ఆఫీసులో ఉద్యోగుల రొమాన్స్.. శృతిమించుతున్న సీక్రెట్ రిలేషన్‌షిప్‌

by Nagaya |
ఆఫీసులో ఉద్యోగుల రొమాన్స్.. శృతిమించుతున్న సీక్రెట్ రిలేషన్‌షిప్‌
X

దిశ, ఫీచర్స్ : రోజు మొత్తంలో కుటుంబసభ్యుల కంటే కూడా ఆఫీసులో కొలిగ్స్‌తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు ఉద్యోగులు. కాబట్టి అక్కడ మీరు పార్టనర్‌ను కలిగి ఉండటం కూడా సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే వర్క్‌ప్లేస్‌లో భాగస్వామితో వ్యవహరించే తీరు, రొమాన్స్ వంటి విషయాలు కొన్నిసార్లు శృతి మించితే మీ వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొలిగ్‌తో రహస్యంగా రిలేషన్‌షిప్‌ను మెయింటెన్ చేసినప్పటికీ కొన్నిసార్లు బెడిసి కొట్టవచ్చు. బ్రేకప్‌ లేదా ఆఫీసు నుంచి వెళ్లిపోయేందుకు దారి తీయొచ్చు. ఈ విషయం నలుగురికి తెలిసి మీ ప్రొఫెషనల్‌ లైఫ్‌కు ఎసరు రావచ్చు. ఈ పరిస్థితులు మిమ్మల్ని బాధ, నిరాశకు గురిచేయొచ్చు. కానీ అలాంటి భావోద్వేగాలను అధిగమించినప్పుడే జీవితాన్ని ఆనందంగా మలుచుకుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అలా కాదని మానసిక సంఘర్షణకు లోనైతే మాత్రం ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

డిప్రెషన్‌కి ఎలా దారి తీస్తుంది?

కఠినమైన నియమ, నిబంధనలు ఉన్నప్పటికీ.. కొలిగ్స్ మధ్య మేధో సంబంధమైన సామీప్యత ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఎమోషనల్ అటాచ్‌మెంట్ వంటివి ఇద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ డెవలప్ అయ్యేందుకు దోహదం చేస్తాయి. అయితే ఇలాంటి బంధాలు కొన్నిసార్లు రిస్క్‌ కలిగించే అవకాశం లేకపోలేదు. మీ పార్టనర్ కూడా మీ టీంలో మెంబర్ అయినప్పుడు ఇలా జరగవచ్చు. ఎందుకంటే వృత్తిలో భాగంగా మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీ భాగస్వామి మనోభావాలను దెబ్బతీసేవి అయుండొచ్చు. ఇక్కడ అర్థం చేసుకోకపోవడం అనేది బ్రేకప్‌కు, తద్వారా డిప్రెషన్‌కు దారితీస్తుంది. మీ వృత్తి నైపుణ్యంలో భాగంగా చూపిన ప్రాధాన్యతల ఆధారంగా మీరు మీ పార్టనర్‌ను హర్ట్ చేసిన సందర్భాలు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి తేవచ్చు.

ఇలాంటి సమయంలో కొలిగ్ మాట్లాడకపోతే మీలోని బాధ, భావోద్వేగం క్లినికల్ డిప్రెషన్‌గా మారవచ్చు. పార్టనర్ తిరస్కరణ, కోపం, బేరసారాలు, విచారం, పశ్చాత్తాపం వంటి మిశ్రమ భావోద్వేగాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. దీంతో పనిలో ఆసక్తి తగ్గడం, విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం జరుగుతాయి. ఎక్కువ ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటే.. ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు కొంత సమయం కేటాయించుకోవడం ముఖ్యం. ఒకవేళ పనిలో మీ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మద్దతిస్తే అసలు ఇలాంటి సమస్యే ఉండదు.


ఆఫీసులో బ్రేకప్ ఎలా ఎదుర్కోవాలి?

* మీకు సపోర్టుగా నిలిచే వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి. వారి సలహాలు మీలో ఊరట కలిగిస్తాయి. మిమ్మల్ని తరచుగా విమర్శించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీ గురించి పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తులతో స్నేహం చేయండి.

* బ్రేకప్ తర్వాత మీరు విడిపోయిన భాగస్వామిని చూసేందుకు, మాట్లాడేందుకు వెంటపడటం చేయకండి. వారు మిమ్మల్ని కోల్పోతున్నారనే ఫీలింగ్స్‌తో ఎదుటి వ్యక్తి గురించి మీకు మీరే అతిగా ఆలోచించకండి. అంతగా మీ మనసు ఆగకపోతే నేరుగా చూడటం, సంప్రదించడం మానేసి సోషల్ మీడియాలో ఫాలో అవ్వొచ్చు.

* కొన్నిసార్లు మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉండకపోవచ్చు. కానీ కొన్ని హద్దులు ఏర్పరచుకోవడం మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. విడిపోయిన భాగస్వామి గురించి తక్కవగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారితో జ్ఞాపకాలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి.

* బ్రేకప్ తర్వాత అనవసర ఆలోచనలు, లేదా రిలేషన్ షిప్ గురించే ఆలోచిస్తూ కుంగిపోవద్దు. మీపై మీరు ఫోకస్ పెట్టుకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఆత్మ విశ్వాసంతో, ఆత్మ గౌరవంతో మెలగండి. దీంతో మీరు పాత జ్ఞాపకాలను మర్చిపోయి ప్రస్తుతం చేసే పనిపై కేంద్రీకరిస్తారు. దీనివల్ల మీకు మేలు జరుగుతుంది.

* వ్యక్తిగత జీవితంలో సంభవించే మార్పులు, ముఖ్యంగా బ్రేకప్ వంటి సందర్భాల్లో మనసు కకలావికలం అవుతుంది. ఆ బాధ నుంచి రిలాక్స్ కోసం కొందరు డ్రింక్ చేయడం వైపు మొగ్గుతుంటారు. కానీ ఆ పని అస్సలు చేయకండి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది ఒక వ్యసనానికి దారితీస్తే మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది.

* విడిపోయిన భాగస్వామి లేదా కొలిగ్ రాకముందు మీరెలా ఉన్నారు? మీకంటూ ఒక లక్ష్యం ఉండే ఉంటుంది కదా. ఇప్పుడు బాధపడేకంటే ఆ లక్ష్యం సాధించడంపై దృష్టి పెట్టండి. లేకపోతే కొత్తగా లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఒకదారి మూసుకుపోయినప్పుడు మరో దారిలో ప్రయాణించాలి. అసలు దారులే లేకపోతే కొత్తదారి వెతుక్కోవాలి. అంతేకాని బాధపడుతూ కూర్చోకండి. మీకు నచ్చిన పని చేస్తూ లక్ష్యంవైపు అడుగు వేయండి. అది మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. బాధలు, భావోద్వేగాలు దూరమై మిమ్మల్ని సంతోషానికి దగ్గర చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed