భార‌త్‌లో డ‌యాబెటీస్‌పై భయంకర నిజాలు వెల్లడి

by Sridhar Babu |   ( Updated:2023-06-29 06:54:23.0  )
భార‌త్‌లో డ‌యాబెటీస్‌పై భయంకర నిజాలు వెల్లడి
X

దిశ, వెబ్​డెస్క్​ : డ‌యాబెటీస్...​ ప్రస్తుతం ఎక్కడ విన్నా, ఏ ఇంట్లో చూసినా దీని గురించే చర్చ. ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఈ జబ్బుతో బాధపడుతున్న వారు ఉంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా సంక్రమిస్తున్న వ్యాధి ఇది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో రోగులు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్న విషయం. మరో పక్క వైద్య రంగానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెడుతున్న వ్యాధి. అయితే భారతదేశంలో ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది. కొన్ని అధ్యయనాలు వెల్లడించిన వివరాలు చూస్తే ఒల్లు ఝల్లుమనక మానదు. ఒక‌ప్పుడు వృద్ధులు, మ‌ధ్య‌వ‌య‌స్కులే దీని బారిన ప‌డ‌గా.. ఇప్పుడు బాల‌ల్లోనూ క‌నిపిస్తోంది.

ఒక‌ప్పుడు న‌గ‌రాల్లో ఉన్నత వ‌ర్గాల వారికే ఈ జ‌బ్బు వచ్చేది. కానీ నేడు అన్ని చోట్ల, అన్ని వర్గాల వారికి ఇది సంక్రమిస్తుంది. ప్ర‌స్తుతం మన దేశంలో సుమారు 10 కోట్ల మంది మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్నార‌ని కొన్ని అధ్యయన సంస్థలు వెల్లడించాయి. ద లాన్సెట్ డ‌యాబెటిస్, ఎండోక్రైనాల‌జీ జ‌ర్న‌ల్‌లో ఈమేరకు కథనాలు ప్ర‌చురితమయ్యాయి. మ‌ద్రాస్ డ‌యాబెటిక్ రీసెర్చ్ ఫౌండేష‌న్ (ఎండీఆర్ ఎఫ్‌), ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా ఈ అధ్య‌య‌నాన్ని చేప‌ట్టాయి. ఒక్కో ద‌శ‌లో 5 రాష్ట్రాల చొప్పున ఒక్కో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి 2800 మందిని, ప‌ట్ట‌ణ ప్రాంతాల నుంచి 1200 మందిని ఈ రీసెర్చ్ కోసం ప్ర‌శ్నించారు. డ‌యాబెటిక్‌కు సంబంధించి ఇది ప్ర‌పంచంలోనే జ‌రిగిన అతిపెద్ద స‌ర్వే. ఈ స‌ర్వేలో 1,13,000 మందిని నేరుగా కలిసి వివరాలు తెలుసుకున్నారు.

ఏం గుర్తించారంటే....

దేశంలో డయాబెటిక్‌ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతోంద‌ని ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది. 2019లో సుమారు 7 కోట్ల మంది మ‌ధుమేహులు ఉండ‌గా.. మూడేళ్ల‌లోనే ఆ సంఖ్య 10 కోట్ల‌ను దాటింది. గోవా ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి, కేర‌ళ ఉన్నాయి. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ లో కేవ‌లం 4.8 శాతం మంది డ‌యాబెటిక్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని తేల్చారు. మొత్తం కేసుల్లో ప‌ట్ట‌ణ ప్రాంత ప్ర‌జ‌ల్లో 16.4 శాతం మంది, ప‌ల్లె ప్ర‌జ‌ల్లో 8.9 మంది మ‌ధుమేహం బారిన‌ప‌డ్డార‌ని స‌ర్వే తెలిపింది. శారీర‌క శ్ర‌మ ప‌ట్ట‌ణ ప్రాంత ప్ర‌జ‌ల్లో త‌క్కువ‌గా ఉండ‌ట‌మే దీనికి కార‌ణమని వారు పేర్కొన్నారు.

Read More: మహిళలు నగ్నంగా దుక్కిదున్నే గ్రామం ఇదే.. ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి కూడా! ఇదంతా దానికోసమే!!

Advertisement

Next Story