దెయ్యాలు, ఆత్మలు ఎందుకు వెంటాడుతాయి?.. నిర్మానుష్య ప్రదేశంలో వింత శబ్దాలు వినబడటం వెనుక రహస్యమేంటి ?

by Dishafeatures2 |
దెయ్యాలు, ఆత్మలు ఎందుకు వెంటాడుతాయి?.. నిర్మానుష్య ప్రదేశంలో వింత శబ్దాలు వినబడటం వెనుక రహస్యమేంటి ?
X

దిశ, ఫీచర్స్ : అదొక నిర్మానుష్యమైన ప్రదేశం. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. అక్కడక్కడా ఉన్న పచ్చని చెట్లు గాలికి ఊగుతున్నాయి. పనిమీద బయటకు వెళ్లిన ఒక వ్యక్తి తిరిగి ఇంటికి వస్తున్నాడు. సరిగ్గా ఆ నిర్మానుష్య ప్రదేశానికి రాగానే అతనిలో ఒక్కసారిగా గుండె దడ మొదలైంది. ఎందుకంటే ఆ వ్యక్తికి తనను ఎవరో వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది. ఏదో వింత శబ్దంతోపాటు రీసౌండ్ కూడా వినిపిస్తోంది. బహుశా దెయ్యమో, ఆత్మనో అరుస్తూ తనను వెంబడిస్తోందని భావించి భయంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇప్పటికీ పలువురు ఇటువంటి అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. నిర్మానుష్య ప్రదేశంలో దెయ్యాలు, ఆత్మలు తిరుగుతుంటాయని, అందుకే అలా జరగుతుందని నమ్ముతుంటారు. కానీ అది నిజం కాదంటున్నారు నిపుణులు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

లైవ్ సైన్స్ తాజా అధ్యయనం ప్రకారం.. నిర్మానుష్య లేదా నిర్జన ప్రదేశాల్లో ఏ దెయ్యాలు, ఆత్మలు ఉండవు. అసలు దెయ్యం అనేదే పెద్ద భ్రమ. అయితే ఒక వ్యక్తి అటువంటి ప్రదేశంలో నడుస్తున్నప్పుడు వెనుక నుంచి నీటి ప్రవాహం లాంటి సౌండ్, విమాన శబ్దం, వాషింగ్ మెషిన్ సౌండ్, ఇలా రకరకాల వింత స్వరాలు వినిపించడం వంటి అనుభవాలు కొందరికి ఎదురవుతుంటాయి. ఈ సందర్భంలోనే వారు ఏదో దెయ్యం తిరుగుతున్నట్లు చెప్తుంటారు. అయితే ఇలా వింత శబ్దాలు వినిపించడానికి అసలైన కారణం అప్పటికప్పుడు భయంతో పుట్టుకొచ్చే ‘ఆడిటరీ పరోడోలియా’ అనే తక్షణ మానసిక పరిస్థితి.

ఒంటరిగా వెళ్తున్నప్పుడు తమకు ఏదో జరుగుతుందనే ఆందోళన, దెయ్యాలు ఉంటాయేమోననే భయం కారణంగా మెదడులో ఒకప్రత్యేకమైన నమూనా ఏర్పడుతుంది. అది భ్రమను నిజమనుకునేలా మనిషిని ప్రభావితం చేస్తుంది. అదే ‘ఆడిటరీ పరోడోలియా’. వాస్తవానికి కొన్నిసార్లు ఇది భ్రాంతి కాకపోవచ్చు కూడా. కానీ అప్పటి వరకు లేని కొత్త శబ్దాలను వినగానే ఏర్పడుతుంది. సైన్స్ పరిభాషలో దీనిని మ్యూజికల్ ఇయర్ సిండ్రోమ్ అని కూడా పేర్కొంటారు. దీనిబారిన పడిన చాలామంది వ్యక్తులు ఎవరో తమను వెంటాడుతున్నారని లేదా దెయ్యాలు ఆత్మల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తుంటారని ‘హియరింగ్ లాస్’ పరిశోధకులు అంటున్నారు.

వాస్తవానికి మానవ మెదడుకు ఒక గొప్ప డేటాబేస్ ఉంటుంది. అప్పటికే తెలిసిన శబ్దాలు, పదాలను విన్నప్పుడు ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. తెలియని పదాలను వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఈ కారణంగానే నిర్మానుష్య ప్రదేశంలో ఆందోళన, భయం కారణంగా కొత్త శబ్దాలు వినపడటం, అప్పటికే మనసులో దెయ్యాలు, భూతాల గురించిన ఆలోచనతో నిండిపోవడం కారణంగా మెదడు వాస్తవాలకు బదులు భ్రమలకు సంబంధించిన సమాచారం వెంటనే గ్రహించడం జరిగిపోతుంది. అందుకే దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని భావిస్తుంటారు తప్ప అది నిజం కాదు.

Next Story

Most Viewed