Secret Things : సీక్రెట్ థింగ్స్.. ప్రతీ ప్రవర్తన వెనుక ఓ రహస్యం!!

by Javid Pasha |
Secret Things : సీక్రెట్ థింగ్స్.. ప్రతీ ప్రవర్తన వెనుక ఓ రహస్యం!!
X

దిశ, ఫీచర్స్ : కాదేదీ కవితకనర్హం అన్నట్లు.. కారణం లేని ఆలోచన, ప్రవర్తన, ఆసక్తి, అభిరుచి వంటివి ఉండవని నిపుణులు చెప్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత, సామాజిక జీవితాలు, అభిప్రాయాలు, భావాలు, భావోద్వేగాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఎవరి గురించి వారికి అర్థం కాకపోవచ్చు కానీ.. వారి ఆలోచనలో, ప్రవర్తనలో సూపర్ పవర్, ఆకట్టుకునే గుణం ఉండవచ్చు. అలాగే కొన్నిసార్లు అవి పనికి రానివిగానూ, ఇతరులకు నచ్చనివిగానూ అయ్యుండవచ్చు. ఇదంతా వ్యక్తుల జీవితంలో సహజంగా ఉండేవే అయినప్పటికీ వాటి వెనుక గల రహస్యాలు చాలా మందికి తెలియవు. నిద్ర, నవ్వు, ఏడుపు, బాధ వంటివి కూడా ఆ కోవకు చెందినవే. అలాంటి కొన్ని సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర వెనుక రహస్యం

ఎక్కువగా నిద్రపోతుంటే ఏంటది కుంభ కర్ణుడిలా అంటుంటారు కొందరు. కానీ దీనివెనుక సీక్రెట్ థింగ్(Secret Thing) వేరు అయి ఉండవచ్చు. మీరు ఎక్కువ సమయం నిద్రపోతూ కూడా అలసిపోయినట్లు కనిపిస్తుంటే.. మీది మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మీరు మానసిక ఒత్తిడి, ఆందోళన, తీవ్రమైన అలసట, అసంతృప్తి భావాలతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. అంటే టెంపరరీ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ కోసమో, భావోద్వేగాలు సీక్రెట్‌గా ఉంచుకునేందుకో చాలా మంది ఆశ్రయించగల సులువైన మార్గం నిద్ర. ఇదే దాని వెనుకున్న రహస్యం.

ఏడుపు ఆపుకోలేకపోవడం

చిన్న మాటకే అతిగా ఫీలయ్యేవారు, ఆయా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకునేవారు చాలామందే కనిపిస్తుంటారు. భావోద్వేగాల సందర్భాల్లోనైతే కొందరి ఏడుపు చూసేవారికి బాధగా అనిపించినా తరచూ ఈ విధమైన ప్రవర్తన కూడా కొందరికి అసహ్యంగా అనిపించవచ్చు. కానీ ఆ ఏడుపు వెనుక గల సీక్రెట్ ఎంత మందికి అర్థం అవుతుంది?.. ఆ ఏడుపు గల వ్యక్తులు చాలా సున్నిత మనస్కులై ఉండవచ్చు. ఇతరుల బాధల్ని తమ బాధగా భావించేవారు కూడా అయ్యుండవచ్చు.

చిరు నవ్వు చిందిస్తుంటే..

సహజంగానే స్మైల్ హ్యాపీనెస్‌కు ప్రతిబింబం అనుకుంటాం. పైగా మొహంపై చిరు నవ్వు చిందించేవారిని చూస్తే అదో పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. అయితే ఎప్పుడూ నవ్వడం కూడా కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. సమయం, సందర్భం లేకుండా మీరు నవ్వుతూ ఉంటే చూసిన వారికి అసహ్యంగా అనిపిస్తుంది. పైగా వీళ్లకేమైనా పిచ్చా? అనుకునేవారు లేకపోలేరు. అయితే ఇలాంటి నవ్వు వెనుక ఓ రహస్యం ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వారు ఒంటరితనంతో బాధపడే వారు అయి ఉండవచ్చు. గుండెలోని బాధలు, భావోద్వేగాలను దాచుకోవడానికి కూడా కొందరు తరచుగా నవ్వుతూ కనిపించడం, మాట్లాడటం చేస్తుంటారు. కాబట్టి నవ్వుతున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారనుకోవద్దు.

మౌనం వెనుక సీక్రెట్

కొంతమందిని చూస్తుంటాం. ఎక్కువగా మౌనంగా ఉంటారు. చాలా సందర్భాల్లో అవసరం మేరకు మాత్రమే స్పందిస్తుంటారు. పలకరిస్తేనే పలకరిస్తుంటారు. పదిమందిలో ఉన్నా సరే అవసరానికి మించి మాట్లాడరు. చూసేవారికి వీరిలో పొగరు, ఈగో, గర్వం ఎక్కువ అనుకుంటారు. మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయేమోనని సెటైర్లు వేస్తుంటారు. కానీ ఇలా మౌనంగా ఉండేవారు మానసికంగా దృఢమైన వారిగా ఉంటారని మనస్తత్వశాస్త్రం బెబుతోంది. కాబట్టి మౌనం అమాయత్వం అనుకోవడం అవగాహన రాహిత్యం. వాస్తవానికి అదో పవర్ ఫుల్ వెపన్. అలాగనీ.. ప్రతి సందర్భంలోనూ మౌనం కూడా పనికి రాదంటున్నారు నిపుణులు. ఇక్కడ సమయ స్ఫూర్తి ముఖ్యం.

అబద్ధం అసలు నైజం

నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే వస్తాయని కొందరిని సంబోధించడం మీరు వినే ఉంటారు. కానీ ఈ అబద్ధం చెప్పే వ్యక్తులు కూడా బాధితులనే రహస్యం చాలామందికి తెలియదు. ఏంటంటే.. తమపై తమకు నమ్మకం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అభద్రత భావంతో ఉండేవారే ఎక్కువగా అబద్ధాలు ఆడుతుంటారని సైకాలజిస్టులు చెప్తున్నారు. కాకపోతే వీరు ఇతరుల ముందు తమను గొప్పగా చెప్పుకోవడానికి, ఇతరుల్లో తమపట్ల బెస్ట్ ఇంప్రెషన్ రావడానికి, తమకు నచ్చని వారిని డౌన్ చేయడానికి అబద్ధాలు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తుంటారు. బాల్యంలో ఎక్కువగా బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారు, సమాజంలోనో, కుటుంబంలోనో నిరాదరణకు గురైనవారు పెద్దయ్యాక ఎక్కువగా అబద్ధాలాడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇదే అబద్ధం వెనుక అసలు రహస్యం.

Advertisement

Next Story