Eye care : వర్షాకాలంలో కళ్లు జాగ్రత్త.. లేకుంటే ఈ రిస్క్ పెరగవచ్చు!

by Javid Pasha |
Eye care : వర్షాకాలంలో కళ్లు జాగ్రత్త.. లేకుంటే ఈ రిస్క్ పెరగవచ్చు!
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ఎడతెరిపి లేని వానలతో నీటి కాలుష్యం పెరుగుతుంది. అపరిశుభ్రత, దోమలు పెరగడం కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లు వ్యాపిస్తాయి. దీంతోపాటు కళ్ల కలక కూడా వర్షాకాలంలో పెరిగే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. (Conjunctivitis) కండ్లల్లో మంట, నీరు కారడం, పొడిబారి లేత గులాబి రంగులోకి మారడం, తలనొప్పి, కండ్లు లాగడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* చేతుల పరిశుభ్రత : కళ్ల కలక ఒకరికి వచ్చిందంటే వారి చుట్టుపక్కల ఉన్నవారికి త్వరగా సోకే అవకాశం ఉంటుంది. అంటే ఇదొక అంటు వ్యాధిలా వ్యాపిస్తుంది. ఇలా జరగకూడదంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ముఖ్యంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లొచ్చాక లేదా ఏదైనా పనిచేశాక సబ్బుతో కడగకుండా కళ్లను రుద్దడం, తాకడం వంటివి చేస్తే కళ్లల్లోకి వ్యాధికారక కరిములు ప్రవేశిస్తాయి. కంజెక్టివైటిస్ ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి. దీంతో కళ్ల కలక వస్తుంది. కాబట్టి కేర్ తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. పిల్లల విషయంలో ముఖ్యంగా వర్షాకాలంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ఈ వస్తువులు షేర్ చేసుకోవద్దు : వర్షాకాలంలో పర్సనల్ హైజీన్ చాలా ముఖ్యం. ఒకే సబ్బును, ఒకే టవల్‌ను, ఒకే బెడ్ షిట్‌ను, ఒకరి దుస్తులు ఒకరు కుటుంబంలోని ఎక్కువమంది గానీ, స్నేహితులు గానీ షేర్ చేసుకోవడం అస్సలు వాడటం సురక్షితం కాదు. కళ్లకలక సోకే అవకాశాన్ని ఇది మరింత పెంచుతుంది.

నిర్లక్ష్యం వద్దు : కళ్ల కలక లక్షణాలు ఏమాత్రం కనిపించినా నిర్లక్ష్యం చేయకూదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది కళ్లల్లో ఇన్ఫెక్షన్ పెరిగి తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చు. కాబట్టి కళ్లల్లో నీరు కారడం, పొడిబారడం, మంటగా అనిపించడం, ఎర్రగా మారడం, తలనొప్పితోపాటు కళ్లల్లో మార్పులు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి కళ్ల కలక లక్షణాలుగా అనుమానించాలి. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

* ఐడ్రాప్స్ వాడే ముందు : కుటుంబంలో ఎవరికైనా కళ్ల కలక వచ్చినప్పుడు డాక్టర్ల సూచన మేరకు ఐ డ్రాప్స్ వాడుతుంటారు. అయితే కళ్ల కలక వచ్చిన వ్యక్తి కళ్లకు దగ్గరగా పెట్టుకొని డ్రాప్స్ వేసుకోవడం, బాటిల్‌ను చేతులతో తాకడం చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి వాడిన ఐ డ్రాప్‌ను మరొకరు వాడకూడదంటున్నారు నిపుణులు. దీనివల్ల కూడా కళ్లకల వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే కంటివైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed