'సెకండ్ హ్యాండ్ స్మోకింగ్' దెబ్బ మాములుగా లేదు.. కొత్త స్ట‌డీలో విస్తుపోయే వాస్తవాలు!!

by Sumithra |
సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ దెబ్బ మాములుగా లేదు.. కొత్త స్ట‌డీలో విస్తుపోయే వాస్తవాలు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'పొగ‌త్రాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం.' సినిమా స్క్రీన్‌ల‌తో స‌హా ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ ఈ హెచ్చ‌రిక‌ ఉంటుంది. అయితే, అంత‌కుమించే, సిగ‌రేట్లు అమ్మే దుకాణాలూ కనిపిస్తాయి. సిగ‌రేట్టు డ‌బ్బాపైన భ‌యంగొలిపే క్యాన్స‌ర్ క‌ణుతుల చిత్రాలు ముద్రించినా ధూమపానం గానీ, సిగ‌రేట్ల ఉత్ప‌త్తి గానీ త‌గ్గిన‌ట్లు క‌నిపించ‌దు. సిగ‌రేట్లు తాగ‌ద్ద‌ని చెప్పే ప్ర‌భుత్వాలు వాటిని త‌యారుచేసే కంపెనీల‌నూ మూసేయ‌దు. ఇప్పుడు త‌ప్పిద‌మ‌ల్లా పొగ‌తాగే వాళ్ల‌దే. వాళ్లు పోతే పోతారు స‌రే, జ‌నాల మ‌ధ్య‌లో సిగ‌రేట్ తాగ‌డం వ‌ల్ల తాగేవాళ్ల‌తో పాటు ప‌క్క‌నున్నోళ్లూ రోగాల‌బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అంతేనా, ఊపిరితిత్తులారా ఆశ్వాదించి, ప‌డేసిన‌ పీక ముక్క నుండి వ‌చ్చే పొగ‌కూడా తాగే వారికంటే తాగ‌నోళ్ల‌కే ఎక్కువ ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. ఇక‌, ఈ సెకండ్ స్మోకింగ్ ప్ర‌భావం ఇప్పుడు మ‌నుషుల‌ను దాటి ఏకంగా దేశ ఆర్థిక భారానికి కార‌ణ‌మ‌వుతోంది. నిజ‌మే..! జర్నల్ ఆఫ్ నికోటిన్ అండ్ టొబాకో రీసెర్చ్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తోంది. సర్వే ప్రకారం, సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతి సంవత్సరం రూ. 567 బిలియన్ల ఆరోగ్య సంరక్షణ వ్యయం అవుతుంది.

దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ ద్వారా పడే ఆర్థిక భారాన్ని మొదటిసారిగా ఈ డేటా వెలుగులోకి తెచ్చింది. ఇది ప్రధానంగా భారతదేశంలోని మహిళలు, యువత, తక్కువ-ఆదాయం గ‌ల‌ ప్రజల వంటి అత్యంత బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ప్రభావితం చేస్తుంది. పొగాకు వినియోగం ద్వారా రూ. 1,773 బిలియన్ల వార్షిక ఆర్థిక వ్యయంపై మొత్తంగా 8% వార్షిక ఆరోగ్య సంరక్షణ వ్యయం ప్ర‌భావం ఉంది. ఇక‌, సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు గురయ్యే 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నాన్‌స్మోకర్ల‌ ఆరోగ్య సంరక్షణ ఖర్చును అంచనా వేయడానికి పరిశోధకులు పబ్లిక్ డేటా సోర్సెస్, ప్ర‌భావితుల‌ రిస్క్ విధానం ద్వారా స్ట‌డీ నిర్వ‌హించారు. అయితే, మొత్తం ఆర్థిక వ్యయాల్లో రూ. 567 బిలియన్లు ఒక భాగంగా మాత్రమే క‌నిపిస్తోంది. ఈ మొత్తం వ్యాధి కారణంగా సంభవించే మరణాలు, సెకండ్‌హ్యాండ్ పొగ బహిర్గతం కావ‌డం వల్ల సంభవించే ముందస్తు మరణాలను మినహాయించి క‌నిపిస్తున్న వ్య‌యం.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సెకండ్‌హ్యాండ్ ఎక్స్‌పోజర్‌పై మ‌రింత దృష్టి పెట్టాల్సి ఉంది. భారతదేశ‌ పొగరహిత చట్టంలోని లొసుగుల కారణంగా, ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ జోన్‌లను అనుమతించాల్సి వ‌స్తుంది. సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌ వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రభావాల నుండి ధూమపానం చేయనివారిని మెరుగ్గా రక్షించడానికి చట్టాలను బలోపేతం చేయాలని ఈ నివేదిక సూచిస్తుంది.

Advertisement

Next Story