చైనా ఫుట్‌వేర్‌పై సుంకం పెంచాలని పరిశ్రమల లేఖ!

by Harish |
చైనా ఫుట్‌వేర్‌పై సుంకం పెంచాలని పరిశ్రమల లేఖ!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు చౌకగా దిగుమతి అవుతున్న చైనా ఫుట్‌వేర్‌పై యాంటీ డంపింగ్ సుంకం విధించాలని లెదర్ తయారీదారులు, వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, లెదర్ ఉత్పత్తుల్లో ఉపయోగించేందుకు చైనా నుంచి దిగుమతి అవుతున్న బేసిక్ క్రోమ్ సల్ఫేట్, సోడియం సల్ఫైడ్ వంటి రసాయనాలపై దిగుమతి సుంకాన్ని పెంచాలని కోరారు. ఈ రసాయనాలపై 8.2 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 35 శాతానికి పెంచాలని లెదర్ పరిశ్రమలు కోరుతున్నాయి. 2019లో ఫుట్‌వేర్‌పై దిగుమతి సుంకాన్ని 35 శాతానికి పెంచినప్పటికీ వాటి ప్రవాహం తగ్గలేదని, దీన్ని నియంత్రించగల ఏకైక మార్గం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించడమేనని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ రీజనల్ ఛైర్మన్ రమేష్ జునెజా చెప్పారు.

ఇటీవల చైనా వస్తువులను బహిష్కరించాలనే నినాదం పెరుగుతున్న నేపథ్యంలో లెదర్ పరిశ్రమ వర్గాలు సైతం తమ వ్యాపారులను కాపాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. చైనా ఏడాదికి సుమారు వెయ్యి కోట్లకు పైగా జతల బూట్లను తయారు చేస్తుంది. వీటిలో చైనాలో వినియోగించేది కేవలం 400 కోట్ల జతలను మాత్రమే. మిగిలినవి ఎగుమతి చేస్తుంది. ఇక, ఇండియాలో 250 కోట్ల జతల వరకు బూట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో తలసరి వినియోగం 2019లో 2 జతలు ఉంది. ఈ కారణంగానే చైనా ఇండియాకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. చైనాలో ఫుట్‌వేర్‌తో దేశీయ మార్కెట్ నిండిపోయిందని, తాము ఇంత తక్కువ ఖర్చుతో ఫుట్‌వేర్ తయారు చేయలేమని ఆగ్రాకు చెందిన రిలెక్స్ ఫుట్‌వేర్ యజమాని మహమ్మద్ బాబర్ చెప్పారు. చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతుండటంతో లెదర్ తయారీలో వాడే రసాయనాల తయారీ కర్మాగారాలు మూతబడ్డాయి.

Advertisement

Next Story