ఆ విషయం గమనించాలి: వామపక్షాలు

by srinivas |
ఆ విషయం గమనించాలి: వామపక్షాలు
X

దిశ, అమరావతి బ్యూరో: రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నారని వామపక్షాల నేతలు మండిపడ్డారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ మంగళవారం విజయవాడలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు 2018 అక్టోబర్‌లో పోల్చుకుంటే గరిష్టంగా పెరిగాయన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర ఆనాడు బ్యారెల్‌కు సగటున 80 డాలర్లుగా ఉంటే అది ప్రస్తుతం 35 డాలర్లుగా ఉందని తెలిపారు.

పెరిగిన పన్ను వల్ల పెట్రోల్ కు రూ.10, డీజిల్‌కు రూ.13 చొప్పున ప్రభుత్వం ప్రజల మీద భారాల మోపుతోందని ఆయన విమర్శించారు. రోడ్డు సెస్సు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాలను పెంచడం ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఏమీ దక్కదన్న విషయం గమనించాలన్నారు. ఈ సమయంలో అనేక రాష్ట్రాలు, కేంద్ర నిర్ణయం తర్వాత పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్, ఇతర సుంకాలను పెంచాయని అన్నారు. ప్రజలకు నగదు బదిలీ వంటి చర్యలు చేపట్టి వారి చేతుల్లో డబ్బు ఉంచాల్సిన సమయంలో ఈ విధంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం ప్రజల జీవన ప్రమాణాల్ని దెబ్బతీస్తోందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. పెంచిన పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రోడ్డు సెస్సు, టోల్ టాక్స్‌లతో ప్రజలను దోచుకుతింటున్నారని, పెంచిన భారాన్ని తగ్గించకుంటే బంద్ సైతం చేస్తామని మధు హెచ్చరించారు.

కరోనాతో ప్రజలందరూ ప్రాణలు కోల్పోతుంటే, కేంద్రం 22 రోజుల పాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. పెట్రోల్ కన్నా డీజిల్ రేటు పెరిగిపోయిందని విమర్శించారు. ప్రజలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని విమర్శించారు. అవసరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed