Depression : బాల్యంలో పుట్టినచోటు నుంచి కొత్త ప్లేస్‌కు వెళ్తే కుంగిపోతున్న పిల్లలు

by Sujitha Rachapalli |
Depression : బాల్యంలో పుట్టినచోటు నుంచి కొత్త ప్లేస్‌కు వెళ్తే కుంగిపోతున్న పిల్లలు
X

దిశ, ఫీచర్స్: ఒక ప్రాంతం వెనుకబడి ఉన్నట్లయితే, జీవనోపాధి కరువైతే.. అక్కడి నుంచి మరో చోటుకి వెళ్తుంటారు. భార్య, పిల్లలతో సొంత ఊరిని వదిలి పయనిస్తారు. అయితే 10-15 ఏళ్లు ఉన్నప్పుడు ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న పిల్లల్లో.. పెద్దయ్యాక మానసికంగా అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నట్లు తాజా అధ్యయనం చెప్తుంది. JAMA సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం.. డెన్మార్క్‌లో 1981 - 2001 మధ్య జన్మించిన దాదాపు 1.1 మిలియన్ల మంది నివాస స్థలాలను విశ్లేషించింది. వారి జీవితంలో మొదటి 15 సంవత్సరాలలో ఎక్కడికి, ఎన్ని సార్లు వెళ్లారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. అదే వ్యక్తులను యుక్తవయస్సులోనూ ట్రాక్ చేసింది. కనీసం 35,000 మంది డిప్రెషన్‌కు సంబంధించిన వైద్య నిర్ధారణను పొందినట్లు గుర్తించింది.

ముఖ్యంగా 10 నుంచి 15 సంవత్సరాల మధ్య ఒకసారి వెళ్లిన పిల్లలు.. పుట్టిన ప్రాంతం నుంచి వెళ్లని వారి కంటే 41% ఎక్కువ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. అదే రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువగా జరిగితే.. ప్రమాదం దాదాపు 61% వరకు పెరుగుతుంది. ఇది అణగారిన పరిసరాల్లో పెరగడం కంటే బలమైన ప్రభావంగా చెప్తున్నారు విశ్లేషకులు. కాగా ప్రపంచ జనాభాలో 13% మంది ఏదో ఒక రకమైన మానసిక ఆరోగ్య పరిస్థితితో జీవిస్తున్నారని అంచనా. కాగా వీటిలో ఒకటి బాల్యంలో కొత్త పరిసరాలకు వెళ్లడం వల్ల కలుగుతుందని చెప్పడమే ఈ అధ్యయనం లక్ష్యం. అంతేకాదు ఇలాంటి పిల్లల్లో ఆత్మహత్యాయత్నం, హింసాత్మక నేరాలు, మానసిక అనారోగ్యం, దుర్వినియోగం వంటి ప్రతికూల ఫలితాలను అనుభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

Advertisement

Next Story