బంధువులు, మిత్రులతో కలిసి ఉంటేనే సంతోషం.. ఒంటరితనంతో ఏం జరుగుతుందో తెలుసా?

by Gantepaka Srikanth |
బంధువులు, మిత్రులతో కలిసి ఉంటేనే సంతోషం.. ఒంటరితనంతో ఏం జరుగుతుందో తెలుసా?
X

మానవుల జీవన పరిణామంలో అత్యంత కీలకదశ వృద్ధాప్యం. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం నుంచి తప్పుకుని.. ప్రశాంతత కోరుకునే సమయం. అటువంటి సమయాన్ని కొడుకులు కోడళ్లు, కూతుళ్లు అల్లుళ్లు వాళ్ల పిల్లల మధ్య ఆనందంగా గడపాలని అందరూ కోరుకుంటారు. కానీ, పరిస్థితులు మారుతున్నాయి. కోడళ్లు, అల్లుళ్ల అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చు. వారికి భారంగా మారడం ఎవరికీ మంచిది కాదు. అందుకే అభిరుచులు కలిసినవారు కొందరు కలిసి ఉండటమే కమ్యూనిటీ హోమ్స్. ఇందులో అన్నదమ్ములు, బావ, బావమరుదులు, మిత్రులు ఇలా ఎవరైనా సరే కుటుంబాలు ఒక్కచోట ఉండి.. కుటుంబంలా బాధ్యతలు పంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అసలు కమ్యూనిటీ హోమ్స్ ఎందుకు? వీటివల్ల ప్రయోజనం ఏమిటీ? తల్లిదండ్రులను భారమని పిల్లలు భావించడం తప్పు కాదా? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పెరుగుతున్న వయస్సు అంతరం ఎలాంటి సమస్యలు తీసుకువస్తున్నదనే అంశాలపై ప్రత్యేక కథనం. ఎస్పీ హరీశ్

వృద్ధాశ్రమాలు..

కొడుకులు, కూతుళ్ల కుటుంబంలో ఇమడలేని వృద్ధులకు చివరి మజిలీ వృద్ధాశ్రమే. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆశ్రమాలు ఉన్నాయి. ప్రైవేటు ఆశ్రమాల్లో అయితే, డబ్బును బట్టి సౌకర్యాలు ఉంటాయి. అయితే.. ఈ రకమైన ఆశ్రమాల్లో ఉండేందుకు వృద్ధులు ఏమాత్రం ఇష్టపడరు. ఇందుకుకారణం వారి సొంత ఇల్లు, పొరుగున ఉండే వాళ్లను వదిలి.. ముక్కుమొహం తెలియనివారి మధ్య అవసాన దశలో ఉండటం అంటే అది దారుణమైన శిక్షగా భావిస్తారు. పైగా 60, 70 ఏండ్లు వచ్చినవారికి వారికంటూ సొంత ఆహారపు అలవాట్లు, టాయిలెట్​సహా ఇతర విషయాలపై కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఈ ఆశ్రమాల్లో వాటిని వదిలిపెట్టడం ఇష్టంలేని భోజనం చేయడం.. శుచి, శుభ్రత విషయంలో రాజీపడటం వారిని కృంగదీస్తుంది.

ఒక్కచోట ఉంటే ఆనందాలే..

కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉండాల్సి వస్తే.. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న బంధువులు, మిత్రులను పోగుచేసి కమ్యూనిటీ రెడీ చేసుకోవాలి. అందరూ ఒకే అభిరుచి ఉన్నవారైతే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. లేదా దగ్గరి బంధువులు అంతా కలిసిమెలిసి ఉన్నవారైనా మంచిదే. అన్నింటికన్నా ఉత్తమమైనది ఫ్యామిలీ ఫ్రెండ్స్​ఒక్కచోట ఉన్నారంటే ఇక వారికి ప్రపంచంతో పనే ఉండదు. అందరూ కలిసి ఒక ఇల్లు రెంట్​కు తీసుకోవడమే లేక ఎవరిదైనా సొంతింటికి మకాం మార్చుకోవాలి. ఇలా రెండు, మూడు జంటలు అలా కలిసి ఉంటే సమూహంలో ఉన్నట్టుగా ఉంటుంది. పైగా ప్రతి పని, ఖర్చు షేర్​చేసుకోవచ్చు. వారికి నచ్చిన ఆహారం తీసుకోవడంతోపాటు అందరూ ఒక్కచోట ఉండటం మూలాన ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఒంటరిగా ఉంటూ కొడుకులు, కూతుళ్లు వాళ్ల పిల్లలను తలుచుకుంటూ వారితో ఉండలేక.. వారిని తమతో ఉంచుకోలేక ఇబ్బంది పడేకంటే ఇది ఎంతో ఉత్తమం.

