‘మాగోడు పట్టని మూగోడు’..!

by Shyam |
‘మాగోడు పట్టని మూగోడు’..!
X

దిశ, న్యూస్‌బ్యూరో:

‘ఎమ్మెల్యేలు మాగోడు పట్టించుకొనే పరిస్థితిలో లేరు. ఇండ్లు, ఆఫీసులని కాళ్లరిగేలా తిరిగినా లాభం లేకుండా పోయింది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులోనైనా నాయకులకు మా సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇక్కడా మంత్రి కేటీఆర్ కలవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎదుటైనా మాగోడు వెల్లబోసుకుందామ్మంటే ప్రగతిభవన్‌ గేటు ముందు నుంచే పోలీసులు గెంటేస్తుర్రు. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి, సమస్యలు తీర్చేదెవరు’ అని జిల్లాల నుంచి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ భవన్‌కు వచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో ప్రజలు నమ్మకం కోల్పోయారు. నేరుగా హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడానికి తెలంగాణ భవన్‌కు బారులు తీరుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సమయం ఇవ్వడం లేదని, సమయం ఇచ్చినా మాగోడు పట్టించుకోవడం లేదని, సద్ది కట్టుకొని పట్నం వచ్చినా ఫలితం లేకుండా పోతోందని బాధితులు వాపోతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన 30 మంది మహిళలు ప్రగతిభవన్‌కు వచ్చారు. పొద్దంతా కష్టపడి రాత్రుల్లో తలదాచుకోవడానికి గూడు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మాకు డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని, మా ఎమ్మెల్యే వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్‌కు వెళ్లిన మహిళలను పోలీసు సిబ్బంది అక్కడ నుంచి వెళ్లగొట్టారు. టీఆర్ఎస్ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌నైనా కలిసి సమస్యలు చెప్పుకుందామని వచ్చిన మహిళలకు పార్టీ ఆఫీసులో మంత్రి కేటీఆర్ కలవకపోవడంతో నిరాశే ఎదురైంది. ఇలా రాష్ట్రం నలుమూలాల నుంచి వస్తున్న బాధితులకు నియోజకవర్గంలో తలెత్తిన ఇబ్బందులే రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనూ ఎదురవుతున్నాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఓ వికలాంగుడు సీఎం సహాయ నిధి కోసం ఎమ్మెల్యే దగ్గరకు ఎన్నిసార్లు వెళ్లినా పట్టించుకోవడం లేదని, నేరుగా తన గోడును కేటీఆర్‌కు విన్నవించుకుందామని ఆఫీసుకు వస్తే ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. పార్టీ ఆఫీసు‌లో ఓ ఎమ్మెల్సీ అతనితో మాట్లాడుతూ కేటీఆర్ నిన్ను చూస్తే నీ సమస్యను పరిష్కారిస్తాడు కానీ, నీకు కలిసేది ఎక్కడా! ఆఫీసుకే 23 రోజుల తర్వాత నిన్న వచ్చాడు. నేను కలుద్దామంటేనే సమమివ్వడం లేదు. మీ ఎమ్మెల్యేతోనే మాట్లాడుపొ’ అని చెప్పడంతో వెనుదిరిగాడు. ఇలా భూ సమస్యలు, ఇండ్ల పట్టాలు, రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్ల కోసం పార్టీ ఆఫీసులో కేటీఆర్‌ను కలిస్తే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వచ్చిన బాధితలకు నిరాశే మిగులుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రగతిభవన్‌లో తండ్రి సమయమివ్వరు.. పార్టీ ఆఫీసులో కొడుకు కలవడు

‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మా సమస్యలు తీరుతాయి. మా ప్రాంతపు నాయకుడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు వింటాడని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్న ఆనందంలో ప్రజలు ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించింది, మీ గేటు వద్ద కాపాలా ఉన్న పోలీసులతో దెబ్బలు తీనడానికేనా అని ప్రజలు టీఆర్ఎస్ అగ్ర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామంటే తండ్రి ప్రగతిభవన్ గేటు దాట నివ్వడాయే.. కొడుకు ఆఫీసులో ఉండడాయే మా సమస్యల చెప్పుకునేదెవరిక’ని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed