Dillman Of Telangana ఓడిపోవద్దు.. రాజీపడొద్దు.!

by Daayi Srishailam |
Dillman Of Telangana   ఓడిపోవద్దు.. రాజీపడొద్దు.!
X

లేవండి బ్రో..

పొద్దెక్కేదాక పడుకొని..

లైఫ్‌లో ఏం ఛేంజ్ రాలే మామా అని దీర్ఘాలు తీస్తే ఎట్లా.?

ఇగో.. ఒకసారి ఈ క్రాంతిని చూడండీ.

ఒకప్పుడు వైన్స్ ముందు మిర్చీ బజ్జీలేసేవాడు.

కానీ..

అక్కడే ఆగిపోలేదు.

కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ ఏమైనాగానీ అని సంకల్పించాడు.

ఓడిపోవద్దు.. రాజీపడొద్దూ.. నిదరే నీకొద్దూ అని కసితో కదిలాడు.

కట్ చేస్తే..

ఇవాళ గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించే స్థాయి.

హౌ..?

లెట్స్ ఫాలో ది డ్రిల్‌మ్యాన్ స్టోరీ..!!

గెలుస్తానో లేదో అని లెక్కలేసుకోవడం కాదు.. గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకూ అని సాధనచేస్తే గెలుపు తన్నుకుంటూ వస్తుంది. బతుకంటేనె గెలుపు.. గెలుపు కోసమే బతుకూ అని కసి, పట్టుదల కలగలిపి ముందుకు సాగితే అన్నీ సానుకూల ఫలితాలే.. సంచలనాలే. మనం పేదొళ్లం కదా..? పెద్ద పెద్ద లక్ష్యాలు మనకెందుకూ అని ఎప్పుడూ అనుకోకండీ. ఏం.. పేదొళ్లు ఎప్పటికీ పేదొళ్లుగానే మిగిలిపోవాల్నా.? జీవితాంతం నిరుత్సాహంతో బతికి నిత్య నిర్వేదంతో రగిలిపోవాల్నా.? అంటాడు క్రాంతి.

అడ్డగూడూరు బిడ్డ..

అది ఇటలీలోని మిలాన్ సిటీ. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం అక్కడొక ఈవెంట్ జరిగింది. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాల ప్రదర్శన. ట్యూబ్‌లైట్లను కరకరా నమిలేయడం, సలసలా కాగే వేడి నూనెలో చేతిపెట్టి మిర్చీలేయడం, ముక్కు రంధ్రంలో డ్రిల్ మిషీన్‌ను దింపడం, నాలుకతో ఫ్యాన్లను ఆపేయడం, గొంతులోకి కత్తులు దూసుకోవడం.. ఇలా చాలా నడుస్తున్నాయి. అందరి కళ్లూ క్రాంతి మీదనే ఉన్నాయి. క్రాంతి వచ్చేది వస్తూనే సత్తాచాటి శభాష్ అనిపించుకున్నాడు. ఒకేసారి నాలుగు రికార్డులు సృష్టించి తెలంగాణ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఎక్కడో యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో తాపీ మేస్త్రీ పనిచేసే కుటుంబంలో పుట్టిన ఫణికెర క్రాంతి.. అంతా నివ్వెరపోయే సాహసాలు చేసి పేదోడి మొండి ధైర్యమేంటో ప్రపంచానికి చాటిచెప్పాడు. ఎప్పుడూ ఆ అడ్డమైన పనులు చేసి ఏం సాధిస్తవయ్యా అని హేళన చేసినవాళ్లే ఇప్పుడు శబ్బాష్ క్రాంతి అని పొగుడుతున్నారు.

సాహసం చేయరా..

మిలాన్ వేదికగా క్రాంతి.. 60 సెకన్లలో 57 టేబుల్‌ ఫ్యాన్లను నాలుకతో ఆపాడు. ఇది మొదటి రికార్డు. ఇక రెండో రికార్డు.. నాలుగు కత్తులను గొంతులో పెట్టుకోవడమే కాకుండా తాడు సాయంతో 1,944 కిలోల బరువున్న వాహనాన్ని ఐదు మీటర్ల మేర లాగాడు. అమ్మో.. ఆ కత్తులేందో.. అంత బరువున్న వాహనాన్ని లాగడమేంటో వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఇంకా.. 60 సెకన్లలో 22 సార్లు నాలుగు ఇంచులున్న మొలలను ముక్కులో కొట్టుకొని మూడో రికార్డు సాధించాడు. నాలుగు రికార్డేంటంటే.. 300 డిగ్రీల వేడి నూనెలో 60 సెకన్లలో 17 చికెన్‌ ముక్కలను బయటకు తీశాడు. ఇలా ఒకే వేదికపై నాలుగు ప్రదర్శనలు చేసి నాలుగు వరల్డ్ రికార్డులు సాధించాడు. క్రాంతి కుమార్ చేసిన ఈ సాహసాలు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎవరూ చేయలేదని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ వాళ్లు గుర్తించారు. ఈ నాలుగు రికార్డుల పేరిట తనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఇటీవలే ఆ అవార్డులు ప్రదానం చేశారు.

