Sleep: నిద్రలేమితో గుండె, శ్వాసకోశ వ్యాధులు..

by sudharani |   ( Updated:2023-01-06 16:01:23.0  )
Sleep: నిద్రలేమితో గుండె, శ్వాసకోశ వ్యాధులు..
X

దిశ, ఫీచర్స్ : అందానికి, ఆరోగ్యానికి, ఆనందానికి సరైన నిద్ర అవసరం. మెదడు చురుగ్గా పనిచేయాలన్నా.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడకూడదన్నా టైమ్‌కు నిద్రపోవాల్సిందే. అలాంటప్పుడే జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. లేదంటే గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు వెంటాడుతాయి. రక్తప్రసరణ వ్యవస్థ బలహీనపడుతుంది శరీర ఎదుగుదలకు అవసరమైన హార్మోన్స్ రిలీజ్ కావడం ఆగిపోతాయి.

నిద్రలేమి అనేది మీ రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె పనితీరుపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ కంట్రోల్ తప్పుతుంది. గుండె పనితీరు బలహీన పడుతుంది. ఛాతిలో మంట, నొప్పి వంటివి తలెత్తుతాయి. అదే బాగా నిద్రపోయినప్పుడు గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ నార్మల్ స్టేజీకి వస్తుంది. ఎవరైతే కొన్ని నెలలుగా రాత్రిళ్లు మేల్కొని ఉంటారో అలాంటివారు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే రాత్రి సమయంలో నిద్రించకపోతే కరోనరీ హార్డ్ డిసీజెస్, అధిక రక్తపోటు, ఒబేసిటి, హార్ట్ స్ర్టోక్, పక్షవాతం వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. శరీరంలో అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి కూడా బ్యాలెన్స్ తప్పి అనారోగ్యాలకు కారణం అవుతుంది.

హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకాలు

మీ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే వీటిపై కూడా ప్రభావం పడుతుంది. కంటినిండా నిద్రపోయి ఉదయం మేల్కొవడంవల్ల మీ బాడీలోని హార్మోన్స్ అన్నీ సక్రమంగా రిలీజ్ కావడంవల్ల మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. జీవితంలో ప్రతి రోజూ 24 గంటల పాటు శరీరానికి అవసరమైన అనేక రకాల హార్మోన్ల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు పిల్లల్లో టెస్టోస్టెరాన్, ఈస్ర్టోజెన్, ప్రొజెస్టిరాన్ వంటివి రాత్రిపూట నిద్రపోయినప్పుడు విడుదలవుతుంటాయి. అవి వారి పెరుగుదలకు దోహదం చేస్తాయి. పెద్దవారిలో కూడా అవసరం మేరకు ఈ హార్మోన్లు విడుదలవుతుంటాయి. నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే వాటి ఉత్పత్తి మందగించి సమస్యలు ఎదురవుతాయి.

జీర్ణ వ్యవస్థపై దుష్ర్పభావం

మీరు చురుకుగా ఉండేందుకు శరీరంలోని ఇతర అవయవాలు కూడా చాలా ముఖ్యం. లివర్, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, కండరాల పనితీరు బాగుండాలంటే నిద్ర చాలా ముఖ్యం. రాత్రి తిన్న ఆహారం జీర్ణమై రక్తంలో కలిసి శక్తిగా మారాలంటే తగిన నిద్ర కూడా కావాలి. నిద్రలేమి సమస్య క్రమంగా ఒత్తిడికి దారితీసి, లివర్ ఫంక్షనింగ్ గాడి తప్పి రకరకాల అనారోగ్యాలు కలుగుతాయి. ఆకలి మందగిస్తుంది. చిరాకు, కోపం, అపసవ్య ఆలోచనలు వేధిస్తాయి.

ఆక్సిజన్ సరఫరాపై ప్రభావం

నిద్ర బాగా పోయినప్పుడే శరీరంలోపలి అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. అదే నిద్రలేమి సమస్య ఉన్నట్టయితే అది మందగిస్తుంది. క్రమేణా శ్వాసకోశ వ్యాధికి దారి తీస్తుంది. రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. కానీ సమయానికి నిద్ర పోయేవారిలో ఇలాంటి సమస్యలే ఉండవు. ఉదాహరణకు నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చిన్న చిన్న వాతావరణ మార్పులకు కూడా ప్రభావితం అవుతుంటారు. దగ్గు, జలుబు వంటివి వెంటాడుతుంటాయి. బాగా నిద్రపోయేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపించవు. నిద్రపోవడం వల్ల జలుబు, శ్వాసకోశ సమస్యలు కూడా దూరమవుతుంటాయి.

జ్ఞాపకశక్తి మందగిస్తుంది

నిద్రలేమి వల్ల ఎదురయ్యే సమస్యల్లో సహనం కోల్పోవడం, ఆందోళనకు గురికావడడం ప్రధానంగా జ్ఞాపకశక్తి మందగించడం గమనించవచ్చు. దీర్ఘకాలిక మెమొరీ పవర్ తగ్గిపోతుంది. చాలా విషయాలను త్వరగా మర్చిపోతారు. చదువుపై, లేదా చేసే పనిపై ఆసక్తిని, ఏకాగ్రతను కోల్పోతారు. చదివింది గుర్తుండదు. క్రమంగా మైగ్రేన్‌తో పాటు ఇతర అనారోగ్యాలు సంభవిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవితానికి సరిపోను నిద్ర చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా నిద్రలేమితో బాధపడుతుంటే నిపుణులను సంప్రదించి ఆ సమస్యను దూరం చేసుకోవాలని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed