Fish for old sarees : పాత చీరలకు పచ్చి చేపలు.. ఎగబడుతున్న జనం

by Bhoopathi Nagaiah |
Fish for old sarees : పాత చీరలకు పచ్చి చేపలు.. ఎగబడుతున్న జనం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యానికి సీ ఫుడ్ ఎంతో మంచిది. ముఖ్యంగా కంటి చూపునకు చేపలను ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు సైతం సూచిస్తుంటారు. సముద్ర, నది తీర ప్రాంత ప్రజలు చేపలను ఆహారంగా విరివిగా తీసుకుంటున్నా.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కొంత కొరతే అని చెప్పాలి. వేసవిలో చెరువులు, కుంటల్లో దొరికే చేపలే వాళ్లకు దిక్కు. లేదా సమీప పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్లకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. కానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఫ్రీగా పచ్చి చేపలు దొరుకుతుండటంతో తెగ సంతోషిస్తున్నారు. పాత చీర ఉంటే చాలు.. పైసా ఖర్చు లేకుండా కిలోల కొద్ది చేపలు వారి సొంతం అవుతున్నాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, కాల్వలకు వరదనీరు పోటెత్తింది. ఈ వరదలకు చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దుకూతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు కాల్వల్లో, వాగుల్లోకి పోటెత్తాయి. వీటిని చూసిన గ్రామస్తులు పాత చీరలను వలగా మార్చి వాగుల్లో వరదకు ఎదురెక్కుతున్న చేపలను పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి పాత చీరలో కేజీ నుంచి ఆరెడు కిలోల బరువున్న చేపలు పడుతున్నాయి. వీటిల్లో తమకు సరిపోగా మిగిలిన చేపలను సమీప గ్రామాల ప్రజలకు విక్రయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో పంట పొలాల్లోనూ చేపలు తిరుగుతున్నాయి. అలాగే ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చేపలు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయ్‌. బేతుపల్లి ప్రాజెక్ట్‌ నిండి పొంగి పొర్లుతుండటంతో రుద్రాక్షపల్లి వాగు వెంబటి టన్నులకొద్దీ చేపలు కొట్టుకొస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed