భయం, అసహ్యంతో కడుపులో వింత అనుభూతి.. కారణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు

by sudharani |
భయం, అసహ్యంతో కడుపులో వింత అనుభూతి.. కారణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఎక్కువగా భయపడుతున్నప్పుడు కడుపులో ఒక వింత అనుభూతి కలుగుతుంది. భయానకం, అసహ్యం, షాక్ వంటి తీవ్రమైన భావోద్వేగాలు కడుపు pHని మార్చగల శక్తిని కలిగి ఉంటాయని, అందుకే ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. జీర్ణశయాంతర (GI) సంకేతాలు ఒక వ్యక్తి అనుభూతి చెందే భావోద్వేగాలతో విచిత్రమైన సంబంధాన్ని పంచుకోవడమే ఇందుకు కారణమని తెలిపారు. ఉదాహరణకు ఒక వ్యక్తి బెదిరింపు పరిస్థితిని ఎదుర్కొంటుంటే వారి గట్ pH తగ్గిపోతుంది, కడుపు ఆమ్లంగా మారుతుందని వివరించారు.

ఇందుకోసం రోమ్‌లోని సపియెంజా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న 31 మంది పురుషులతో ఒక ఆసక్తికరమైన ప్రయోగాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరి గట్ యాక్టివిటీని పర్యవేక్షించడానికి సెన్సార్‌లను కలిగి ఉన్న స్మార్ట్ పిల్‌ను అందించారు. తద్వారా జీర్ణవ్యవస్థ pH, ఉష్ణోగ్రతకు సంబంధించిన డేటాను సేకరించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆనందం, విచారం, భయం, అసహ్యం వ్యక్తం చేసే వివిధ రకాల భావోద్వేగ కంటెంట్‌ని కలిగి ఉన్న విభిన్న వీడియో క్లిప్‌లను చూపించారు.

ప్రతి క్లిప్ తొమ్మిది-సెకన్ల నిడివిని కలిగి ఉండగా.. అది చూసిన తర్వాత వారు అనుభవించిన భావోద్వేగాల గురించి వివరించమని కోరారు. స్మార్ట్ పిల్ ద్వారా సేకరించిన డేటాతో పాటు ఈ ప్రతిస్పందనలను పరిశీలించారు. భయం లేదా అసహ్యం వంటి భావోద్వేగాలను అనుభవించినప్పుడు pH తగ్గింది, వారి కడుపులో ఆమ్లత్వం పెరిగింది. విచారంగా ఉన్నప్పుడు శ్వాస రేటు పెరిగింది. పూర్తిగా ఆశ్చర్యం కలిగించిన ఈ ఫలితాలు.. మనస్సు, గ్యాస్ట్రిక్ వ్యవస్థ మధ్య సంక్లిష్ట సంబంధాన్ని బయటకు తీయడంలో సహాయపడతాయి. ప్రేగు లేదా జీర్ణ రుగ్మతలకు సంబంధించిన పరిస్థితులు, అవి మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో మరింత మెరుగ్గా తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story