Relationships: సంబంధాల్లో ‘I need personal space’ అంటే ఏమిటి?

by Javid Pasha |
Relationships: సంబంధాల్లో ‘I need personal space’ అంటే ఏమిటి?
X

దిశ, ఫీచర్స్ : ‘‘ఐ నీడ్ పర్సనల్ స్పేస్’’ (I need personal space) ఈ మాట మీరు వినడం గానీ, అనడం గానీ ఎప్పుడైనా చేశారా? ఒక వ్యక్తి నలుగురిలో ఉన్నప్పుడో లేదా తన భాగస్వామితో కలిసి ఉన్నప్పుడో ఆ క్షణంలో ఏదైనా ఇబ్బందిగా అనిపించ్చు. తాను కాసేపు ఒంటరిగా ఉంటే రిలాక్స్ అవుతానని భావించవచ్చు. అలాంటప్పుడే కోరుకునేదే ‘పర్సనల్ స్పేస్’ అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ వర్డ్‌గా మారిపోయింది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వాముల మధ్య కూడా ‘పర్సనల్ స్పేస్’ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

‘నాకు కొంచెం పనుంది. కాసేపు డిస్టర్బ్ చేయకండి. ఒంటరిగా వదిలేయండి’’ రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు భాగస్వామి నోటి నుంచి ఈ మాట వెలువడితే వినే వ్యక్తికి ఇబ్బందిగా అనిపించవచ్చు. భార్య భర్తల మధ్య రహస్యాలేం ఉంటాయని భావించవ్చు. కానీ ఇలాంటప్పుడే అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించడం సంబంధాన్ని బలోపేతం చేస్తుందని రిలేషన్‌షిప్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు చెప్తున్నారు. ఈ రోజుల్లో చదువు, కెరీర్, కుటుంబ సమస్యలు వంటి కారణాలతో రకరకాల సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కోవడం కొందరికి సహజమే. అలాంటప్పుడు భార్యా భర్తలైనా, ప్రేమికులైనా సంబంధంలో ‘పర్సనల్ స్పేస్’ కోరుకోవడం కూడా ఇప్పుడు ప్రాధాన్యతగల అంశంగానే నిపుణులు చెప్తున్నారు. ‘‘నేను కొంచెం మాట్లాడాలి. నువ్వు నన్ను ఫ్రీగా ఉండనివ్వట్లేదు. నీవల్ల నేను చాలా మిస్ అవుతున్నాను. నాకంటూ పర్సనల్స్ ఉండదా? ’’అని ఎవరో ఒకరు అనడం సహజమే. అయితే సంబంధంలో పరస్పరం అర్థం చేసుకోవడం, అవగాహనతో, నమ్మకంతో ఉండటం వల్ల ఇలాంటప్పుడు అపార్థాలకు అవకాశం ఉండదు. పైగా పర్సనల్ స్పేస్ కలిగి ఉండటం, ఇతరులు అడిగినప్పుడు ఇవ్వడం ఆదర్శవంతమైన వ్యక్తిత్వ లక్షణంగా నిపుణులు చెప్తున్నారు.

అనుమానం - అనుబంధం

జీవిత భాగస్వామి పర్సనల్ స్పేస్ కోరుకోవడం అనేది సంబంధాల మధ్య అనుమానాలకు కారణం అవుతుంది, కాబట్టి అలాంటి రహస్యాలేవీ ఉండకూడదు అంటుంటారు కొందరు. కానీ ఇది కరెక్ట్ కాదని నిపుణులు చెప్తున్నారు. పర్సనల్ స్పేస్ అడగడం అవసరం మాత్రమే కాదు, ఇప్పుడొక హక్కు కూడాను అంటున్నారు. అది ఎంత స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ప్రతీ వ్యక్తి పర్సల్ స్పేస్ కలిగి ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదంటున్నారు నిపుణులు. పైగా ఈ విషయాన్ని గౌరవించడం, అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే సంబంధాలు మరింత బలోపేతం అవుతాయంటున్నారు.

కారణాలు - రకాలు

పర్సనల్ స్పేస్ అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం, భావోద్వేగాలతో కూడా సంబంధం కలిగి ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. కొందరు తమ ప్రత్యేక అవసరాల కోసం ఇలా కోరుకోవచ్చు. వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు కూడా ఇమిడి ఉండవచ్చు. రిలేషన్‌షిప్‌లో సఖ్యత లేకపోవడంవల్ల కూడా కొందరు కాసేపు ప్రశాంతతకోసం ‘ఐ నీడ్ స్పేస్’ అనవచ్చు. అలాగనీ అన్ని సందర్భాల్లోనూ ప్రత్యేక కారణాలే ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి పర్సనల్ స్పేస్ కోరుకోవడాన్ని తప్పుగా భావించకూడదు అంటున్నారు నిపుణులు.

దుర్వినియోగం చేయకండి!

‘పర్సనల్ స్పేస్’ కోరుకోవడంవల్ల అనుమానాలకు దారితీసే అవకాశం ఈ రోజుల్లో చాలా వరకు తగ్గింది. అయినప్పటికీ కొందరు దానిని దుర్వినియోగం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని కూడా నిపుణులు చెప్తున్నారు. జీవిత భాగస్వామి తన బంధువులో, స్నేహితులో, కుటుంబ సభ్యులో ఇలా ఎవరో ఒకరితో మాట్లాడుకోవడానికి పర్సనల్ స్పేస్ కోరుకోవచ్చు. అయితే ఆ స్పేస్‌ను దుర్వినియోగం చేస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. భాగస్వామిలో నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు, ఎక్కడ పరిమితులు అవసరమో, ఎక్కడ పర్సనల్ స్పేస్ కావాలో తెలిసి మసలు కోవాలంటున్నారు నిపుణులు. భాగస్వాముల మధ్య అన్యోన్యత, పరస్పరం అర్థం చేసుకోవడం, అభిప్రాయాలు, ఆలోచనలు, సరిహద్దులను గౌరవించడం వంటివి కలిగి ఉన్నప్పుడు ‘పర్సనల్ స్పేస్’ అనుమానాలకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉండదని నిపుణులు చెప్తున్నారు.

ఇది కూడా ముఖ్యమే

ఒక వ్యక్తి సంబంధంలోకి ప్రవేశించక ముందు పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా ఎంతోమంది ఆయా సందర్భాల్లో మద్దతుగా నిలుస్తుంటారు. పెళ్లయ్యాక వారిని మిస్ అయిన భావన ఏర్పడవచ్చు. అలాగే వారితో తమ బాధలో, సంతోషాలో పంచుకోవాలని కూడా అనిపించవచ్చు. ఇలాంటప్పుడు పర్సనల్ స్పేస్ అవసరం అవుతుంది. ఇదంతా అర్థం చేసుకొని మసలుకుంటేనే భాగస్వాములు ‘పర్సనల్ స్పేస్’ అనే మాటను గౌరవిస్తారు. ఎలాంటి అనుమానాలకు, సమస్యలకు అవకాశం ఉండదు. అంతేకాకుండా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడం, సామాజిక సంబంధాలు పెంపొందించుకోవడానికి కూడా పర్సనల్ స్పేస్ అవసరం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed