ఆహార భద్రతకు ముప్పు.. పంటలపై ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రభావమే కారణమంటున్న నిపుణులు

by Prasanna |   ( Updated:2023-05-06 07:41:35.0  )
ఆహార భద్రతకు ముప్పు.. పంటలపై ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రభావమే కారణమంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ మానవ ఆరోగ్యాలనే కాకుండా ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ సంవత్సరం 10 నుంచి 23 శాతం పంటలు ఈ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల అదనంగా 20 శాతం పంట నష్టం వాటిల్లుతోందని , పంటల ఉత్పత్తి తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచ ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐరోపాకే పరిమితమైన ఈ పంటల ఇన్ ఫెక్షన్ ఇతర దేశాలకు మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్తున్నారు.

శిలీంధ్రాల వ్యాప్తి

నిజానికి శిలీంధ్రాలు(ఫంగస్) మొక్కలలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే విభిన్న జీవుల సమూహం. అవి బీజాంశాల(spores) ద్వారా పునరుత్పత్తి అవుతుంటాయి. గాలి, నీరు, కీటకాల ద్వారా కూడా వ్యాపించగలిగే తేలికైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఒక బీజాంశం ఒక మొక్కపై దిగిన తర్వాత అది ఫంగస్‌కు కేంద్ర బిందువుగా మారుతుంది. ‘‘వేడెక్కుతున్న వాతావరణం, క్లైమేట్ చేంజ్ ప్రభావాల కారణంగా విస్తృతమవుతున్న శిలీంధ్రాలవల్ల, ఆహార కొరత ఏర్పడటంతోపాటు భవిష్యత్తులో ఆరోగ్య విపత్తును మనం చూసే పరిస్థితి రావచ్చు’’ అని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ ప్రొఫెసర్, పరిశోధకుడు సారా గుర్ (Sarah Gurr) అంటున్నారు. ప్రస్తుతం గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగే కొద్దీ పంట వినాశనానికి కారణమైన ఫంగస్ కూడా ఆ పరిస్థితికి తట్టుకోగల సహనశక్తిని పెంపొందించుకుని, మరింత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని అతను హెచ్చరించాడు.

ఆహార నిల్వలపై ఎఫెక్ట్

ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు 600 మిలియన్ల నుంచి 4 బిలియన్ల మందికి ఒక ఏడాదిపాటు ప్రతిరోజూ 2,000 కేలరీలను అందించడానికి తగినంత ఆహారానికి సమానం. ఎందుకంటే శిలీంధ్రాలు ప్రధానంగా వరి, గోధుమలు, మొక్కజొన్న, సోయా బీన్స్, బంగాళాదుంపలు వంటి ఐదు ముఖ్యమైన కేలరీలకు నెలవైన పంటలను ప్రభావితం చేస్తాయి. దీనికితోడు ప్రపంచ జనాభా పెరుగుదల, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కలిసి భవిష్యత్తులో ఆహార ఉత్పత్తికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే ఐరోపా దేశాల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో భారీ పంట నష్టాలను చివి చూస్తున్నామని మరో పరిశోధకుడు ఎవా స్టుకెన్‌బ్రాక్ అన్నారు. జాగ్రత్త పడకపోతే ఈ ఆందోళనకరమైన ధోరణి మరింత తీవ్రమవుతుందని, అభివృద్ధి చెందుతున్న, అలాగే అభివృద్ధి చెందని దేశాలలో కూడా ఆహార నిల్వలు క్షీణించే ప్రమాదం ఉందని స్టుకెన్ బ్రాక్ పేర్కొన్నాడు .

ప్రత్యామ్నాయం ఏది?

గ్లోబల్ వార్మింగ్, పంటలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పును ఎదుర్కోవాలంటే.. అందుకు దారితీసే పరిస్థితులను నివారించాల్సిన అవసరం ప్రపంచ దేశాలపై ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అలాగే ఉత్పాదకతను పెంచే ప్రయత్నంలో వ్యవసాయ పద్ధతుల్లో అనువైన మార్పులు తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ నిరోధక జన్యువుల శ్రేణిని కలిగి ఉన్న విత్తన మిశ్రమాలను నాటడం కూడా ప్రత్యామ్నాయం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రపంచం పంటలకు సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ను ఎదుర్కోవడానికి తగిన మద్దతు, స్పష్టమైన విధానం కూడా అవసరం.

Read More: ద్రవ్యోల్బణం నియంత్రణకు భారత్ కృషి చేస్తోంది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Advertisement

Next Story

Most Viewed