Food for Hemoglobin : హిమోగ్లోబిన్ పెంచే అద్భుత ఆహారాలు.. దేనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే..

by Javid Pasha |   ( Updated:2024-09-11 16:52:10.0  )
Food for Hemoglobin : హిమోగ్లోబిన్ పెంచే అద్భుత ఆహారాలు.. దేనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే..
X

దిశ, ఫీచర్స్: కాసేపు నడవగానే అలసిపోవడం, ఎక్కువసేపు కూర్చున్నా నీరసంగా అనిపించడం, పని మీద ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి రక్తహీనతవల్ల కూడా కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి వారిలో హిమోగ్లోబిన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి పలు రకాల శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎర్రరక్త కణాలలో ఉండే ఒక రకమైన ప్రోటీన్‌నే హిమోగ్లోబీన్ అంటారు. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇది తగ్గితే గనుక మనుషులు శక్తిహీనంగా లేదా బలహీనంగా మారుతారు. కాబట్టి ఎప్పుడూ తగిన స్థాయిలో ఉండేలా చూసుకోవడం మంచిది. అందుకోసం ఎలాంటి ఆహారాలు ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం.

* చిక్కుళ్లు, బీన్స్ : వివిధ కాయగూరలు.. ముఖ్యంగా చిక్కుళ్లు, బీన్స్ వంటి వాటిలో నాన్ హీమ్ ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడంవల్ల హిమోగ్లోబిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు ఫైబర్, పలు రకాల కూరగాయలు, సలాడ్లు, సూప్‌లు, ఫోలేట్ అధికంగా ఉండే కాయధాన్యాలు తీసుకోవడం శరీరంలో ఎర్ర రక్తకణాలు, విటమిన్ బి, హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడతాయి.

* పాలకూర : విటమిన్ సితోపాటు నాన్ హీమ్ ఐరన్, విటమిన్ ఎ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదంటారు నిపుణులు. కంటి చూపును మెరుగు పర్చడంలో, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచుగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

* క్వినోవా: ఇది కూడా ఒక రకమైన ధాన్యం. మార్కెట్లలో లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, డైటరీ ఫైబర్స్ అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు ఆహారంలో భాగంగా దీనిని తరచుగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. నాన్ హీమ్ ఐరన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, శరీరానికి అవసరమైన ఆమ్ల గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్‌ను పెంచడంలో అద్భుతమైన ఆహారంగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

* కొమ్ము శెనగలు : కొమ్ము శెనగల గురించి అందరికీ తెలిసిందే. శెనగ పప్పు వీటి నుంచే తయారు చేస్తారు. వీటిని ఉడకబెట్టి తినడానికి ఉపయోగిస్తుంటారు. నార్త్ ఇండియాలో అయితే చిరుతిళ్లలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. తెలంగాణలో ఉడకబెట్టిన శెనిగ గుడాలను ఇష్టంగా తింటారు. వివిధ కూరల్లో వాడుతుంటారు. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో కొమ్ము శెనగలు అద్భుతంగా పనిచేస్తాయి.

* గుమ్మడి గింజలు : మెగ్నీషియం, జింక్ ఫుల్లుగా ఉంటాయి. నాన్ హీమ్ ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి గుమ్మడి గింజలు వివిధ రూపాల్లో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిని కూరల్లో వేసుకోవడం ద్వారా, పెంకుపై వేయించుకోవడం ద్వారా ఉపయోగించవచ్చు. హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడంలో సహాయపడతాయి.

* బీట్‌రూట్ : ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అద్భుతంగా సహాయపడే ఆహారాల్లో బీట్ రూట్ ఒకటి. ఇందులో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా హిమోగ్లోబిన్ పెంచడంలో బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. రక్తహీనతతో ఇబ్బందిపడేవారు మూడు రోజులకు ఒకసారైనా తింటూ ఉంటే సమస్య నుంచి బయపటడతారు. దీంతోపాటు బ్రోకలీ, చిలగడ దుంపలు, వివిధ తృణ ధాన్యాలు కూడా శరీరంలో హిమోగ్లోబిన్ ప్రోటీన్ పెరిగేందుకు సహాయపడతాయి.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే పోషకాహార నిపుణులను సంప్రదించగలరు.


Also Read: Calcium deficiency : శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? కారణం అదే కావచ్చు!


Advertisement

Next Story

Most Viewed