తనిఖీల్లేవ్.. గాల్లో దీపంలా ప్రజారోగ్యం…

by Shyam |   ( Updated:2021-06-14 21:30:02.0  )
తనిఖీల్లేవ్.. గాల్లో దీపంలా ప్రజారోగ్యం…
X

దిశ, సిటీ బ్యూరో : అసలే ప్రపంచంతా కరోనా వైరస్ తో కలవరపడుతున్న విపత్కరమైన పరిస్దితులు. ఎలాగో మామూలు రోజుల్లో సక్రమంగా విధులు నిర్వర్తించని జీహెచ్ఎంసీ అధికారులు కరోనా వైరస్ విజృంభణ సమయంలోనూ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ఒకవైపు వాతావరణం మారుతున్న సమయం, మరోవైపు ఏ మాత్రం ఆలస్యం చేసినా కాటేసేందుకు సిద్దంగా ఉన్న వైరస్. ఇలాంటి సమయంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో కలుషితంకాని నీరు, ఆహారాన్ని విక్రయించాల్సిన ఆహార విక్రయ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో లక్షల సంఖ్యలో ఉన్న ఆహార విక్రయ కేంద్రాలను ఎప్పటికపుడు తనిఖీ చేసి, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన డిజిగ్నేటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు కేవలం ముగ్గురికే పరిమితమయ్యారు. ఈ ముగ్గురిలో ఒకరిదే పెత్తనం. అందులో ఒకరు కొవిడ్ బారిన పడి సెలవుల్లో వెళ్లి ఇటీవలే విధుల్లో చేరారు. వీరిలో ఒకరు ఈస్ట్ జోన్, మరోకరు సెంట్రల్, సౌత్ జోన్ లను చూస్తుండగా, మిగిలిన నార్త్, వెస్ట్ జోన్లతో పాటు కొత్తగా వచ్చినవారి పరిపాలన వ్యవహారాలను చూస్తున్నారు.

సర్కిల్ కు కనీసం ఒక్కరైనా ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఉండాలని, నగరం ఏడు సర్కిళ్లుగా ఉన్నపుడు, ఆ తర్వాత గ్రేటర్ గా రూపాంతరం చెందిన తర్వాత కూడా తీర్మానాలు చేసి పంపటంతో ఎట్టకేలకు ప్రభుత్వం 26 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో ఐదు పోస్టులకు సంబంధించి కోర్టులో వివాదాలుండగా, మిగిలిన 21 పోస్టులకు సంబంధించి రెండున్నర నెలల క్రితమే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా పోస్టింగ్ లు ఇచ్చారు. కానీ వారు అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో ఎక్కడా విధులు నిర్వర్తించలేదు. ఒక్క ఆహార విక్రయ కేంద్రాన్ని కూడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. సర్కారు ఇటీవలే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపునివ్వటంతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేసుకోవాలని ఈ ఆహార విక్రయ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు.

ఆహార విక్రయ కేంద్రాలు మొదలుకుని చికెన్, మటన్, బీఫ్ సెంటర్లతో పాటు టీ, టిఫిన్లు విక్రయించే చిన్న చిన్న హోటళ్లు మొదలుకుని స్టార్ హోటళ్ల వరకు వీరు తనిఖీలు నిర్వహించి ఫుడ్ ను తనిఖీ చేసి, లోపాలు కన్పిస్తే వెంటనే శ్యాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కు పంపాల్సి ఉంటుంది. కానీ కొవిడ్ విజృంభణ ప్రారంభమైన తర్వతా వీరు ఒక్క హొటల్ పై గానీ, ఒక్క ఆహార విక్రయ కేంద్రంపై గానీ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వీరు ప్రతి రోజు ఓ షెడ్యూల్ ను తయారు చేసుకుని, దాని ప్రకారం ఆహార విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించాల్సి ఉంటుంది.

కానీ పలు కేంద్రాల్లో ఆహారం బాగా లేకపోయినా, సోషల్ డిస్టెన్స్, ఆహారంలో నాణ్యత వంటివి పాటించకుండా నడుపుతున్న కేంద్రాలపై వీరు స్వచ్చంధంగా వెళ్లి తనిఖీలు చేయాలన్నది వీరి ప్రధాన విధి. కానీ పలు హోటళ్లు, ఓపెన్ క్యాటరింగ్ కేంద్రాలు, కలుషితమైన ఆహారాన్ని విక్రయించే హోటళ్లపై జనమే వీరి వద్దకు వచ్చి ఫిర్యాదులు చేసినా వీరు పట్టించుకోవటం లేదు. వీరు అందుకు విరుద్దంగా వ్యవహారిస్తున్నారు. పని చేయనిదే సర్కారు ఇస్తున్న జీతాలు తీసుకుని, దానికి తోడు నగరంలోని పలు ఆహార విక్రయ కేంద్రాలు, హోటళ్ల నుంచి మామూళ్లు మాట్లాడుకుని, కేవలం అవి వసూలు చేసుకునేందుకు సర్కారిచ్చిన కార్లలో షికారు కోడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ కలవరానికి గురి చేస్తుండగా, మరో వైపు థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్త్తున్నా, వీరు కళ్లు తెరవరా? ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి, తమ అక్రమార్జన కోసం పని చేసే ఇలాంటి అధికారులు అవసరమా? అంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కీలకమైన ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ ఇన్ స్పెక్టర్లు విధులపై పర్యవేక్షించకుండానే అన్ని సక్రమంగానే ఉన్నాయని, ఏ పని చేపట్టినా జవాబుదారితో చేస్తున్నామని ప్రకటనలు చేసే సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు విధులు నిర్వర్తించలేని ఈ అధికారుల తీరపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారో? వేచి చూడాలి.

Advertisement

Next Story