హైవే నిలిచేనా..? గమ్యం సాగేనా...?

by Disha Web Desk 12 |
హైవే నిలిచేనా..? గమ్యం సాగేనా...?
X

దిశ, ములుగు ప్రతినిధి: వాహనాలు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లేలా, ప్రయాణం సాఫీగా జరిగేలా, చాలా ఏళ్లు ఎలాంటి గుంతలు పడకుండా జాతీయ రహదారులు నిర్మించాలి. కానీ వ్రిద్ది సంస్థ నిర్మిస్తున్న హైవే పనులు నాసిరకం‌గా ఉన్నాయి. ఆరేపల్లి నుంచి ములుగు వరకు 29.5 కిలోమీటర్ల మేర నిర్మించే నాలుగు లైన్ల 163 జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో తారు రోడ్డు అప్పుడే గాడులు, గుంతలతో దర్శనమిస్తుంది. తారు వేసిన రెండు నెలలకే గాడులు ఏర్పడడంతో వాహనదారులు ముక్కున వేలేసుకుంటున్నారు.

కొత్త రోడ్డుపై గుంతలు, గాడులే నిదర్శనం..

ఆరేపల్లి నుంచి ములుగు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 163 పనులు ఇంకా జరుగుతున్నప్పటికీ చాలా వరకు మొదటి లేయర్ తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదటి లేయర్ పై రెండవ లేయర్ తారుతో రోడ్డు వేయాల్సి ఉండగా అప్పుడే మొదటి లేయర్ తారుపై గాడులు ఏర్పడుతుండడంతో హైవే నిర్మిస్తున్న వ్రిద్ది సంస్థ పనితీరును బట్టబయలు చేస్తుంది. త్వరగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రోలింగ్, క్యూరింగ్ సరిగా చేయకపోవడం, పాత రోడ్డుపై తొలగించిన తారును మళ్లీ రీసైక్లింగ్ చేసి వాడడంతోనే నిర్మాణంలో నాణ్యత లోపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. హైవే లో భాగంగా నిర్మించే కాంక్రీట్ పన్నుల్లో సరైన క్యూరింగ్ జరగడం లేదని, హడావిడిగా నిర్మించిన రహదారి పూర్తికాకముందే వాహనాల రద్దీని తట్టుకోలేక గుంతలు ఏర్పడుతుంటే ఇకముందు పూర్తిస్థాయిలో వాహనాల రద్దీని తట్టుకొని ఎలా నిలుస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ..

ఆరేపల్లి నుంచి ములుగు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టడానికి రూ.200 కోట్ల వ్యయంతో వ్రిద్ది సంస్థకు కాంట్రాక్ట్ అప్పజెప్పి పనులు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వ్రిద్ది సంస్థ కటాక్షపూర్ వద్ద డాంబర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కానీ వారిని వ్రిద్ది సంస్థ బుజ్జగించి అడ్డు తొలగించుకుంది. నిజానికి ఆ సంస్థ ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ తో దుర్వాసనతో పాటు నల్లటి పొగ వాతావరణాన్ని కలుషితం చేస్తుందని, డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న దట్టమైన నల్లటి పొగ చుట్టుపక్క ఉన్న పంట పొలాలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తూ రైతులకు ఇబ్బందిగా మారిందని వాపోయారు. దాదాపు 200 కోట్లతో చేపడుతున్న జాతీయ రహదారి 163 విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, బడా సంస్థ జోలికి వెళ్లడం ఎందుకని అధికారులు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనులు త్వరగా పూర్తి చేయాలని నాణ్యతకు మంగళం పడుతుండడంతో అప్పుడే లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకొని క్షేత్రస్థాయిలో రోడ్డు పనులను పరిశీలించి నాణ్యతతో నిర్మాణం చేపట్టేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story

Most Viewed