జీవ వైవిధ్యంలో మరో అద్భుతం.. సముద్రంలో వేలల్లో కొత్త జీవ జాతులు!

by Prasanna |
జీవ వైవిధ్యంలో మరో అద్భుతం.. సముద్రంలో వేలల్లో కొత్త జీవ జాతులు!
X

దిశ, ఫీచర్స్ : సముద్రాలు జీవ వైవిధ్యానికి నిలయమని మనకు ఇప్పటికే తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎన్నడు గుర్తించని 5,000 సరికొత్త జీవజాతులను పర్యావరణ శాస్త్రవేత్తలు పసిఫిక్ మహా సముద్రగర్భంలో కనుగొన్నారు. కొన్ని మెరైన్ కంపెనీలు మైనింగ్‌ అన్వేషణను ప్రారంభించిన తర్వాత పర్యావరణ వేత్తలు, బయాలజిస్టులు తమ అన్వేషణలో భాగంగా క్రూయిజ్‌లపై(cruises) పసిఫిక్ మహాసముద్రానికి వెళ్లారు. ఇక్కడ 5,000 కిలోమీటర్ల వైశాల్యంలో 4 వేల నుంచి 5, 500 మీటర్ల లోతులో విస్తరించి ఉన్న సముద్ర భాగంలోని క్లారియన్ క్లిప్పర్ జోన్(CCZ) ప్రాంతాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న లక్ష కంటే ఎక్కువ జీవ జాతులను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే వారు 5 వేల కొత్త జాతులు ఉన్నట్లు తెలుసుకున్నారు. వీటిలో 88 నుంచి 92 శాతం ముందెన్నడూ చూడలేనివని పేర్కొన్నారు.

సీసీజెడ్ ప్రత్యేకత

‘‘పసిఫిక్ మహా సముద్రంలోని సీసీజెడ్ జోన్‌ తక్కువ సూర్యరశ్మి, తక్కువ ఆహార లభ్యతతో కూడిన చీకటి ప్రాంతం. అయినప్పటికీ ఇక్కడి నోడ్యూల్ ఫీల్డ్ ఆవాసాలలో బెంథిక్ అకశేరుక జంతుజాలానికి సంబంధించిన(benthic invertebrate fauna) విభిన్న సమూహాలు ఉన్నాయి’’ అని పరిశోధకుల్లో ఒకరు, నేచురల్ హిస్టరీ మ్యూజియంలో పర్యావరణ శాస్త్రవేత్త మురియల్ రాబోన్ (Muriel Rabone) తెలిపారు. అంతేగాక ఇక్కడి కొన్ని అద్భుతమైన జాతులు చూడముచ్చగా ఉన్నాయని అతను పేర్కొన్నారు. కొన్ని స్పాంజ్‌లు క్లాసిక్ బాత్ స్పాంజ్‌ల వలె కనిపిస్తాయని, మరి కొన్ని కుండీల వలె(vases) కనిపిస్తాయని, వీటిలో గ్లాస్ స్పాంజెస్ అయితే మరీ ఆకట్టుకుంటున్నాయని పరిశోధకులు వెల్లడించారు. వెన్నుముకలను కలిగి ఉన్న ఈ జీవజాతులు మైక్రోస్కోప్ కింద చిన్న షాన్డిలియర్లు(tiny chandeliers) లేదా చిన్న శిల్పాల వలె కనిపిస్తాయని చెప్తున్నారు.

ఖనిజాలకు నిలయం

తాము కనుగొన్న ‘క్లారియన్ క్లిప్పర్ జోన్’ అనే లోతైన సముద్రపు అగాధం జీవజాతులకే గాక, ఖనిజ సంపదకు నిలయంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఇక్కడ బంగాళదుంప పరిమాణ(potato-sized) పాలీమెటాలిక్ నోడ్యూల్స్‌(polymetallic nodules)తో కప్పబడిన బురద అవక్షేపాలతో వర్గీకరించబడి ఉందని తెలిపారు. ఇది రాగి, నికెల్, కోబాల్ట్, ఇనుము, మాంగనీస్ వంటి ఖనిజాలకు వనరుగా ఉందని చెప్పారు. ‘కరెంట్ బయాలజీ’ సైంటిఫిక్ జర్నల్‌ ప్రకారం.. ఈ ప్రాంతం లోతైన సముద్రపు మైనింగ్‌కు భవిష్యత్ హాట్‌స్పాట్‌గా కూడా గుర్తించబడింది. అయితే సైంటిస్టులు దీనిని సమగ్రంగా నమోదు చేయడం ఇదే తొలిసారి. ఇక్కడ మైనింగ్ అన్వేషణ సముద్ర జీవజాలానికి, అలాగే పర్యావరణానికి ఏమైనా హాని కలిగిస్తుందా? అనే కోణంలోనూ తాము పరిశోధనలు కొనసాగిస్తున్నామని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులో జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed