BWFలో చరిత్ర సృష్టించిన భారత పురుష షట్లర్లు

by Shyam |
BWFలో చరిత్ర సృష్టించిన భారత పురుష షట్లర్లు
X

దిశ, స్పోర్ట్స్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత పురుష షట్లర్లు చరిత్ర సృష్టించారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ వేదికగా శుక్రవారం జరిగిన పరుషుల క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించి సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. దీంతో అతడు కనీసం కాంస్య పతకం అయినా దక్కించుకునే వీలుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పతకం గెలుచుకోనున్న మూడో భారతీయుడిగా శ్రీకాంత్ రికార్డులకు ఎక్కాడు. కిదాంబి శ్రీకాంత్ 21-8, 21-7 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ కాల్యావ్‌ను ఓడించాడు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న మూడు నెలల తర్వాత కోర్టులోకి అడుగు పెట్టిన కాల్యావ్.. తొలి రౌండ్‌లో సాయి ప్రణీత్‌ను ఓడించాడు. అయితే క్వార్టర్ ఫైనల్‌లో మాత్రం శ్రీకాంత్‌ను అడ్డుకోలేకపోయాడు. మాజీ నెంబర్ వన్ శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కాల్యావ్‌కు అసలు అవకాశమే ఇవ్వలేదు. రెండు గేమ్స్‌కూడా సునాయాసంగా సొంత చేసుకొని మ్యాచ్ గెలిచాడు.

మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ 21-15, 15-21, 22-20 తేడాతో చైనాకు చెందిన ఝోజున్ పెంగ్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో తన క్లాస్ ఆటతో దూసుకొని పోయిన లక్ష్యసేన్ దాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో ఝోజున్ పుంజుకున్నాడు. బ్యాక్ షాట్లు, స్మాష్‌లతో లక్ష్య సేన్‌ మీద పై చేయి సాధించాడు. ఆ గేమ్‌ను సేన్ 15-21తో కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌ హోరాహోరీగా సాగింది. ఒకానొక దశలో ఝోజున్ మ్యాచ్ పాయింట్ వరకు వెళ్లాడు. కానీ, లక్ష్య సేన్ ఆ మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకొని అతడిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. హోరాహోరీగా సాగిన చివరి గేమ్‌ను 22-20తో కాపాడుకొని మ్యాచ్‌ను గెలిచాడు.

దీంతో లక్ష్య సేన్ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా లక్ష్య సేన్ చరిత్ర సృష్టించాడు. అంతే కాకుండా వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డులకు ఎక్కాడు. శనివారం జరుగనున్న తొలి సెమీ ఫైనల్‌లో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ – లక్ష్య సేన్ తలపడబోతున్నారు. ఓడిపోయినవాళ్లు కాంస్యంతో సరిపెట్టుకోవల్సి ఉంటుంది. అయితే గెలిస్తే మాత్రం ఫైనల్ చేరి కనీసం రజత పతకం సాధించే అవకాశం ఉన్నది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ప్రకాశ్ పదుకొనె (1993), సాయి ప్రణీత్ (2019) కాంస్య పతకాలు సాధించారు.

మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటి దారి పట్టింది. గత కొన్నాళ్లుగా పీవీ సింధుపై పై చేసి సాధిస్తున్న తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. పీవీ సింధు 17-21, 13-21 తేడాతో తైజుపై ఓడిపోయింది. పీవీ సింధు ఈ మ్యాచ్‌లో అంచనాల మేరకు రాణించలేదు. తైజు కొడుతున్న బలమైన షాట్లకు సింధు దగ్గర సమాధానమే లేకుండా పోయింది. సింధు కచ్చితంగా చాంపియన్ హోదాను నిలుపుకుంటుందని భావించినా.. చివరకు ఖాళీ చేతులతో ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.

Advertisement

Next Story