ఈ భూములు మావే.. ఫారెస్టు అధికారులు మా జోలికి రావద్దు

by Shyam |
ఈ భూములు మావే.. ఫారెస్టు అధికారులు మా జోలికి రావద్దు
X

దిశ, మహబూబాబాద్ : తమ భూములను ఫారెస్ట్ భూములగా మార్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని లాలూ తండా గ్రామ పంచాయతీ రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఇనుగుర్తి గ్రామ పరిధిలోని లాలూ తండా గ్రామానికి చెందిన సుమారు 100 మంది కుటుంబాలు గత 80 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నట్టు తెలిపారు.

సర్వే నెంబర్ 1141, 1150, 1110, 1114 లలో సాగు చేసుకుంటున్న భూములకు తెలంగాణ ప్రభుత్వం నూతన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసినట్టు కూడా తెలిపారు. కానీ, ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ భూములు అటవీ పరిధిలోకి వస్తాయని, మళ్ళీ పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఫారెస్ట్ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా భూములను ఫారెస్టు పరిధిలోకి మార్చకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ధర్నాలో హేమ, తేజ, బాలు, లచ్చిరాం, వెంకన్న, లచ్చు, సోమన్న, భోజ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story