షేరింగ్.. కేరింగ్

అభిరుచులు కలిసినవారు ఒక్కచోట ఉండటం అంటే పండుగలకు ఊరెళ్లినంత సంబురంగా ఉంటుంది. ఒకే వయస్సువారు అయితే వారి పరిస్థితులు ఒకరినొకరు అర్థం చేసుకుని.. సర్దిచెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మనోవ్యథ తగ్గుతుంది. పిల్లలు తమను చూడటం లేదన్న దిగులు మాని.. పనుల్లో తలమునకలు అవుతారు. ముఖ్యంగా భోజనం చేసేందుకు ఆసక్తి పెరుగుతుంది. ఒంటరిగా ఉండే వృద్ధులు ఆహారం ఆసక్తి చూపరు. పెళ్లి అయిన తొలినాళ్లనుంచి అందరికోసం వంట చేయడం.. పనిచేయడం అలవాటు అయినవారికి తమకోసం తాము చేసుకోవడానికి ఇష్టపడరు. ఏదో ఒకటి తింటే సరిపోతుందిలే అనుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. అనారోగ్యంపాలైతే ఎవరో ఒకరు తోడు లేకపోవడంతో మరింత భయపడతారు. తమకు ఏదో జరిగిపోతుందని ఆందోళన చెందుతారు. ఆ సమస్యలకు చెక్ పెట్టాలంటే అందరితో కలిసిఉంటే ఇబ్బందులు తొలగుతాయి.

ఒంటరితనం భరించలేం..

మనిషి సంఘజీవి. ఎప్పుడూ ఇతరులతో కలిసి ఉండాలనే కోరుకుంటాడు. ఏదైనా పరిస్థితిలో ఒంటరిగా ఉండాల్సి వస్తే జైలులో ఉన్నట్టుగా బాధపడుతారు. ఆ సమయంలోనే ఆత్మన్యూనతాభావంతోపాటు తమపై ఇతరుల సానుభూతి కోరుకునే పరిస్థితికి వస్తారు. ఫలితంగా కొడుకులు, కూతుళ్లు చేస్తున్న తప్పులను ఇతరులతో చెప్పుకుని బాధపడటం.. తనను ఎవరూ సరిగా చూడరని ఆవేదన వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు. ఇదే విషయంపై కొడుకులు, కూతుళ్లను నిలదీస్తామని ఎవరైనా ముందుకువస్తే మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోరు. వారితో బాగుండాలనే ఆరాటం.. తనను అర్థం చేసుకోవడంలేదనే బాధ ఇలా రెండూ కలసి విభిన్న మనస్తత్వాలు కలిసిన వ్యక్తులుగా మారుతారు. తమనుతాము నిందించుకోవడంతోపాటు ఇతరులను నిందించడం మొదలుపెడతారు. మనుషుల మధ్య ఉంటే ఈ పరిస్థితులకు పరిష్కారం లభిస్తుంది. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులు సమాజంలో సర్వసాధారణమని.. వీటిని ఎలా అధిగమించాలో ఇతరుల అనుభవాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. దీంతో తాము అనుకుంటున్న సమస్య ఓ టీ కప్పులో తుపాను లాంటిదేనని అంగీకరిస్తారు. నిజానికి కుటుంబ వ్యవహారాలు అందరూ కూర్చుని పరిష్కరించుకోవాలే తప్ప.. ఇతరులను జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి. ఫలితంగా తాము తీసుకున్న నిర్ణయం తప్పు అయినా.. సమిష్టిగా తీసుకున్నాం కాబట్టి భరించేందుకు సిద్ధం అవుతారు. లేదంటే ఒకరిపై ఒకరు తప్పు ఎత్తి చూపే పరిస్థితులు తలెత్తుతాయి.

