Anti-Aging Elixir : ఒక అద్భుతమైన సెల్ థెరపీతో వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చు.. ఎలాగంటే..

by Javid Pasha |
Anti-Aging Elixir : ఒక అద్భుతమైన సెల్ థెరపీతో వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చు.. ఎలాగంటే..
X

దిశ, ఫీచర్స్ : మనుషుల్లో వృద్ధాప్యం అనేది నేచురల్ ప్రాసెస్.. అయినప్పటికీ అది త్వరగా రాకుండా తిప్పికొట్టగలిగితే.. ఎంత బాగుంటుంది! ప్రస్తుతం ఇది జరిగే చాన్స్ ఉందని తాజా అధ్యయనం పేర్కొన్నది. న్యూయార్క్‌లోని పరిశోధకులు ఏజ్ - రిలేటెడ్ డిక్లైన్‌కు దోహదపడే శరీరంలోని పాత, అరిగిపోయిన కణాలను లక్ష్యంగా చేసుకున్నారు. వాటిని తొలగించడానికి CAR T- కణాలు అని పిలువబడే ప్రత్యేక రోగనిరోధక కణాలను ఉపయోగించి కొత్త చికిత్సను అభివృద్ధి చేశారు. ఈ ఎగ్జాయిటింగ్ డెవలప్‌మెంట్ వయస్సు-సంబంధిత వ్యాధుల చికిత్సలో, అలాగే ఏజ్ రిలేటెడ్ జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని రీసెర్చర్స్ అంటున్నారు.

సెల్యులార్ డిస్టర్బెన్స్

ఏజ్‌బార్ అవుతున్న కొద్దీ శరీరంలో వృద్ధాప్య కణాలు పేరుకుపోతాయి. ఇవి కొత్త కణాల పుట్టుకను డిస్టర్బ్ చేస్తాయి. పైగా వాటి చుట్టుపక్కల ఉండే కణజాలాలకు వాపు, నొప్పి వంటివి కలిగించే హానికరమైన పదార్ధాలను స్రవిస్తాయి. ఒక విధంగా ఇవి శరీరంలోని సెల్యులార్ వరల్డ్‌లో ప్రమాదకరమైన నైబర్‌హుడ్స్‌లా ఉంటాయి. కాలక్రమేణా డయాబెటిస్ మొదలు కొని ఫిజికల్ ఫిట్‌నెస్ తగ్గడం వరకు వివిధ వయస్సు సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి.

CAR T కణాలతో చికిత్స

పరిశోధకులు ఎలుకలపై చేసిన ఒక ప్రయోగంలో వృద్ధాప్యానికి కారణం అయ్యే సెనెసెంట్ కణాలను CAR T కణాల ద్వారా నాశనం చేసి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే పద్ధతిని సైంటిస్టులు కనుగొన్నారు. ఈ థెరపీలో భాగంగా CAR T-సెల్స్‌ uPAR అని పిలువబడే ప్రోటీన్ ఆధారంగా సెనెంట్ కణాలను గుర్తించి తొలగిస్తాయి. ఫలితంగా వృద్ధాప్యం ఆలస్యం అయ్యే చాన్స్ పెరుగుతుందని పరిశోధకుడు, కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ (CSHL) అసిస్టెంట్ ప్రొఫెసర్ కోరినా అమోర్ వేగాస్ తెలిపారు. భవిష్యత్తులో వృద్ధాప్యాన్ని అడ్డుకోగల అవకాశాలపై తమ పరిశోధన క్యూరియాసిటీని పెంచిందని పరిశోధకులు అంటున్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈ చికిత్స మానవులకు అందుబాటులోకి రావడానికి ముందు మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story