ఈటలను వేధిస్తే ఊరుకోం.. ప్రభుత్వానికి అనుబంధ సంఘాల వార్నింగ్

by Sridhar Babu |   ( Updated:2021-06-10 07:33:17.0  )
Leaders of TRS affiliates angry On State Government over former minister eatala Rajender issue
X

దిశ, జమ్మికుంట : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను వేధిస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. గురువారం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద విద్యార్థి సంఘం, యువజన విభాగం నాయకులు తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జవాజి కుమారస్వామి, టీఆర్ఎస్వీ నియోజవర్గ ఇన్చార్జి కొమ్ము అశోక్‌లు మాట్లాడుతూ.. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగ పెట్టారని చెప్పారు. కావాలనే ఉద్యమ ద్రోహులను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని వివరించారు. వీటన్నింటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము అలుపెరగని పోరాటం చేశామని, హుజరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కాగా, సుమారు 100 మందికి పైగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు భారీగా గాంధీ చౌక్ వరకు చేరుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకొని కొవిద్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో గుమికూడటం సరికాదని వారందరినీ చెదరగొట్టారు.ఈ చర్యతో పలువురు పోలీసుల తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు గంటలకొద్దీ సమావేశాలు ఇస్తే వాళ్లకు వర్తించని కొవిడ్ నిబంధనలు తమకు వర్తిస్తాయా అంటూ గుసగుసలు ఆడారు. కార్యక్రమంలో నాయకులు డబ్బెట రాజు, రాపర్తి అఖిల్, కొల్గూరి రాజ్ కుమార్, మోలుగూరి విక్రమ్, పొడేటి అనిల్, పిల్లి సంతోష్, మార్త అరవింద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story