కలిసి ఉండకున్నా.. బంధాన్ని కొనసాగించాలి

కొడుకులు, కూతుళ్లు కూడా తమ కుటుంబాలు, ఉద్యోగ-వ్యాపారాల్లో ఎంతగా బిజీగా ఉన్నా.. తల్లిదండ్రులతో రోజుకు ఒకసారి కనీసం వారానికి ఒకసారి అయినా మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. వారి బాగోగులు తెలుసుకోవాలి. వారికి కార్లు, బంగళాలు, బంగారం కొనివ్వలేకున్నా.. కనీసం భోజనం చేశావా..? లాంటి కుశలప్రశ్నలు అడిగినా వారి మనస్సు శాంతిస్తుంది. వారి తర్వాతితరం కూడా తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. జీవితంలో సాధించిన విషయాలను తమవారితో పంచుకుంటే వచ్చే ఆనందం ప్రపంచంలో ఎవరితోనూ రాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధలు, సంతోషాలు తల్లిదండ్రులతోనూ పంచుకోవాలి. వారు అర్థం చేసుకోరని భావిస్తే.. వారికి నచ్చే విషయాలే మాట్లాడుకోవాలి. ఏ విషయం మాట్లాడామనే సంగతి పక్కనబెడితే.. తల్లి, తండ్రితో కనీసం పది నిమిషాలు మాట్లాడామన్న సంతృప్తి దక్కుతుంది.

పెరుగుతున్న వయస్సు అంతరం

గతంలో చిన్న వయస్సులోనే అంటే 15,16 ఏండ్లకే తల్లులు అయ్యేవారు. దీంతో పిల్లలతో వయస్సు అంతరం పెద్దగా ఉండేదికాదు. దీంతో ఏ విషయమైనా వారితో పంచుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపు చాలామంది యువతులు 30 ఏండ్లకు కాస్త అటు ఇటుగా తల్లి అవుతున్నారు. దీంతో వారి పిల్లలకు వారికి మధ్య 30, 35 ఏండ్లు ఏజ్ గ్యాప్ అవుతున్నది. దీనివల్ల కూతుళ్లు కూడా తల్లితో అన్ని విషయాలు పంచుకునే పరిస్థితి ఉండటం లేదు. దీంతో కుటుంబం కన్నా స్నేహితులే ముఖ్యమయ్యారు. రోజురోజుకూ పిల్లలను గైడ్ చేయడం కూడా తల్లిదండ్రులకు కష్టంగా మారుతున్నది. ట్రెండ్‌లో ఉన్న విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన ఉండటంలేదు. లేటెస్ట్ గాడ్జెట్స్ అప్లికేషన్స్.. టీవీ, సినిమాల్లో వచ్చే క్యారెక్టర్స్ ఇవన్నీ వారికి తెలియకపోవడాన్ని పిల్లలు తప్పుబడుతున్నారు. ఈ విషయాలను ఎత్తిచూపుతూ తమకు ఏమీ గైడ్ చేయాల్సిన అవసరమే లేదంటూ మొండికేస్తున్నారు.

పిల్లల్ని అర్థం చేసుకోవాలి

చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తాము చెప్పింది చేసి తీరాలన్న ధోరణిలో ఉంటారు. కొడుకులు, కూతుళ్లు తాము చెప్పింది విని తీరాలని.. రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. నిజానికి వాళ్లు ఆ విషయం తమకు నచ్చలేదని చెప్పినా.. దగ్గరివాళ్లతో బంధువులతో చెప్పిస్తూ.. ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తుంటారు. దీనివల్ల తల్లిదండ్రులకు ఏదైనా విషయం చెప్పాలన్నా.. తటపటాయిస్తుంటారు. దీనివల్ల దగ్గరి బంధువులో, మిత్రులకో విషయం చెప్పి.. వారి ద్వారా తల్లిదండ్రులకు రాయబారం పంపిస్తుంటారు. కొడుకులు, కూతుళ్లు ఏ విషయమైనా నేరుగా తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఇంట్లో కల్పించాలే తప్ప.. మధ్యవర్తులతో రాయబారం నడిపే పరిస్థితులు తెచ్చుకోవద్దు. దీనివల్ల కుటుంబం పెరిగే అంతరం జీవితాంతం పూడ్చలేనిదిగా మారుతుంది.

