EV వైపు ఇండియన్స్ చూపు.. కొత్త అధ్యయనంలో వెల్లడి!

by Disha News Desk |
EV వైపు ఇండియన్స్ చూపు.. కొత్త అధ్యయనంలో వెల్లడి!
X

దిశ, ఫీచర్స్ : డెలాయిట్ చేపట్టిన 'గ్లోబల్ ఆటోమోటివ్ కన్జూమర్ స్టడీ 2022' ప్రకారం, మూడో వంతుకు పైగా భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిఫైడ్, హైబ్రిడ్ వాహనాలపై ఆసక్తి చూపారు. దాదాపు 59 శాతం ఇండియన్ యూజర్స్ 'వాతావరణ మార్పు, పొల్యూషన్ లెవెల్స్, పెట్రోల్/డీజిల్ వాహనాల ఉద్గారాల' గురించి ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తక్కువ ఇంధన ఖర్చులు, పర్యావరణ స్పృహ కారణంగా EVలపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

సర్వేలో భాగంగా డెలాయిట్ 895 మంది వ్యక్తులను ప్రశ్నించింది. వీరిలో 58 శాతం తమ తదుపరి కొనుగోలుగా పెట్రోల్/డీజిల్ వాహనానికే ఓటేయగా, 21 శాతం హైబ్రిడ్ వాహనాన్ని ఎంచుకున్నారు. ఇక 11 శాతం మంది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెహికల్(PHEV)పై ఇంట్రెస్ట్ చూపించారు. అయితే పూర్తిగా ఎలక్ట్రిక్ కారును కోరుకుంటున్న వారు 5 శాతం మాత్రమే ఉన్నారు. దాదాపు 78 శాతం ప్రజలు రూ. 5 - 25 లక్షల రేంజ్‌‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడతారని.. ఈ వాహనాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలను పరిగణనలోకి తీసుకుంటాయని నివేదిక పేర్కొంది. వాహనానికి సంబంధించి తక్కువ మెయింటెనెన్స్ అండ్ రన్నింగ్ కాస్ట్, మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు పన్ను ప్రయోజనాల కోసమే వినియోగదారులు EV వైపు ఆకర్షితులవుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది.

కాగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలు నిర్ణయం విద్యుత్ ధరలపైనా ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనం సూచిస్తోంది. అయితే విద్యుత్ ధరలు శిలాజ ఇంధనాల స్థాయిలో ఉన్నప్పటికీ 61 శాతం ప్రజలు మొబిలిటీ కోసం EV కొనుగోలుకే ఆసక్తి చూపుతుండగా.. 37 శాతం మాత్రం పునరాలోచిస్తామని చెప్పారు. ఇక తమ వాహనాన్ని చార్జ్ చేసే విషయానికొస్తే 76 శాతం వినియోగదారులు తమ EVలను స్మార్ట్‌ఫోన్‌గా పరిగణించాలని, ఆఫీస్‌లు లేదా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్‌లో కాకుండా ఇంట్లోనే చార్జ్ చేసుకునే వీలుండాలని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం EV చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన నిబంధనలను ఇటీవలే సవరించింది. గృహాలు లేదా కార్యాలయాల వద్దగల విద్యుత్ కనెక్షన్స్‌ ఉపయోగించి e-వెహికల్ చార్జ్ చేసుకునేందుకు అనుమతించింది. EV మార్కెట్ వైపు వినియోగదారులను పుష్ చేసేందుకు దీన్ని ఒక ప్రోత్సాహకంగా చెప్పొచ్చు.

Advertisement

Next Story