70 ఏండ్ల పై బడిన వయస్సులో బిడ్డలకు జన్మనిచ్చిన వయోవృద్ధ తల్లులు వీరే..

by Sumithra |   ( Updated:2024-05-11 15:23:08.0  )
70 ఏండ్ల పై బడిన వయస్సులో బిడ్డలకు జన్మనిచ్చిన వయోవృద్ధ తల్లులు వీరే..
X

దిశ, ఫీచర్స్ : తల్లి కావడం అనేది ప్రపంచంలోని దాదాపు ప్రతి స్త్రీ అనుభవించాలనుకునే గొప్ప అనుభూతి. అయినప్పటికీ మొదటిసారిగా తల్లులు అయ్యే స్త్రీల సగటు వయస్సు నిరంతరం పెరుగుతోంది. నేటి మహిళలు దాదాపు 30 ఏళ్లలోపు తల్లులు కావడానికి ఇష్టపడతారని చాలా నివేదికలలో చెప్పారు. ఇంకా తల్లి కావడానికి సగటు వయస్సు ఇప్పటికీ 28 సంవత్సరాలు. వృద్ధాప్యంలో తల్లి అయిన బిరుదు భారతీయ మహిళకు ఉంది. మదర్స్ డే సందర్భంగా, ప్రపంచంలోని ఐదుగురు వృద్ధ మహిళా తల్లులు ఎవరో తెలుసుకుందాం.

65 నుంచి 75 సంవత్సరాల వయస్సులో పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారి సంకల్ప శక్తి, ఆధునిక పునరుత్పత్తి ఔషధం ద్వారా ఇది సాధ్యమైంది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ అత్యంత వృద్ధ తల్లిగా రికార్డు సృష్టించింది.

Read More...

అనేక సవాళ్లను ఎదుర్కొంటూ మాతృత్వాన్ని నిలబెట్టుకుంటున్న తల్లులు..


వృద్ధతల్లి రికార్డు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అర్రమట్టి మంగాయమ్మ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తల్లి. సెప్టెంబర్ 5, 2019 న, ఆమె ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) టెక్నిక్ ద్వారా కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అప్పుడు ఆమె వయస్సు 74 సంవత్సరాలు. ఆడపిల్లలు పుట్టే సమయానికి అర్రమట్టి వయస్సు (73) సంవత్సరాలు అని చాలా మీడియా కథనాలలో పేర్కొన్నప్పటికీ, ఆమె వైద్యుడికి ఇచ్చిన పత్రాలలో 74 సంవత్సరాలుగా ఉంది.

సుదీర్ఘ వైవాహిక జీవితం గడిపిన్పటికీ అర్రమట్టి, ఆమె భర్త సీతారాం రాజారావుకు పిల్లలు లేరు. అయినా బిడ్డను కనాలనుకున్నారు. కానీ అర్రమట్టి రుతువిరతి వయస్సుకి చేరుకుంది. ఆమె శరీరం అండం ఉత్పత్తి చేయడం మానేసింది. అలాంటి పరిస్థితిలో ఆమె IVF ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. దాత నుండి అండాన్ని తీసుకుంది. భర్త సీతారాం స్పెర్మ్ తీసుకున్నారు. IVF ద్వారా ఆమె మొదటిసారి గర్భవతి అయింది. గర్భం దాల్చిన సమయంలో, ఆడపిల్లలు పుట్టే సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాకపోవడంతో నేటికీ ఆమె తన కూతుళ్లను పెంచుతోంది. అయితే ఆడపిల్లలు పుట్టిన ఏడాదికే భర్త సీతారాం 84 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.

అమృత్‌సర్‌కు చెందిన దల్జీందర్ కౌర్ 72 ఏళ్ల వయసులో తల్లి..

అర్రమట్టి కంటే ముందు భారతదేశంలోని అమృత్‌సర్‌కు చెందిన దల్జీందర్ కౌర్ అత్యంత వృద్ధ తల్లిగా రికార్డు నెలకొల్పింది. ఆమె 72 సంవత్సరాల వయస్సులో అమృత్‌సర్‌లో 19 ఏప్రిల్ 2016న ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆమె భర్త మొహిందర్ సింగ్ గిల్ వయసు (79) సంవత్సరాలు. దాదాపు ఐదు దశాబ్దాల దాంపత్యం తర్వాత ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ ద్వారా ఈ ఆనందాన్ని పొందింది.

కాగా బిడ్డ పుట్టిన సమయంలో దల్జీందర్ కౌర్ వయస్సుకు సంబంధించి రెండు విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పటికి ఆమె వయసు 70 ఏళ్లని, అయితే బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రిలో ఆమె వయసు 72 ఏళ్లుగా నమోదైందని దల్జీందర్ తెలిపారు. అయితే డాక్టర్ అనురాగ్ విష్ణోయ్ దల్జీందర్ కౌర్‌కు IVF చికిత్స ప్రారంభించినప్పుడు వృద్ధురాలికి అలాంటి చికిత్స చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత విజయవంతంగా బిడ్డ జన్మించింది. ఆ తర్వాత ఇతర వృద్ధాప్య సంతానం లేని జంటలలో ఇది ఒక ఆశాకిరణంగా మారింది.

హిసార్‌కి చెందిన రాజో మృత్యువును ఓడించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది..

హర్యానాలోని హిసార్ నివాసి రాజో దేవి లోహన్ 2008 నవంబరు 28న ఆడబిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమె వయస్సు 70 సంవత్సరాలు. ఈమెకు ఆడపిల్ల పుట్టడంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసున్న తల్లిగా రికార్డు ఆమె పేరిట నమోదైంది. మీడియా కథనాల ప్రకారం తన కుమార్తె పేరు నవీన్. 2018 సంవత్సరంలో తన కుమార్తె వివాహం వరకు జీవించాలనేది తన కోరిక అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

కొడుకు కావాలనుకున్న ఓంకారి 70 ఏళ్ల వయసులో తల్లి..

రాజో దేవి లోహన్ కంటే ముందు, యుపిలోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓంకారీ పన్వార్ అదే వయస్సులో తల్లి అయ్యారు. జూన్ 27, 2008న, ఆమె సిజేరియన్ ద్వారా కవలలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఓంకారికి జనన ధృవీకరణ పత్రం లేనందున, 1947లో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందే సమయానికి ఆమెకు తొమ్మిదేళ్లు ఉన్నందున ఆమె వయస్సును లెక్కించారు. తనకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తనకు కొడుకు కావాలని పన్వర్ చెప్పాడు. అందుకే ఆమె, ఆమె భర్త చరణ్ సింగ్ పన్వార్ ఐవీఎఫ్ చికిత్సను ఆశ్రయించారు.


ఉగాండాకు చెందిన సఫీనా..

ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా కూడా 70 ఏళ్ల వయసులో తల్లి అయింది. ఆమె కంపాలాలోని ఉమెన్స్ హాస్పిటల్ ఇంటర్నేషనల్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్‌లో 29 నవంబర్ 2023న కవలలకు జన్మనిచ్చింది. ఆఫ్రికాలో అత్యంత పెద్ద తల్లి సఫీనా అని ఈ ఆసుపత్రి సోషల్ మీడియాలో పేర్కొంది. అయితే, దీనికి ముందు 2020లో కూడా సఫీనా తల్లి అయింది. అయితే ఆమె కవలలకు జన్మనివ్వబోతోందని తెలుసుకున్న భర్త ఆమెను వదిలేశాడు.

Advertisement

Next Story

Most Viewed