Clogged Arteries: ధమనులు బ్లాక్ అవుతున్నాయ్..! పురుషుల్లో పెరిగిపోతున్న హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్!

by Javid Pasha |
Clogged Arteries: ధమనులు బ్లాక్ అవుతున్నాయ్..! పురుషుల్లో పెరిగిపోతున్న హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్!
X

దిశ, ఫీచర్స్ : నడుస్తూ ఉండగా కొందరు.. జర్నీలో ఉండగా మరికొందరు.. ఆటలాడుతూ కొందరు.. వాహనం నడుపుతూ ఇంకొందరు.. ఇలా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. అందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా తరచుగా వైరల్ అవుతన్నాయి. ఆకస్మిక గుండెపోటు ఇందుకు కారణం అవుతోందన్న విషయం చాలా మందికి తెలిసిందే. అయితే హై కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెలోని ఆర్టరీ(Arteries) వాల్స్‌లో బ్లాక్స్ ఏర్పడటం వల్ల ప్రస్తుతం ఈ సమస్య మరింత పెరుగుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితినే అథెరోస్‌క్లోరోసిస్ (Atherosclerosis) అని, ‘Clogged Arteries’ అని కూడా పిలుస్తారు.

ధమనులను బ్లాక్ చేసి, గుండెపోటుకు దారితీస్తే ముందస్తు పరిస్థి అయిన ‘అథెరోస్‌క్లోరోసిస్‌’కు ప్రధాన కారణం వాటిలో కొవ్వు పేరుకుపోవడమే. క్రమంగా ఇది ఊబకాయానికి, మధుమేహానికి, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అంతేకాకుండా ఆర్టరీలో కొవ్వు ఫలకాలుగా ఏర్పడి గుండెకు రక్త ప్రవాహం తగ్గేలా చేస్తాయి. దీంతో ఒక్కసారిగా రక్త ప్రసరణ ఆగి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లలో ప్రతికూల మార్పులు, జంక్స్ ఫుడ్స్ తినడం ఎక్కువగా కొనసాగిస్తూ, ఆరోగ్య కరమైన ఆహారాలకు దీర్ఘకాలంపాటు దూరంగా ఉండటంవల్ల చాలామంది ఈ ధమనుల బ్లాక్ సమస్య ఎదుర్కొంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

‘ఆర్టరీస్ బ్లాక్’ లక్షణాలు

నిజానికి ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది ప్రారంభ స్థాయిలో ఉన్నప్పుడు ఛాతీలో నొప్పిగా అనిపించడం, శ్వాసలో ఇబ్బందులు, కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, నొప్పి, తీవ్రమైన అలసట, జ్ఞాపక శక్తి తగ్గడం, ముఖం పాలిపోయినట్లు అనిపించడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే కొంతకాలానికి స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే కొందరిలో గుండెపోటుకు ముందు కరోనరీ ఆర్టరీ, కిడ్నీ డిసీజెస్, శరీరంలో రక్తం గడ్డకట్టడం, అవయవాల వైఫల్యం వంటివి కూడా సంభవించవచ్చు.

పురుషుల్లోనే ఎక్కువ..

ధమనులు లేదా ఆర్టరీ బ్లాక్స్ సమస్యలు ప్రపంచంలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. కాగా వీరిలో స్త్రీలకంటే పురుషులే అధికంగా ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. 45 ఏండ్ల దాటిన పురుషులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటే.. స్త్రీలలో అరుదుగా 55 ఏండ్లు దాటిన తర్వాత ధమనుల బ్లాక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడంవల్ల స్ట్రోక్, గుండెపోటు, ధమనుల బ్లాక్ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు.

నివారణ మార్గాలివే..

లక్షణాలు తీవ్రమైనప్పుడు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ధమనుల బ్లాక్ సమస్యకు చక్కటి పరిష్కారం. అయితే అత్యవసర వైద్య పరిస్థితికి దారితీయక ముందు నుంచే ఆర్టరీ బ్లాక్స్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడం ఇంకా మంచిది. ఇది మీ జీవన కాలాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి ఆహారాల్లో అవకాడోలు కూడా ఒకటి. వీటిలో మోనో శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకోవడంలో వీటిలోని పోషకాలు సహాయపడతాయి. అలాగే అరటి పండ్లు, శనిగలు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ముఖ్యంగా విటమిన్ బి6 లభించే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీంతోపాటు ధూమపానం, మద్యపానం అలవాట్లను మానేయడం, అధిక ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి జీవన శైలి మార్పులు ధమనులలో కొవ్వు అడ్డంకుల సమస్యను నివారించడంలో సహాయపడతాయి.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకిరంచలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story