తెలంగాణ అమ్మాయికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్

by Harish |
తెలంగాణ అమ్మాయికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
X

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణ అమ్మాయి, భారత ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. కొంతకాలంగా ఆమె నిలకడగా రాణిస్తుండటంతో బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి తీసుకుంది. 2024-25కు సంబంధించి భారత మహిళల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. జాబితాలో మొత్తం 16 మంది ప్లేయర్లును చేర్చింది. అరుంధతి రెడ్డి సెంట్రల్ కాంట్రాక్ట్ పొందడం ఇదే తొలిసారి.

2018లో టీ20 క్రికెట్ ద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో మొదలుపెట్టిన ఆమె కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ జట్టులో కీలక ప్లేయర్‌గా మారింది. గతేడాది వన్డే, టీ20ల్లో కలిపి 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసింది. అరుంధతితోపాటు శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి తొలిసారిగా కాంట్రాక్ట్ పొందారు. ఇక, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-ఏలో తమ స్థానాలను కాపాడుకున్నారు. గ్రేడ్-బిలో బ్యాటర్లు షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ రిచా ఘోష్ పేసర్ రేణుక సింగ్‌లకు చోటు దక్కింది.

ఇక, గ్రేడ్-సిలో 9 మందికి చాన్స్ ఇచ్చారు. యాస్తికా భాటియా, రాధ యాదవ్, స్నేహ్ రాణా, పూజ వస్త్రాకర్ కాంట్రాక్ట్‌‌ను నిలబెట్టుకున్నారు. తెలుగుమ్మాయిలు సబ్బినేని మేఘన, అంజలి సర్వాణి తమ కాంట్రాక్ట్‌లను కోల్పోవడం గమనార్హం. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్, మేఘన సింగ్, దేవిక వైద్య, హర్లీన్ డియోల్‌లను కూడా బోర్డు పక్కనపెట్టింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన వారిలో గ్రేడ్-ఏ ప్లేయర్లు వార్షిక వేతనంగా రూ. 50 లక్షలు పొందనున్నారు. గ్రేడ్-బి, గ్రేడ్-సి ప్లేయర్లకు రూ.30 లక్షలు, రూ.10 లక్షలు దక్కుతాయి. మ్యాచ్ ఫీజులు వీటికి అదనం. ఈ ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ టైటిల్ లక్ష్యంగా భారత జట్టు దృష్టి పెట్టింది. వచ్చే నెలలో శ్రీలంక, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్ ఆడనుంది.




Next Story