ధోనీ కొట్టిన సిక్సే ఆర్సీబీకి కలిసొచ్చిందా?

by Harish |
ధోనీ కొట్టిన సిక్సే ఆర్సీబీకి కలిసొచ్చిందా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన కీలక పోరులో చెన్నయ్‌పై ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బెంగళూరు‌ ఆధిపత్యం ప్రదర్శించినా..ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందా?లేదా? అన్న టెన్షన్ చివరి వరకూ కొనసాగింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే చెన్నయ్‌కు ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమవ్వగా.. బౌలర్ యశ్ దయాల్ 7 పరుగులే ఇవ్వడంతో ఆర్సీబీకి నాకౌట్ బెర్త్ దక్కింది. అయితే, ఆఖరి ఓవర్‌లో ధోనీ కొట్టిన సిక్సే బెంగళూరుకు కలిసొచ్చిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ డ్రెస్సింగ్ రూంలో దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ..‘ధోనీ కొట్టిన 110 మీటర్ల సిక్స్ స్టేడియం అవతల పడటం మాకు కలిసొచ్చింది. అది మాకు కొత్త బంతిని అందించేలా చేసింది.’ అని చెప్పుకొచ్చాడు.

అయితే, ధోనీ సిక్స్ కొట్టడం బెంగళూరుకు ఎలా కలిసొస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. పలువురు దానికి వివరణ ఇచ్చారు. ఆఖరి ఓవర్‌లో ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే చెన్నయ్‌కు 17 పరుగులు కావాలి. జడేజా, ధోనీ అప్పటికే దూకుడుగా ఆడుతుండటంతో సీఎస్కేనే నాకౌట్‌కు చేరుతుందని అంతా భావించారు. మరోవైపు, తడి బంతితో బౌలింగ్ చేయడానికి ఆర్సీబీ బౌలర్లు ఇబ్బందిపడ్డారు. పలుమార్లు బంతి స్లిప్ అయ్యింది కూడా. ఆఖరి ఓవర్‌ వేసిన యశ్ దయాల్ తొలి బంతిని యార్కర్ వేయాలని ప్రయత్నించగా.. అది ఫుల్‌టాస్ పడింది. దాన్ని ధోనీ భారీ సిక్సర్ కొట్టగా.. అది స్టేడియం రూఫ్ టాప్‌పై పడింది. దీంతో యశ్ దయాల్ కొత్త బంతితో మిగతా ఓవర్‌ను పూర్తి చేశాడు. మిగతా ఐదు బంతుల్లో ధోనీని అవుట్ చేయడంతోపాటు ఒక్క పరుగే ఇవ్వడంతో ఆర్సీబీకి గెలుపుతోపాటు నాకౌట్ బెర్త్ దక్కింది. కొత్త బంతి డ్రైగా ఉండటంతో యశ్‌ దయాల్‌ తాను వేయాలకున్న చోట బంతిని సంధించి ఫలితం సాధించాడని విశ్లేషకులు చెబుతున్నారు.



Next Story