అధికారుల ఇష్టారాజ్యం.. ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు

by Anukaran |   ( Updated:2021-01-26 13:00:58.0  )
అధికారుల ఇష్టారాజ్యం.. ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు
X

దిశ, శేరిలింగంపల్లి: హైదర్‎నగర్ సెట్విన్ భూముల వ్యవహారం తారాస్థాయికి చేరింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని విలువైన సర్కార్ స్థలాల అన్యాక్రాంతం, అక్రమ నిర్మాణాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ కబ్జా రాజకీయ వేడిని రాజేస్తోంది. హఫీజ్ పేట్, హైదర్ నగర్, మియాపూర్ భూముల కబ్జాల్లో అధికార టీఆర్ఎస్ నేతలు, వారి బంధువులు ఉన్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ లొల్లి రోజుకో మలుపు తిరుగుతూ అందరిని ఉత్కంఠకు గురి చేస్తున్నది. కబ్జాదారులు ఎవరైనా వారికి కొమ్ముకాస్తుంది మాత్రం ప్రభుత్వ అధికారులే అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అదీగాక శాఖల మధ్య సమన్వయలోపం అక్రమార్కులకు వరంగా మారుతోంది. దీనికితోడు జీహెచ్ఎంసీలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుమతుల కోసం వచ్చిన డాక్యుమెంట్లు ఏ స్థలానివి, సర్కార్ భూములా..? ప్రైవేట్ వ్యక్తులవా అని కూడా చూడకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు.

‘గాలి’వాటంకాదు

ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం, అందులో నిర్మాణాలు చేపట్టడం అంతా అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నదా..? అంటే జరుగుతున్న పరిణామాలు, పుట్టుకొస్తున్న కట్టడాలను చూస్తే నిజమని నమ్మాల్సి వస్తోంది. సెట్విన్ స్థలాల విషయంలో ఈతరహాలోనే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పక్క సర్వే నెంబర్లు వేసి, సెట్విన్ స్థలాల్లో భవంతులు కట్టిన వైనం కళ్లముందే కనిపిస్తోంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్, అలాగే మరో కీలక నేత ఉన్నట్లు డాక్యుమెంట్లను సైతం బయటపెట్టినా అధికారుల్లో చలనం లేదు. పైగా దబాయింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఇదే సెట్విన్ ల్యాండ్ లో ఓ వ్యక్తి నోటరీ ద్వారా భూములను కొనుగోలు చేసినట్లు దొంగపత్రాలు సృష్టించగా.. మరో వ్యక్తి భూ వివాదం సెటిల్ చేస్తా అంటూ 150 గజాల స్థలంలోకి ఎంటర్ అయ్యి, ఇప్పుడు 1500 గజాల స్థలాన్ని ఆక్రమించాడు. ఇలా సెట్విన్ స్థలాల కబ్జాల విషయంలో అనేకమంది వ్యక్తులు, శక్తులు ఉన్నాయి. సెట్విన్ స్థలంలోనే ఓ అడ్డా ఏర్పాటు చేసుకుని ‘గాలి’గా సెటిల్ మెంట్లు చేస్తామంటూ బోర్డులు పాతేస్తున్నారు. కోర్టు ఆర్డర్లను సైతం పట్టించుకోకుండా దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు.
అన్నీ తెలిసే అనుమతులు..

సెట్విన్ స్థలాల కబ్జాల్లో అనేకమంది వ్యక్తులు, రాజకీయ నాయకులు పాత్రదారులుగా, సూత్రదారులుగా ఉన్నారనే అంశం ఇట్టే తెలిసిపోతున్నది. పక్కనే ఉన్న సర్వే నెంబర్ల డాక్యుమెంట్లు చూపిస్తూ సెట్విన్ స్థలాల్లో నిర్మాణాలు సాగిస్తున్నారు. దీనిపై ఇటీవలే ‘దిశ దినపత్రిక’లో పూర్తి సాక్ష్యాధారాలతో ‘సర్వే నెంబర్ ఒకచోట.. భవన నిర్మాణం మరోచోట’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై కొందరు రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ తో పాటు సంబంధిత అధికారులకు ట్విట్టర్ వేదికగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి ఈ భవన నిర్మాణంపై కూకట్ పల్లి తహసీల్దార్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు. కానీ రెవెన్యూ అధికారులకు రాసిన లేఖలో స్వయంగా డిప్యూటీ కమిషనర్ సెట్విన్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు వచ్చాయి. దానికి మేము అనుమతులు ఇచ్చామని, ఇంతకు అది ఏ సర్వే నెంబర్ అని పేర్కొంటూ ‘దిశ పత్రిక’ కథనాన్ని ఉటంకించారు. ఇదే విషయంపై తహసీల్దార్ స్పందిస్తూ.. డీసీనే అది సెట్విన్ స్థలం అని పేర్కొంటూ మాకు లేఖ రాశారు. అది 14సీ కింద ఉందని తెలిసి, ఆమె పర్మిషన్స్ ఇచ్చాక మమ్మల్ని ఎలా అడుగుతారు అంటూ కూకట్ పల్లి తహసీల్దార్ గోవర్ధన్ ప్రశ్నిస్తున్నారు.

అంతా మోనార్క్ లే..!

సెట్విన్ స్థలాల విషయంలో అక్రమార్కులకు అధికారులు వంతపాడుతున్నారన్న విషయానికి డీసీ రాసిన లేఖనే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ ఒక్క విషయంలోనే కాదు డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక అక్రమ నిర్మాణాల వెనక కీలకంగా వ్యవహరించారని పలువురు బాధితులు విమర్శి్స్తున్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతుంటారు. కానీ ఈమె రూటే సెపరేట్. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడో లేదా వాళ్ల మెప్పు పొందాలన్నా ఉద్దేశమో తెలియదు కానీ.., ఓ వ్యక్తి ప్రభుత్వ లే అవుట్ లో కొన్న స్థలం అక్రమమంటూ అక్కడ గోడ కట్టించిన ఘనత సైతం ఈ అధికారికే చెల్లింది.

అలాగే సదురు అధికారి కింద పనిచేసే టీపీఎస్ సిబ్బంది సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదర్ నగర్, అడ్డగుట్ట తదితర చోట్ల జీ ప్లస్-2 నిర్మాణాలకు అనుమతులు తీసుకుని, బహుళ అంతస్థుల నిర్మాణాలు సాగిస్తుంటే చోద్యం చూస్తున్నారు. ఎన్నిసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా, ప్రజలు ప్రశ్నించినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే పడరాని పాట్లు పడుతూ.. తమకు అనుకూలంగా ఉన్న వారితో బెదిరింపులకు దిగుతున్నారు.

Advertisement

Next Story