ఉద్యోగంలో జూనియర్.. అక్రమాల్లో సీనియర్

by Disha Web Desk 12 |
ఉద్యోగంలో జూనియర్.. అక్రమాల్లో సీనియర్
X

దిశ, నల్లగొండ బ్యూరో: గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికి, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన ఉద్యోగి గత అధికార పార్టీ రాజకీయ నాయకుడిగా అవతారమెత్తాడు. ప్రస్తుతం కూడా అప్పటి నాయకుల లబ్ధి కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికీ గ్రామ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడనే విమర్శలున్నాయి. ఇందుగలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అన్నట్లుగా గ్రామ సమస్యలను పట్టించుకోడు కానీ ప్రతి చిన్న పంచాయతీ విషయంలో తలదూర్చడం ఇతనికి పరిపాటిగా మారింది. అతని ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివ్వెంల మండలం గుంజలూరు పంచాయతీ కార్యదర్శి బాగోతాలివి. విసిగి వేసారిన గ్రామస్తులు డీపీవో కు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

వెంచర్ నుంచి రూ.2 లక్షలు వసూలు..

చివ్వెంల మండలం గుంజలూరు పంచాయతీ కార్యదర్శి గత పాలకవర్గానికి ఇతను వెన్నుదన్నుగా నిలిచారని చర్చ జరుగుతుంది. ఓ అధికారిగా కాకుండా గత అధికార పార్టీ నాయకుడిగా చలామణి అయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. వివాహానికి ముందే ఇతనికి ఉద్యోగం రావడంతో గుంజలూరు గ్రామంలో పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇతనికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ లోపు ఇతనికి అదృష్టంగా వరించినట్లు ఇతని వివాహ సమయానికి ముందు గ్రామ స్టేజీ వద్ద 65 ఎకరాలకు పైగా నూతనంగా ఓ వెంచర్ వెలిసింది... దీంట్లో ఉన్న అక్రమాలకు ఆసరా చేసుకుని తన వివాహానికి రూ.2 లక్షలు తీసుకున్నరనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా నగదు వసూలు చేయడమే గాక, నా పెళ్లికి కొందరు వీఐపీలు వస్తారని, గ్రామానికి చెందిన కొందరు నాయకులు వస్తారని, వారందరికీ కొంతమంది మద్యం కావాలని రూ.50 వేలకు పైగా మద్యానికి వసూలు చేసి దావత్ ఇచ్చినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

పింఛన్లు స్వాహా..

గుంజలూరు గ్రామానికి వచ్చిన ఒక సంవత్సరం పాటు స్తబ్ధుగా పని చేసినప్పటికీ ఏడాది దాటిన తర్వాత అతని విశ్వరూపం చూపించసాగాడు. అప్పుడున్న అధికార పార్టీ పేరు చెప్పుకునే చోటా, మోటా నాయకులకు అంటకాగి తిరగడం వచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా బెదిరించే వారని విమర్శలున్నాయి.. అంతేకాకుండా తనను ఎవరు ఏం చేయలేరని భావించి కొందరి వృద్ధాప్య పెన్షన్ సొమ్మును సుమారు రూ. లక్షకు పైగా కాజేసి తన సొంత అవసరాలకు వాడుకున్నాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు అప్పటి గ్రామ స్థాయి నాయకుడు విషయం బయటకు కాకుండా డబ్బులు చెల్లించి అంశాన్ని క్లోజ్ చేసినట్లు సమాచారం. కార్యదర్శి ఆగడాలను, అక్రమాలను గుర్తించిన సదరు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. అయినా అప్పటి అధికార పార్టీ నాయకుల సహకారంతో ఇతనిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేశారనే చర్చ జరుగుతుంది.

ఉన్నతాధికారులను సైతం లెక్కచేయని ఉద్దండుడు..

గ్రామస్థాయి ఉద్యోగి అయినప్పటికీ అహంకారం మాత్రం ఓ స్థాయిలో ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఉద్యోగంలో బాధ్యతగా ఉండాల్సిన అతను కనీసం పై అధికారులను సైతం లెక్కచేయడనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగైదు రోజుల క్రితం చివ్వెంల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నీటి ఎద్దడిపై అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు... ఆఫీస్ కు వచ్చిన..సమావేశ మందిరంలోకి రాకుండా ఇతర ఉద్యోగులతో బయట తిరుగుతున్న సమయంలో కార్యాలయ సిబ్బంది పై అధికారి వచ్చాడు.. రండి అని పిలిచారు

వెంటనే ఈ అధికారి 10 మందికి పైగా ఉన్న తోటి ఉద్యోగుల ముందే " ఈ ఎండలకు ఎవరెవరో చస్తున్నారు. మన సార్ కు చావు రావట్లేగా" అంటూ వెళ్లిపోతుండగా తోటి ఉద్యోగుల్లో కొందరు అలా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పి వారించి సమావేశానికి వెళ్లారు. అంతేకాకుండా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు వేగంగా ఆన్లైన్ చేయాలని అధికారులు చెప్పినప్పటికీ తనకు తీరిక దొరికినప్పుడు మాత్రమే చేసి పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందకుండా నష్టం చేసారనే విమర్శలు ఉన్నాయి. గ్రామ స్థాయి అధికారి చేసిన బ్లాక్ మెయిలింగ్ పనులకు మండల స్థాయి అధికారికి జిల్లా కలెక్టర్ రెండు రోజుల క్రితమే షోకాస్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

కాంగ్రెస్‌కు ఓటేస్తే పెన్షన్ కట్ అంటూ ఎలక్షన్ ముందు ప్రచారం

వాస్తవానికి గుంజలూరు గ్రామం కాంగ్రెస్ పార్టీకి పట్టున్న గ్రామం. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా అసెంబ్లీ ఎలక్షన్ ముందు అన్ని రకాల వ్యవస్థలను అప్పటి అధికార పార్టీ నాయకులు గ్రామంలో ప్రయోగించారు. పోలీసు, రెవెన్యూ, పథకాలకు సంబంధించి అన్ని రకాల ప్రయోగాలు చేశారు. దీంట్లో భాగంగా ఈ గ్రామ స్థాయి అధికారి పాత్ర అత్యంత కీలకంగా మారింది. గ్రామంలో పెన్షన్, ఇండ్లు, దళిత బంధు, ఉచిత బియ్యం, ఉపాధి హామీ లాంటి పథకాలు లబ్ధిదారులకు కేటాయింపు విషయంలో ఇతని పాత్ర కీలకంగా ఉంటుంది. ఎలాగైనా మాకు సహకరించాలని అప్పటి బాస్ కోరడంతో ఇతనే కాకుండా మండలం లో ఇతనికి దగ్గరగా ఉండే పలువురిని సైతం అప్పటి పెద్ద నాయకులకు కల్పించి రూ.లక్షల్లో డబ్బులు దండుకుని అసెంబ్లీ ఎన్నికల ముందు సమయంలో కాంగ్రెస్ ఓటు వేస్తే మీకు పెన్షన్, ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలే గాక కనీసం ఉపాధి హామీ పని కూడా ఉండదని, కులాల వారీగా మీకు వచ్చే కార్పొరేషన్ రుణాలు కూడా రావని విస్తృత ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిద్దరు ఇతని పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోని ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed