రెండ్రోజుల్లో పదోన్నతులు

by Anukaran |
రెండ్రోజుల్లో పదోన్నతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం… వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలను తహసీల్దార్ కార్యాలయాల్లో చేపట్టేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. అంతకు ముందుగానే అన్ని కార్యాలయాల్లో తహసీల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కొన్ని కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జి తహసీల్దార్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, అత్యంత కీలకమైన విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయి అధికార్లతోనే ఉండాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శాఖాపరమైన చర్యలను ప్రారంభించారు. నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా అన్నింటినీ భర్తీ చేయనున్నారు. తాజాగా పదోన్నతుల కోసం 2016-17 సంవత్సరానికి గాను నాయబ్ తహసీల్దార్ల జాబితా ప్యానెల్స్‌కు ఆమోదం లభించింది. త్వరలోనే ముగ్గురు ఐఏఎస్‌ల బృందం కూర్చొని డీపీసీ పదోన్నతుల అంశాన్ని పరిశీలించనుంది. 100 మందికి పైగానే కొత్త తహసీల్దార్లు రానున్నారని సమాచారం.

తహసీల్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ఉద్యోగులు..

రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి కొందరు ఉద్యోగులను తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటేషన్‌పై పని చేయించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని అనుభవాన్ని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు అలవాటయ్యేంత వరకూ ఈ విధానాన్ని అనుసరించాలని వ్యూహరచన చేస్తున్నారు. కొత్తగా తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల నిర్వహణపై నాలుగు రోజుల శిక్షణను ఇవ్వనున్నారని ఓ అధికారి చెప్పారు. ఆ శిక్షణ క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. అందుకే వారికి సహకారం అందించేందుకే తొలి రోజుల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతోనే చేయించాలని భావిస్తున్నారని సమాచారం. అక్టోబరు ఒకటో తేదీ నుంచి తహసీల్దార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ఈ లోగానే అన్ని ఆఫీసుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను పూర్తి చేయించాలని నిర్ణయించారు.

ఇతర శాఖలకు వీఆర్వోలు..

వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత వారందరినీ ఇతర శాఖలకే బదిలీ చేయాలని సర్కారు యోచిస్తోంది. గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వీఆర్వో పోస్టులు రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వారిలో కొందరిని రెవెన్యూ శాఖలో పని చేయిస్తారన్న ప్రచారం ఉత్తుత్తదేనని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖల్లో వారి సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఏయే కేటగిరీల్లో ఎన్నేసి ఖాళీలు ఉన్నాయన్న సమాచారాన్ని ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఇటీవల కార్పొరేషన్లలో వార్డుకో అధికారిని నియమిస్తామన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటన చాలా మంది వీఆర్వోలను ఆలోచింపజేస్తోంది. తమను పురపాలక శాఖకు బదిలీ చేయాలంటూ పైరవీ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలుకుబడిన కొందరు వీఆర్వోలు ఓ మంత్రిని కలిసి తమ మనసులోని మాటను వినిపించారు. ఆ మంత్రి ఈ సమాచారాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.

Advertisement

Next Story