తగినంత స్పేస్ ఇవ్వాలి..

`ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో తగినంత స్పేస్ కోరుకుంటున్నారు. భార్యాభర్తలు కూడా కొంత స్పేస్ కావాలని భావిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల కుటుంబాల్లో అవసరమైనంత వరకే జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రులు గ్రహించాలి. చిన్నతనంలో నడక నేర్పించినట్టు కుటుంబం ఎలా నడపాలో నేర్పించాలని భావించడం పొరపాటే అవుతుంది. అందుకే కొడుకు, కూతుళ్లకే కాదు.. తల్లిదండ్రులకు కూడా తగినంత స్పేస్ ఇవ్వడం అందరికీ మంచిది.

కేస్ స్టడీస్

1. సువర్చల భర్త ఐదేళ్ల కిందట కాలం చేశాడు. ఇద్దరు కొడుకులకు అప్పటికే పెళ్లిళ్లు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరులో కాపురాలు పెట్టారు. సొంతూరిలో ఉన్న ఇల్లు, పొలం చూసుకుంటూ కాలం గడుపుతున్నది. భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడం.. ప్రతి నెలా పెన్షన్ డబ్బు వస్తుండటంతో ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే, ఎటొచ్చి ఒంటరిగా ఉండటమే ఆమె మనసుకు కష్టంగా ఉంటున్నది. భర్త ఉన్న సమయంలో పెద్ద కొడుకు రమ్మనడంతో ఇద్దరూ బెంగుళూరు వెళ్లినా.. కొడుకు, కోడలు ఉద్యోగాల్లో బిజీగా ఉండటం.. వారంలో ఎక్కువసార్లు బయటే తినడం.. పార్టీలకు వెళ్లి రాత్రిళ్లు లేటుగా ఇంటికి రావడం తెల్లవారి ఉరుకులు, పరుగుల మీద ఆఫీసులకు వెళ్లడం చూసి వీళ్లకు ఏమాత్రం నచ్చలేదు. హైదరాబాద్ లో ఉన్న కొడుకు ఇంట్లో అదే పరిస్థితి. పైగా కొడుకుల ఇళ్లల్లో ఉంటే ఏదో తెలియనివాళ్ల ఇంట్లో ఉన్న భావన రావడంతో వాళ్లు అక్కడికి వెళ్లడమే మానేశారు. సెలవులు వస్తే కొడుకులు హాలీడే ట్రిప్పులకు వెళ్లడమే తప్ప.. సొంతింటికి రావడమూ తగ్గింది. ఈ పరిస్థితిలో భర్త కాలం చేయడంతో సువర్చలను మరింత కుంగదీసింది. పైగా ఇరుగుపొరుగువాళ్లు, బంధువులు కొడుకులు తనను సరిగా చూడటం లేదని దెప్పిపొడుస్తూ మాట్లాడటంతో తనలో ఆత్మన్యూనతాభావం పెరిగిపోయింది. ఇదే సమయంలో తన ఇంటికి వచ్చిన తమ్ముడు, మరదలు పరిస్థితి ఇంచుమించు తనలాగే ఉన్నదని తెలుసుకున్నది. సమీప బంధువుల్లోనూ రెండు, మూడు జంటలు ఇలానే బాధ పడుతుండటం చూసి సువర్చల ఓ నిర్ణయం తీసుకున్నది. వారందరినీ ఓ రోజు భోజనానికి పిలిచి.. మనమంతా వేరువేరుగా ఉండటం కంటే ఒక్కచోట ఉంటే.. పిల్లలపై బెంగ కొంతైనా తీరుతుందని.. అవసాన దశలో ఒకరికి ఒకరం అండగా ఉండొవచ్చుననే ప్రతిపాదన తీసుకువచ్చింది. ముందు అందరూ తమాషాకి అంటున్నదని అనుకున్నా.. సువర్చల సీరియస్‌నెస్ చూసి వారంతా ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించారు. అందరూ పిల్లలను పిలిచి విషయం చెప్పడంతో వారూ అంగీకరించారు. దీంతో సువర్చల ఇల్లే కమ్యూనిటీ హోమ్ గా మారింది.

