దిశ ఎఫెక్ట్ : ‘కుడా’ పాల‌న‌పై కేటీఆర్‌కు నివేదిక‌..?

by Shyam |   ( Updated:2021-09-04 09:55:00.0  )
దిశ ఎఫెక్ట్ : ‘కుడా’ పాల‌న‌పై కేటీఆర్‌కు నివేదిక‌..?
X

దిశప్ర‌తినిధి, వరంగ‌ల్ : కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థలోని అవినీతి, అక్ర‌మాల డొంక క‌దులుతోంది. అధికార పాల‌క‌వ‌ర్గంలోని కీల‌క నేత‌పై వేటు త‌ప్ప‌దా..? అక్ర‌మాలు, అవినీతి ఆరోప‌ణ‌లు, స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పోస్టులో కొన‌సాగుతున్న ఉన్న‌తాధికారుల‌పై బ‌దిలీ వేటు త‌ప్ప‌దా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా కుడాలో జ‌రుగుతున్న అవినీతి అక్ర‌మాల‌పై మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌నాత్మ‌క క‌థ‌నాలు వెలువడిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర మునిసిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ‘కుడా’ ప‌నితీరుపై ఉన్న‌తాధికారుల ద్వారా నివేదిక కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు అధికారులు నివేదిక కూడా స‌మ‌ర్పించిన‌ట్టు సమాచారం. శాఖాప‌రంగానే కాకుండా కుడా పీవో అజిత్ రెడ్డి ఇత‌ర అధికారుల‌ ప‌నితీరు, వ్య‌వ‌హార శైలిపై నిఘా వ‌ర్గాలు కూడా నివేదిక అంద‌జేసినట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

కుడాపై ‘దిశ’వ‌రుస క‌థ‌నాలు..

స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కుడాలో అధికారులు కొన‌సాగుతుండ‌టంపై దిశ ప‌త్రిక వ‌రుస‌గా క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. అలాగే కుడా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప‌నుల్లో వెలుగుచూసిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను ప‌లుమార్లు ఎండ‌గ‌ట్టింది. దీనికి తోడు ఆరెప‌ల్లితో పాటు మ‌రో ఐదు గ్రామాల్లో చేప‌ట్టిన ర‌హ‌స్య స‌ర్వేపైనా కుడా అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరును వెలుగులోకి తీసుకువ‌చ్చింది. హ‌న్మ‌కొండ బ‌స్‌స్టేష‌న్ ఎదుట నిర్మించిన‌ కుడా కాంప్లెక్స్ వేలం పాట జ‌రిగిన తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే పాల్గొన్న వేలం పాటలోనూ అత్యంత ర‌హ‌స్యంగా నిర్వ‌హించ‌డంపై పెద్ద దుమార‌మే చెల‌రేగింది. దీనంత‌టి వెనుక ఓ కీల‌క ప్ర‌జాప్ర‌తినిధి హ‌స్తం ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మీడియాలో వ‌రుస‌గా క‌థ‌నాలు రావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం కుడాపై దృష్టి సారించి నివేదిక కోరిన‌ట్టుగా తెలుస్తోంది.

పీవోపై ఏసీబీకి బ‌క్క‌జ‌డ్స‌న్ ఫిర్యాదు..

స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏళ్ల త‌ర‌బ‌డి ఒకే పోస్టులో పీవో అజిత్‌రెడ్డి కొన‌సాగడం, అత‌నిపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేదంటూ బ‌క్క జ‌డ్స‌న్ వ‌రుస‌గా నిర‌స‌న‌లు వ్యక్తం చేస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కుడా పీవో అజిత్‌రెడ్డి, చైర్మ‌న్ ఇత‌ర అధికారుల‌పైనా మునిసిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ఉన్న‌తాధికారి విద్యాధ‌ర్‌కు, ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే కుడా అధికారుల‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కుడా ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుంద‌ని, పీవో అజిత్ రెడ్డితో పాటు ఇత‌ర అధికారులు, సిబ్బంది బ‌దిలీలు ఉంటాయ‌ని విశ్వ‌సనీయ సమాచారం. అదే స‌మ‌యంలో చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డిపైనా వేటు తప్పదని స‌మాచారం. కొద్దిరోజుల్లోనే వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణానికి చెంద‌ని ఓ కీల‌క నేత చైర్మ‌న్‌గా నియామ‌కం కానున్న‌ట్లు టీఆర్‌ఎస్ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

Advertisement

Next Story