తాపీ పనిలో ప్రయోగాలు

అసాధారణ సాహసాలు.. అపారమైన ధైర్యంతో క్రాంతి దేశ విదేశాలలో చాలా వేదికలపై విన్యాసాలు ప్రదర్శించాడు. అమెరికా, మలేషియా, సింగపూర్‌, స్పెయిన్‌, ఇటలీలోనూ ఈ విన్యాసాల ద్వారా ఎన్నో రికార్డులు సృష్టించి డ్రిల్ మ్యాన్‌గా ఫేమస్ అయ్యాడు. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి సాహసాలైనా చేయొచ్చు.. ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నాడు. అసాధారణ ప్రతిభతో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగాడు. అడ్డగూడూరు, శాలిగౌరారంలో స్కూలింగ్ చేసిన క్రాంతికి చిన్నప్పటి నుంచే సాహస క్రీడలంటే చాలా ఆసక్తి. అందరూ ఒకపనిచేస్తే తానొక పనిచేసేవాడు. ఎవరూ చేయని సాహసాలు చేసి అందరిచే శబాష్ అనిపించుకోవాలని ఆరాటపడేవాడు. అలా స్కూల్, ఇంటర్ చదివే వయసులో రకరకాల సాహసాలు చేసేవాడు. కానీ పేదరికం వల్ల తల్లిదండ్రులతో కలిసి తాపీ పనికి వెళ్లాల్సి వచ్చేది. పేరెంట్స్‌‌‌కి ఆసరైనట్లుంటుందని పనికైతే వెళ్లేవాడు కానీ అతనిధ్యాసంతా సాహసాలపైనే. ఖాళీ సమయంలో సుత్తెలు.. డ్రిల్ మిషీన్లు.. మొలలతో ఏవేవో ప్రయోగాలు చేసేవాడు.

మిర్చీ బజ్జీలేసేవాడు

ఇంటర్, డిగ్రీ సూర్యాపేటలో చదివాడు క్రాంతి. బాగా చదవి, ఐఏఎస్ అయ్యి అమ్మానాన్నల కష్టాల కన్నీళ్లను తుడిచేసి.. సమాజానికి సేవ చేయాలని కలగన్నాడట. కానీ, పేదరికం అతన్ని సూర్యాపేటను దాటనివ్వలేదు. తల్లిదండ్రులను ఇబ్బందిపెట్టొద్దని చేతి ఖర్చుల కోసం సూర్యాపేటలోనే ఓ వైన్స్ షాప్ ముందు మిర్చీ బండిలోపార్ట్ టైమ్ పనిచేసేవాడు. ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలనీ గంటె సహాయం లేకుండా మిర్చీలను సలసలా కాగే నూనెలోంచి చేత్తోనే తీసేవాడు. క్రాంతి మిర్చీలు చేయడాన్ని చూసేందుకు జనాలు ఎగబడేవారట. అప్పుడనుకున్నాడట క్రాంతి.. ఐఏఎస్ ఆఫీసర్ కాలేకపోయినా అలాంటివాళ్లు తన సాహసాలను ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదగాలని. ఇంకా తల్లిదండ్రుల పేరు, ఊరి పేరునూ ప్రపంచం గుర్తించేలా చేయాలనీ. దానికోసం ఎవరికీ సాధ్యంకాని చిన్న చిన్న ప్రదర్శనలు సాధన చేస్తుండేవాడు. కాలేజీలు, ఇతర చోట్ల ప్రదర్శించేవాడు. 2011లో ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ షోతో క్రాంతి విన్యాసాలు వెలుగులోకి వచ్చాయి.

సంపాదన సమాజానికే: క్రాంతి, డ్రిల్ మ్యాన్

ఈ రికార్డులు సాధించడంలో ఎంతోమంది ప్రోత్సాహం ఉంది. ఇట్టమల్ల చంద్రయ్య, పేరిణి వెంకట్ గౌడ్, మామిడి హరికృష్ణ సార్, జగదీశ్ రెడ్డి సార్, వెల్‌‌‌నెస్ హాస్పిటల్స్ సుమన్ గౌడ్ సార్, పాశం ఆంజనేయులు ఇంకా చాలానే ఉన్నారు. నా విన్యాసాల్లో మ్యాజిక్ మంత్రజాలమేదీ ఉండదు. నిరంతర సాధన వల్లే ఇది సాధ్యం. రోజులో ఎక్కువ సమయం యోగా, మెడిటేషన్ చేస్తా. అవే నా విజయ రహస్యాలు. విన్యాసాల ద్వారా సంపాదించిన డబ్బుల్లో 50శాతం క్రాంతి సోషియో కల్చర్ సొసైటీ ఎన్జీఓ పేరిట సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నా. నేను పేదోన్నే. కానీ సంపాదించినదాన్ని కూడబెట్టుకోక తిరిగి ప్రజలకే ఖర్చు చేస్తున్నా. అందరూ ఇలా ఆలోచిస్తే పేదరికమే ఉండదు. ప్రభుత్వం నుంచిగానీ, దాతల నుంచిగానీ నాకింకా సపోర్ట్ లభిస్తే రాష్ట్రానికి మరింత పేరు తీసుకొస్తా.

Advertisement

Next Story

Most Viewed