2. అరుంధతి, వరదరాజులుకు నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో ఎవరికి వారు పట్టణాల్లో సెటిల్ అయ్యారు. అందరూ ఉన్నంతలో అందరూ మంచిగానే స్థిరపడ్డారు. పండుగ, పబ్బాలకు అందరూ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వెళ్తుండటంతో వృద్ధాప్యంలో అరుంధతి, వరదరాజులుకు ఎలాంటి చీకుచింతా లేకుండాపోయింది. అయితే వరదరాజులుకు 75 ఏండ్ల వయస్సులో క్యాన్సర్ వచ్చి కాలం చేశారు. అప్పటివరకు ఎక్కడికి వెళ్లినా భార్యాభర్తలు కలిసివెళ్లడమే తప్ప అరుంధతి ఎప్పుడూ ఒంటరిగా ఉండకపోవడంతో.. భర్త మరణం ఆమెను పూర్తిగా కుంగదీసింది. భర్త లేని జీవితం.. ఒంటరిగా ఉన్నానన్న బాధ కలగలిసి 70 ఏళ్లున్న అరుంధతి ఒకరోజు దారుణమైన నిర్ణయం తీసుకున్నది. ఇంటి వెనుక గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకున్నది. ఊరంత బలగం ఉందని మురిసిపోయిన అరుంధతి.. భర్త లేని జీవితాన్ని కొనసాగించలేకపోయింది. కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లను వీడి వెళ్లిపోయింది.

3. సురేందర్ మధ్యతరగతి ఉద్యోగి. తల్లిదండ్రులు చిన్న పట్టణంలో ఉంటే.. హైదరాబాద్ లో తన కుటుంబంతో ఉంటున్నాడు. ఉదయం 9 గంటలకు వెళ్లే మళ్లీ రాత్రి 10 గంటలకు కానీ ఇంటికి చేరడు. ఆఫీసులో అనేక తలనొప్పులు ఉన్నా.. కుటుంబాన్ని ఏదోలా నెట్టుకొస్తున్నాడు. అయితే, తల్లిదండ్రులు ప్రతి ఫంక్షన్, ప్రతి పండుగకు రావాలని పిలుస్తుంటారు.. ఆఫీసు పని వల్ల వెళ్లలేకపోతే కోడలు కొడుకు మనుసు మార్చివేసిందని నిష్టూరాలు పోతుంటారు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినా చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుబాటు చేసుకోకుండా సురేందర్‌పై విరుచుకుపడుతుంటారు. కోడలిపై ఉన్న కోపాన్ని మనవలు సరిగా పెరగడం లేదని.. సురేందర్ తమను పట్టించుకోకపోవడానికి కారణం ఆమెనేనని బంధువులకు అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. దీంతో బంధువులు ఎవరు కలిసినా.. తల్లిదండ్రులను బాధ పెట్టడం సరైందని కాదని సురేందర్‌‌‌కు హితవు చెప్పడం మొదలుపెట్టారు. తన స్థానంలో ఉండి చూస్తే పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని తనలోతానే కుమిలిపోసాగాడు. ఇవన్నీ సమస్యలకు పరిష్కారం ఒక్కటేనని భావించి.. తెలిసిన మిత్రుడు జర్మనీలో ఉంటే అక్కడికి అతడి సాయంతో వీసా తీసుకుని భార్యా పిల్లలతో అక్కడికి షిఫ్ట్ అయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed