ఆ గ్రామంలో దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు..పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు?

by Disha Web Desk 18 |
ఆ గ్రామంలో దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు..పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు?
X

దిశ,వైరా : అసలే వేసవి కాలం..ఆపై గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు..భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ మండుతున్న గోళంగా మారిన కాలంలో ఆ గ్రామానికి వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ గ్రామస్తులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. తమ సమస్యను చెప్పేందుకు మిషన్ భగీరథ ఏఈకి కాల్ చేసినా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటున్నారు. వారం రోజుల క్రితం కాలిపోయిన పైపులైన్‌కు మరమ్మత్తులు చేయకుండా మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు కలెక్టర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి, సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంటే మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం పనితీరుతో ప్రభుత్వం అబాసు పాలవుతోంది.

వైరా మండలంలోని వల్లాపురం గ్రామంలో వారం రోజులుగా దాహార్తితో ప్రజలు అల్లాడుతున్నారు. గుక్కెడు మంచినీటి కోసం ఆ గ్రామస్తులు మండు వేసవిలో పడరాని పాట్లు పడుతున్నారు. పాలడుగు గ్రామం నుంచి వల్లాపురం గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ 110 డయా పైప్‌లైన్ సుమారు 15 మీటర్ల దూరం గతంలో భూమిలో వేయకుండా ఓపెన్‌గా వదిలేశారు. అయితే ఇటీవల ఓ రైతు తన పొలంలోని మొక్కజొన్న దంటుకు నిప్పుపెట్టడంతో ఆ పొలం సమీపంలో ఉన్న పైప్‌లైన్ సైతం కాలిపోయింది. వారం రోజుల క్రితం ఈ పైపులైన్ కాలిపోయినా నేటి వరకు మిషన్ భగీరథ అధికారులు మరమ్మత్తులు చేయలేదు.

దీంతో వారం రోజులుగా ఆ గ్రామస్తులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలంలో మంచినీటికి తీవ్ర ఇబ్బంది ఉందని వెంటనే పైపు లైనుకు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేసేందుకు గ్రామస్తులు మిషన్ భగీరథ ఏఈ మణి శంకర్‌కు ఫోన్ చేసినా కనీసం ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వం అపకీర్తిని మూటగట్టుకుంటోంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆ పైప్‌లైన్‌కు మరమ్మత్తులు చేసి, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని వల్లాపురం గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Next Story