అసెంబ్లీ షేర్ టార్గెట్.. ఓటు బ్యాంకుపైనే BRS ఫోకస్!

by Disha Web Desk 4 |
అసెంబ్లీ షేర్ టార్గెట్.. ఓటు బ్యాంకుపైనే BRS ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటు బ్యాంకుపైనే బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. మరోపార్టీకి ఓటు బ్యాంకు డైవర్ట్ కాకుండా పక్కా వ్యూహంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేపట్టింది. దాంతో మెజార్టీ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలతో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫైనాన్స్ గండంగా మారింది. మరోవైపు పార్టీకి, నేతల మధ్య సమన్వయ లోపం పార్టీకి తలనొప్పిగా మారింది.

పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా లోక్‌సభ ఎన్నికలు..

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా ఓట్లను సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ 17 స్థానాల్లో తొమ్మిదింటిలో మాత్రమే విజయం సాధించింది. బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. అధికారం కోల్పోయాక జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ఓట్లపైనే బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం.

కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నాలు

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచి, 39.40 శాతం ఓట్లను సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొంది, 37.35 శాతం ఓట్లను సాధించింది. రెండు పార్టీల మధ్య 1.85 శాతం ఓట్ల తేడా ఉంది. రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి 92,35,833 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 87,53,956 ఓట్లు వచ్చాయి. ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేడర్‌లో నైరాశ్యం అలుముకునే ఉంది. వారిలో జోష్ పెంచేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఓటు బ్యాంకును పదిలపరుచుకునేలా ప్లాన్

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 76,96,848 ఓట్లు రాగా, అది 41.71 ఓటింగ్ శాతం. బీజేపీకి 36,26,173 ఓట్లు వచ్చాయి. 19.65 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 54,96,686 ఓట్లు రాగా, అది 29.79 శాతం. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిని కేసీఆర్ సారించారు. పార్టీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంపై పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టారు. రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నంచేస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు సైతం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని లోక్‌సభ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కేడర్‌ను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు.

అభ్యర్థులను వెంటాడుతున్న ఆర్థిక భారం

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యపోటీ జరిగింది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగబోతోంది. మూడుపార్టీల అగ్రనేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆర్థిక భారం వెంటాడుతోంది. పోలింగ్‌కు గడువు మరోవారం రోజులు మాత్రమే ఉంది. అయినప్పటికీ అభ్యర్థులకు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాకపోవడంతోనే అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడుతున్నట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అభ్యర్థులకు కేసీఆర్ ఫైనాన్స్ చేసినా ఓటమిని ముందే గమనించి డబ్బులు ఖర్చు చేయలేదని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు కేసీఆర్ ఫైనాన్స్ చేసినప్పటికీ ఖర్చు చేయడం లేదని గులాబీ కార్యకర్తల్లో టాక్. ఎండలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని కేడర్ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు వాహనాలను సైతం అరెంజ్ చేయడం లేదని, ఏదీ లేకుండా తాము ప్రచారం చేసేది ఎలా అని పలువురు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోల్పోయి ఆరు నెలలుకాక ముందే ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే తమ పరిస్థితి ఏంటని కేడర్ ప్రశ్నిస్తోంది.

పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇదే విధంగా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో ఫైనాన్స్ గండం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుందనే చర్చ ఊపందుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సీట్ల కంటే ఓటు బ్యాంకును నిలుపుకోవడంపై దృష్టి సారించినట్టు సమాచారం. ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంటే సీట్లు సైతం అవే వస్తాయని ఆశిస్తున్నారు. అందుకోసం పోలింగ్ బూత్‌ల వారీగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. అయితే గులాబీ పార్టీకి ఆర్థిక అంశం ప్రతికూలంగా మారింది. దీంతో ఈ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయనే అనేది వేచిచూడాలి.

Next Story

Most Viewed