వెన్నెముక మధ్య కనెక్షన్‌ను దిండు ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గురక సమస్య ఉన్నవారు ముఖం దిండుకు సగం ఆనించి పడుకుంటూ ఉంటారు. దీనివల్ల శ్వాసలో ఇబ్బందులు ఎదురవుతాయి. గురక శబ్దం మరింత ఎక్కువగా వస్తుంది. కాబట్టి కొన్నిరోజులు దిండు వేసుకోవడం మానేసి చూడండి. చాలా వరకు ఉపశమనం కలుగుతుంది అంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed