‘సర్వే’పై ఉత్కంఠ.. అందరి ఆశలు దానిపైనే..!

by  |
‘సర్వే’పై ఉత్కంఠ.. అందరి ఆశలు దానిపైనే..!
X

సర్వే చేసేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. వీలైనంత త్వరగా భూ సమగ్ర సర్వే జరుగుతుంది. సమన్వయాలు, అక్షాంశాలు, రేఖాంశాలు ఇస్తం. ఇవి భూగోళం ఉన్నదాకా ఉంటయి. ఒక్కసారి కో ఆర్డినేట్స్ ఇస్తే సమస్య అనేదే ఉండదు. ఇప్పుడు అది సులభం అయ్యంది. – సీఎం కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం అసెంబ్లీలో ఇచ్చిన హామీ..

దిశ, న్యూస్ బ్యూరో: ఇప్పటికే ‘ధరణి’ డేటాతోనే అన్నీ పరిష్కారమయ్యాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అందరూ ఇక సమగ్ర సర్వే జరిగిపోతుందని, భూ వివాదాలనేవే ఉండవని చెబుతున్నారు. ప్రతి సర్వేకు కోఆర్డినేట్స్ ఇవ్వడం ద్వారా నిజంగానే అన్నీ పునీతమవుతాయా? మిగతా రాష్ట్రాలేం చేస్తున్నాయి? అభివృద్ధి చెందిన దేశాలేం చేశాయి? వాటి కంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నామని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమగ్ర భూ సర్వే అంటే భూములకు కోఆర్డినేట్స్ ఇవ్వడమేనా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రతి భూమికి నాలుగు సరిహద్దులు రావడం మినహా మరో ప్రయోజనమే లభించదు. సర్వే తర్వాత సెటిల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయకపోతే వివాదాల పరిష్కారం అసంపూర్ణమేనంటున్నారు. భూములకు జియో ట్యాగ్ కో ఆర్డినేట్ల ద్వారా కొత్త మ్యాపులు వస్తాయి. టెక్నాలజీలోనూ పొరపాట్లు చోటు చేసుకుంటాయి. సర్వే పూర్తి చేయడం సులువే. పట్టాదారులను కూర్చోబెట్టి సవరణలకు ఒప్పించడం ద్వారానే సత్ఫలితాలు లభిస్తాయని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ ‘దిశ’కు వివరించారు.

పైలెట్ ప్రాజెక్టు ఫెయిల్..

భూ భారతి పథకం కింద నిజామాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా భూ సమగ్ర సర్వే చేశారు. ఏ రెవెన్యూ అధికారిని అడిగినా అది ఫెయిల్ అనే అంటారు. దానికి కారణాలు చట్టంలో లేకుండా చేశారు. విస్తీర్ణం తగ్గింది. పట్టాదారులు అంగీకరించాలి. టైటిల్ గ్యారంటీ ఇచ్చేందుకు ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. సమస్యలు తలెత్తితే సర్వేకు సంబంధించి ఎలాంటి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయలేదు. సర్వే చేసిన సంస్థ నివేదికను ప్రభుత్వానికి పంపడం మినహా పట్టాదారుల భాగస్వామ్యం లేదు. రెవెన్యూ శాఖ భాగస్వామ్యం లేకుండా సర్వే పూర్తి చేశారు. దానికో సార్ధకత లేకుండా పోయిందని సునీల్ కుమార్ చెప్పారు.

నరేంద్రమోడీ సీఎంగా ఉన్న కాలంలోనే గుజరాత్‌లోనూ సర్వేను డిపార్టుమెంట్ మాత్రమే పూర్తి చేసింది. కమ్యూనిటీ, రెవెన్యూ భాగస్వామ్యం లేకుండా చేశారు. భూ రికార్డులు ప్రతి రోజూ చూసే సిబ్బంది ప్రాతినిధ్యం లేదు. చాలా వరకు చెట్ల కింద కూర్చొని పూర్తి చేశారు. దాంతో అనేక పొరపాట్లు దొర్లాయి. ఏడాదిన్నర క్రితం గుజరాత్ ప్రభుత్వం ఆ సర్వేను అమలు చేయొద్దని నిర్ణయించింది. రెవెన్యూ సిబ్బంది, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ భాగస్వామ్యం తప్పనిసరి అని తేలింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు మాత్రమే చేసే సర్వే వల్ల కలిగే ప్రయోజనం కొంతేనని నిపుణులు చెబుతున్నారు.

ఏపీలో ఎప్పుడో పూర్తి..

2012-2016 వరకు ఆంధ్రప్రదేశ్‌లో భూ సర్వేను పూర్తి చేశారు. ‘మీ ఇంటికి-మీ రికార్డులు’ అనే పథకం అమలు చేశారు. ప్రతి భూమికి జియో రెఫరెన్స్‌తో ఫిజికల్ ఫోటోలను అప్‌లోడ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలోనే సీసీఎల్ఏగా పునీత ఉన్నప్పుడు పబ్లిక్ డొమెయిన్‌‌లోనూ చూసినట్లు సునీల్ చెప్పారు. పట్టాదారుకు సంబంధించిన అన్ని వివరాలను ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఐడీతో సహా క్రోడీకరించారు. ఆ రాష్ట్రంలో కోటి ఎంట్రీలను పూర్తి చేసినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆధార్ మాదిరిగా భూధార్ నంబర్లను అందించారు.

సంపూర్ణ వివరాలతో జియో కో-ఆర్డినేట్స్ ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అభినందించింది. అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు సీసీఎల్ఏగా పని చేసిన రేమాండ్ పీటర్ ఓ అడుగు వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లోనూ అధ్యయనం చేశారు. అటవీ భూములకు కోఆర్డినేట్స్ గుర్తించారు. అటవీ శాఖ బీట్ అధికారుల దగ్గరుండే మిషన్ ద్వారా కూడా పూర్తి చేయొచ్చునని అన్నారు. ఏదైనా భూమికి నాలుగు మూలలను గుర్తించి కంప్యూటర్‌లో మాన్యువల్‌గా కలపడమేనన్నారు.

ఏడాదిలో పూర్తి చేయొచ్చు..

అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో ఏడాది కాలంలోనే సర్వేను పూర్తి చేస్తామని సర్వే ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ప్రైవేటు సంస్థలు కూడా అనేకం ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ సంస్థతో చేయించడం ద్వారా పట్టాదారుల నమ్మకాన్ని పొందొచ్చునని రెవెన్యూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిపుణులు సూచిస్తున్నారు. అయితే సర్వే ప్రక్రియ 10 శాతమే.

ల్యాండ్ సెటిల్మెంట్ చేయడమే 90 శాతం పని అని స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కేవలం భూములకు సర్వే నంబర్లవారీగా జియో కోఆర్డినేట్లను గుర్తిస్తామని, కొత్త మ్యాపులను రూపొందిస్తామన్నారు. తన ప్రసంగంలో ల్యాండ్ సెటిల్మెంట్ గురించి ప్రస్తావించలేదంటున్నారు. ప్రైవేటు సంస్థల సర్వే అసమగ్రంగా ఉంటుంది. భూ రికార్డులను రెగ్యులర్‌గా చూస్తోన్న ఉద్యోగులను, ల్యాండ్ సర్వే శాఖ సిబ్బంది, పట్టాదార్లను భాగస్వాములను చేసినప్పుడు సర్వేకు సార్థకత ఏర్పడుతుందని సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed