నాన్న.. స్నేహితుడు.. సేవకుడు...

by Sujitha Rachapalli |
నాన్న.. స్నేహితుడు.. సేవకుడు...
X

దిశ, ఫీచర్స్: నాన్న.. నా డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసే ఆచీవర్. నా బాధను తన బాధగా మార్చుకునే పెయిన్ రిలీవర్. ఎక్కడున్నా నా లైఫ్ ను తన చేతుల్లో పెట్టుకుని నడిపించే టార్చ్ బేరర్. ఆపద సమయాల్లో ఆదుకునే సూపర్ మ్యాన్. హ్యాపీగా ఉన్న టైమ్ ను రెట్టింపు చేసేందుకు ప్రయత్నించే జీనీ. నిస్వార్థంగా బతికే స్వార్థం.. కోపంగా కనిపిస్తూనే కన్నీళ్లు పెట్టుకునే అమాయకత్వం. తండ్రి గురించి వర్ణించేంత జీవిత అనుభవం లేదు కానీ జీవితాన్ని చదివిన తండ్రి నాకెప్పుడూ స్నేహితుడే.. చిరకాల సేవకుడే.

బాధ్యతే ఊపిరి

ఏదో సినిమాలో చూపించినట్లు మేము పుట్టకముందు రోడ్ సైడ్ రోమియోగా ఉన్న నాన్న.. నాన్న అయ్యాక పూర్తిగా మారిపోయాడట. పిల్లలను బాగా చూసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా విషయంలో ఆ ప్రయత్నాలు ఆపలేదు. తనకు నచ్చిందా లేదా అనే విషయాలను పక్కనపెట్టేసి.. మమ్మల్ని సంతోషపెట్టే పనులు చేస్తూనే ఉన్నాడు. పెళ్లి కాకముందు ఫ్రెండ్ గా ఉన్న నాన్న ఇప్పుడు మాకు, మా పిల్లలకు సేవకుడు అయిపోయాడు. జాబ్ చేసి రిటైర్మెంట్ ఇచ్చేసిన నాన్న.. అమ్మతోపాటు ఇంటి పనంతా చేస్తాడు. కానీ అందరు తిన్నాకే.. మా కడుపులు నిండాకే.. మిగిలింది ఆయన తింటాడు.

ఆశీర్వాదం నీ ఆయుధం

నిజానికి నాన్న జీవితం మొత్తం నిర్విరామంగానే లైఫ్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. అలుపెరుగని బాటసారిలా పయనిస్తున్నాడు. మాకు వచ్చిన కష్టాలు, సమస్యలను పరిష్కరించేందుకు కాలానికి ఎదురీదుతున్నాడు. నాకో జ్ఞాపకం ఉంది. నేను కాలేజీకి వెళ్లను.. ఇక చదువు ఆపేస్తా అన్నప్పుడు నాన్న చెప్పిన మాటలే నేను ఈరోజు ఫైనాన్షియల్ ఇడిపెండెంట్ గా నిలిచేందుకు కారణం అయ్యాయి. నాలోని శక్తిని నాకన్నా ముందు నాన్నే గ్రహించాడు. ఒక స్థాయిలో ఉండేందుకు ప్రోత్సహించాడు. నేను తప్పు చేస్తే సరిదిద్దాడు. విలువలను నేర్పాడు. పక్కనే ఉండి ధైర్యం ఇచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. కానీ మా నుంచి ఆశించేది శూన్యం. ఎందుకంటే ఆయన ఉన్నంతలోనే బతికేస్తాడు. నా పిల్లలు బాగుంటే చాలని కోరుకుని ఆశీర్వదిస్తాడు. ఆనందిస్తాడు.

హీరో.. విలన్..

కానీ ఇంత గొప్ప మనసున్న నాన్న ఎక్కడో వెనుకబడి పోయాడు. ఎందుకు.. అమ్మ కన్నా వెనుకే ఉన్నాడు. అంటే.. తల్లి కేవలం పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. వారి ఎదుగుదలకు ఎంతో కొంత పోగు చేయాలని ఆరాటపడుతుంది. కానీ నాన్న అలా కాదు పిల్లలతో పాటు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు. సొసైటీలోనూ కీర్తిప్రతిష్టలు పొందాలని అనుకుంటాడు. ఈ క్రమంలో పిల్లలను చూసుకున్నా.. సొసైటీ గురించి ఎంతో కొంత ఖర్చు పెడుతాడు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు అంటూ అందరినీ దగ్గరకు తీసుకుని.. ఆర్థికంగా నష్టపోతాడు. కానీ పరాయి వ్యక్తులు మనవాళ్ళు ఎలా అవుతారు అన్నట్లే.. లక్షల్లో నష్టం కలిగించి పక్కకు తప్పుకుంటారు. ఒక హీరోగా తిరిగిన ఇంట్లోనే నాన్నను విలన్ చేసి పడేస్తారు.

Advertisement

Next Story

Most Viewed