- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చివరి సంపూర్ణ చంద్రగ్రహణం.. రాష్ట్రంలోని ఆలయాలు మూసివేత
దిశ, డైనమిక్ బ్యూరో : ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండు గ్రహణాలు సంభవించాయి. నేడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇది చివరి, సంపూర్ణ చంద్ర గ్రహణం. మళ్లీ మూడేళ్ల తర్వాత 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే చాలా అరుదుగా సంభవించే గ్రహణాలు ఈసారి మనం చూస్తున్నాం. మొన్న దీపావళి నాడు సూర్యగ్రహణం ఏర్పడగా, కేవలం 15 రోజుల వ్యవధిలో మరొకటి, చంద్రగ్రహణం సంభవిస్తుంది. అది కూడా కార్తీక పౌర్ణమి నాడే చంద్రగ్రహణం సంభవించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేడు ఏర్పడే చంద్ర గ్రహణం కొన్ని నగరాల్లో సంపూర్ణంగాను.. హైదరాబాద్‌లో మాత్రం పాక్షికంగానే కనిపిస్తుందని జి.పి.బిర్లా ఆర్కియలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్(జీపీబీఏఏఎస్‌ఆర్‌ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రహణం ప్రభావంతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేశారు. తిరిగి రేపు ఉదయం ఆలయాలు తెరుచుకోనున్నాయి.
గంట 46 నిమిషాల పాటు చంద్రగ్రహణం..యాదాద్రి ఆలయం మూసివేత..
నేడు ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం గంట 46 నిమిషాల పాటు సంభవిస్తుంది. హైదరాబాద్‌లో సాయంత్రం 5.40 కు ప్రారంభమై.. 7.26 గంటలకు చంద్ర గ్రహణం ముగుస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేశారు. ఉదయం నిత్య కైంకర్యాల అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్య కైంకర్యాల అనంతరం ఉదయం 8.15 గంటలకు ఆలయాన్ని మూసివేసినట్లు వివరించారు. చంద్రగ్రహణం ముగిసిన తరవాత తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు నిర్వహించి, రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని పేర్కొన్నారు. తిరిగి రేపు ఉదయం యధావిధిగా ఆలయాన్ని తెరుస్తామని స్పష్టం చేశారు.
భద్రాద్రి ఆలయం మూసివేత..
భద్రాద్రి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. ఉదయం 7.30 గంటలలోపు మధ్యాహ్న నివేదన ఆరాధనలు పూర్తి చేసి..ఆలయ తలుపులు మూసివేశారు. సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు సీతారామానుజా చార్యులు తెలిపారు. 7.30 తర్వాత ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ.. దేవతామూర్తులకు అభిషేకాలు పూర్తయిన తర్వాత మళ్లీ మూసివేస్తామన్నారు. రేపు ఉదయం సుప్రభాత సేవ నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వెల్లడించారు.
కాళేశ్వరం ఆలయం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని మూసివేశారు. కాళేశ్వర ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలను ఉదయం 5.30లకు అర్చకులు ద్వారా బంధనం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి..అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ చేసి 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం మూసివేత..
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం స్వామివారి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. అలాగే దాని అనుబంధ ఆలయాల్లోనూ పూజల అనంతరం ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం నిర్వహించడంతో పాటు స్వామివారి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
కొండగట్టు, ధర్మపురి ఆలయాలు మూసివేత..
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయాలనూ మూసివేశారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ, అభిషేకం అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల తరువాత కొండగట్టు ఆలయంలో భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని ఆలయ అధికారులకు వెల్లడించారు.
గ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేతతో స్వామి వార్ల దర్శనాలు, బ్రహ్మోత్సవాలు, ఊరేగింపు సేవలు, సత్యనారాయణ వ్రతాలు, వాహన పూజలు, నిత్య కైంకర్యాలు, స్వామి వార్ల కల్యాణం, రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు అందరూ గ్రహించాలని కోరారు. యాదాద్రితో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలలో తిరిగి రేపు ఉదయం నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.
ఇవి కూడా చదవండి :