గ్రంథాలయాలను వెంటనే డిజిటలైజ్ చేయాలి : ఆంధ్రజ్యోతి ఎడిటర్

by Shyam |
Andhra Jyoti Editor srinivas
X

దిశ, చార్మినార్: రాష్ట్రంలోని గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయాలని ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం గ్రంథపాలకులు డాక్టర్ చేగోని రవికుమార్ రచించిన ‘మన తెలంగాణ గ్రంథలయాలు’ అనే పుస్తకాన్ని ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రంథాలయాలను మల్టీ మీడియాతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని చారిత్రాత్మకమైన గ్రంథాలయాల విలువైన సమాచారాన్ని రవి కుమార్ అందించటం అభినందనీయమని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు.

ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ అయాచితం శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ గ్రంథాలయాల గురించి రవి కుమార్ రాసిన పుస్తకం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు. కొత్త తరం పరిశోధకులు తెలంగాణ చారిత్రక, సాహిత్య విశేషాలను తమ రచనల ద్వారా వచ్చే తరాలకు అందించాలని సూచించారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు లక్ష్మణ రావు, ఆర్ట్స్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ ఆచార్య సుదర్శన రావు మాట్లాడుతూ.. చారిత్రక విషయాల పట్ల, తెలంగాణ ప్రాచీన గ్రంథాలయాల పట్ల రవికి స్పష్టమైన అవగాహన ఉందని, ఆ అవగాహనతోనే ఈ పుస్తకాన్ని వెలువరించారని తెలిపారు. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి గ్రంథాలయం పాలకులు సంగిశెట్టి శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విప్లవదత్ శుక్లా, తెలుగు సహాయ ఆచార్యులు డాక్టర్ కోయి కోటేశ్వర రావు, ప్రముఖ విద్యావేత్త గోనారెడ్డి, దినకర్, భాస్కర్, నీరజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed