రిజర్వేషన్ల చుట్టూనే అగ్రనేతల ప్రసంగాలు

by Disha Web Desk 12 |
రిజర్వేషన్ల చుట్టూనే అగ్రనేతల ప్రసంగాలు
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో/ నిర్మల్ ప్రతినిధి: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేయగా.. అవన్నీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలు మాత్రమేనని ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేయబోమని బీజేపీ అగ్రనేత అమిత్ షా భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేరోజున కాంగ్రెస్ బిజెపి వైరి పక్షాల అగ్రనేతల పర్యటన సందర్భంగా వారి ప్రసంగాలు ఆద్యంతం రిజర్వేషన్ల చుట్టూనే సాగింది. నిర్మల్‌లో జరిగిన సభలో రాహుల్ గాందీ రిజర్వేషన్ల రద్దు అంశం కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మలుచుకున్నట్లు కనిపించింది. అయితే కాగజ్నగర్ వేదికగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తమను ఎదుర్కొనలేకనే ఇప్పటిదాకా ఎక్కడా కూడా ప్రకటించని రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పదేపదే చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నట్లుగా అభివర్ణించడం కనిపించింది.

రిజర్వేషన్లు రద్దు అవుతాయని రాహుల్ ఆందోళన

భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే పక్కాగా దేశంలో రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైనే ఆయన తన ప్రసంగంలో ఎక్కువ ఫోకస్ చేశారు. దేశంలో 50% పైగా ఓబీసీలు ఉంటే వారికి దక్కుతున్న అధికార ఫలాలు రెండు నుంచి మూడు శాతం కూడా ఉండడం లేదని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో కీలక అధికారులు ముగ్గురు నలుగురు మించి బీసీలు లేరని... రిజర్వేషన్లు రద్దు అవుతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని వ్యాఖ్యానిస్తూ బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు 15% దళిత వర్గాలు ఉంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారని ఎస్సీల రిజర్వేషన్లు కూడా రద్దు చేయబోతున్నారంటూ ఆయన ఓటర్లకు నూరి పోసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉండే ఆదివాసులకు సంబంధించి మాట్లాడుతూ ఎనిమిది శాతం గిరిజనులు ఉంటే ఢిల్లీలో ఒక్క ఆదివాసి ఉన్నత స్థాయి అధికారి మాత్రమే ఉన్నారని ఇది బీజేపీ పాలనకు పరాకాష్ట అంటూ ఆదివాసులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాంటింగ్ తో రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశంపై ఎక్కువసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యాంగం మార్పు పై కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పలుసార్లు గుర్తు చేశారు.

వ్యతిరేక శక్తుల కుట్రగా తేల్చిన అమిత్ షా

ఎస్సీ ఎస్టీ బీసీలకు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారికి సంబంధించిన రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగించి తీరుతామని బీజేపీ అగ్రనేత అమిత్ షా నొక్కి చెప్పడం చూస్తే... ఆయన కూడా తన పర్యటనలో రిజర్వేషన్ల అంశాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగం మార్పు పై విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం జనభాహుల్యంలోకి బలంగా వెళుతున్నదన్న సంకేతం మేరకు అమిత్ షా ప్రధానంగా ఈ అంశంపై మాట్లాడారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పనికట్టుకొని భారతీయ జనతా పార్టీని బదనాం సమయంలో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేయబోమని భరోసా ఇచ్చారు. అయితే తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని మాత్రం స్పష్టం చేశారు. ఒకే రోజున తూర్పు జిల్లాలో బీజేపీ నేత అమిత్ షా, పశ్చిమ జిల్లాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ల పర్యటన సందర్భంగా వారి ప్రసంగాల్లో రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా మాట్లాడటం కొత్త చర్చకు దారి తీసింది.

ఇరు పార్టీల్లోనూ జోష్...

అటు తూర్పున అమిత్ షా పర్యటనతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహంతోనే పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా ఈ పర్యటన సాగినట్లు పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు ఊహించిన దానికన్నా ఎక్కువగా కాగజ్ నగర్ సభకు జనం తరలి వచ్చినట్లు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో అసలు పట్టులేని ప్రాంతాల్లో తమ నేతల సభలకు వస్తున్న జనం చూస్తే ఎన్నికల ఫలితం తేలిపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక పశ్చిమ జిల్లా నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు సంబంధించి జన సమీకరణలో కాంగ్రెస్ శ్రేణులు బాగా కష్ట పడినట్లు కనిపించింది నాలుగు నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారు.

ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ పార్టీ సీనియర్లు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో అందరిలో ఒకరుగా కలిసిపోయినట్లుగా పాల్గొన్నారు. నిర్మల్ రాహుల్ గాంధీ సభ విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు కృతజ్ఞతలు తెలిపారు జన సమీకరణ తాము ఆశించిన దాని కన్నా ఎక్కువగా హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు ఇదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని ఆయన చెప్పారు. మంత్రి సీతక్క ప్రసంగం కూడా అందరినీ ఆకట్టుకున్నది ఆదివాసి మహిళకు తొలిసారిగా ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చామని ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. అలాగే ఎన్ని అవకాశాలు వచ్చినా పదవులకు దూరంగా ఉన్న రాహుల్ గాంధీని త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన నేతగా అభివర్ణించారు. ఆయనను ప్రధానిగా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Next Story

Most Viewed