అసైన్డ్ భూముల్లో సర్కారు మాయాజాలం

by Sridhar Babu |   ( Updated:2020-08-01 21:50:24.0  )
అసైన్డ్ భూముల్లో సర్కారు మాయాజాలం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: భూమిలేని పేద ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వర్గాలకు ప్రభుత్వాలు పంచిన అసైన్డ్ భూములు పెద్దఎత్తున చేతులు మారాయి. భూరికార్డుల ప్రక్షాళనతో ఈ విషయం బయటపడినా సర్కారు ఆ భూములపై నోరు మెదపలేదు. ఇప్పటివరకు అధికారికంగానే ఒక్క నల్లగొండ జిల్లాలోనే వేల ఎకరాలు పేదల నుంచి పెద్దల చేతుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ప్రధానంగా పట్టణాలకు చుట్టుపక్కల గ్రామాలు, జాతీయ, రాష్ట్రీయ రహదారులకు సమీపంలో ఉన్నభూములు అన్యాక్రాంతమయినట్లు తెలుస్తోంది. ఈ భూములు అధిక భాగం పలుకుబడి ఉన్నవారే కొనుగోలు చేసినట్లు సమాచారం.

అమ్మడానికి వీల్లేకున్నా..

గత ప్రభుత్వాలు రాష్ట్రవ్యాప్తంగా 14,28,856 మంది నిరుపేదలకు 22,74,500 ఎకరాలను పంపిణీ చేశాయి. నల్లగొండ జిల్లాలో 1,38,686 ఎకరాలను నిరుపేద రైతులకు పంపిణీ చేశారు. అయితే, ఇందులో 48,573 ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతం అయింది. భూమిలేని పేదలకు పంపిణీ చేసిన వేల ఎకరాల భూములను నిబంధనల ప్రకారం వారే వినియోగించుకోవాలి. ఆ భూములు అమ్మడానికి వీల్లేదు. కానీ, జిల్లాల్లోని ఆయా మండలాల్లో రెవెన్యూ యంత్రాంగం రికార్డుల్లో మార్పులు చేసినట్లు రికార్డుల ప్రక్షాళనలో తేలింది.

అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే.

నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు(గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నారు) నకిరేకల్ పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామపంచాయతీ భూముల వ్యవహారాన్ని చక్కదిద్దారు. అయితే, మాయమాటలు చెప్పి నేతలు తమ భూములను నకిరేకల్ పట్టణానికి చెందిన వారు లాక్కున్నారంటూ బాధితులు గతంలో ఆందోళనకు సైతం దిగారు. దీంతో భూమి కొనుగోలు చేసిన పెద్దలు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటూ సదరు నేతల దగ్గరికి వెళ్లారు. దీంతో ఓ నేత భారీగా ముడుపులు తీసుకుని వ్యవహారాన్ని చక్కదిద్దేశారు. ఇందులో జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులకు సైతం ముడుపులు అందాయి. నల్లగొండ జిల్లా చరిత్రలో అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.

వంద కోట్ల విలువైన భూమి..

అసైన్డ్ భూమికి నిఖార్సయిన రైతులుగా పట్టాదారు పాసుపుస్తకాలు రావడం..అది కూడా నాన్ అసైన్డ్ పట్టాలివ్వడం అనేది ఇప్పుడు పెద్ద గందరగోళంగా మారింది. ఈ భూమిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి సైతం వాటా ఇచ్చారు. జిల్లాలో ఇది ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే మారిపోయింది. 12 ఎకరాకలు పైగా ఉండే ఈ భూమి ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వంద కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఇప్పటికే ఆ భూమిని ఆనుకుని జాతీయ రహదారి 65 వెళ్లడం..కొత్తగా మరో జాతీయ రహదారి వెళ్తుండటంతో ఆ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఆ అసైన్డ్ భూమిని ప్రస్తుతం వెంచర్లుగా మార్చి ఒక్కో ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

పట్టణ కేంద్రాల్లోనే అధికం..

నల్లగొండ జిల్లాలో నిరుపేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను వారి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని వారికి తృణమో.. పణమో ముట్టజెప్పి పేదల చేతుల్లోంచి పెద్దలు లాగేసుకున్నారు. అక్కడి భూములకు విలువ పెరగడం..వాటిని వెంచర్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. పట్టణాలు, సమీపంలోని గ్రామాలు, రహదారుల వెంట ఉన్న అధికశాతం అసైన్డ్ భూములు పెద్దఎత్తున క్రయవిక్రయాలు జరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో భారీగా ప్రభుత్వ అసైన్డ్ భూములు కొల్లగొట్టారు. ఆక్రమణలను అడ్డగించేవారు లేకపోవడంతో రూ.కోట్ల విలువగల భూములను రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసి విక్రయించారు.

చట్టం చెబుతున్నదేంటంటే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1977లో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం 1977కు ముందు కానీ, తర్వాత కానీ సర్కారు ఇచ్చిన భూములను బదలాయింపు చేయొద్దు. అసైన్డ్ భూమిని అమ్మినా..దానం చేసినా.. కుదువ పెట్టినా, కౌలుకుఇచ్చినా.. ఇతర భూములకు బదులుగా మార్చుకున్నా బదలాయింపు కిందకే వస్తుంది. అసైన్డ్ భూమిని తరతరాలు వాడుకోవడం తప్ప విక్రయించేందుకు వీలు లేదు. అయినా బదలాయిస్తే అది చెల్లదు. పైగా శిక్షార్హమైన నేరంగా చట్టం చూపుతోంది. చట్టాన్ని ఉల్లంఘించి భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకుంటారు. మొదట అసైన్డ్ చేసిన వ్యక్తి ఇంకా నిరుపేద అయితే అతడికే దాన్ని అప్పగించాలి. రెండోసారి అయితే అప్పగించాల్సిన అవసరం లేదు.

Advertisement

Next Story

Most Viewed