- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మోడీ హయాంలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయని ఎద్దేవా చేశారు . మంగళవారం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవీకి మద్దతుగా ప్రైవేట్ కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 లక్షల 72 వేల కోట్లు కడితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి ఇచ్చింది రూ. లక్షా 40 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన మూడు రాష్ర్టాలు ఇంకా సెటిల్ కాలేదని, తెలంగాణ ఏర్పడిన 6 నెలల్లోనే అనేక సమస్యలు పరిష్కరించామని వివరించారు. విద్యుత్ సమస్యను అధిగమించడంతో పాటు తాగు, సాగునీటి కష్టాలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. గడిచిన ఆరు సంవత్సరాలుగా విద్యారంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చిందన్నారు.
2014కు ముందు 248 గురుకుల పాఠశాలలు ఉంటే.. కొత్తగా 647 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో 4 లక్షల 32 వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా… ఒక్కో విద్యార్థి మీద లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. నీట్, జేఈఈతో పాటు ఇతర ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేలా ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో 12,800 కోట్ల రూపాయలను విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ క్రింద అందించిందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్, జ్యోతిబాపులే, వివేకానంద ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఒకొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అంగన్‌వాడీ పిల్లల నుంచి మొదలుకుంటే పీజీ స్థాయి విద్యార్థుల వరకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు విద్యార్థులకు దొడ్డు బియ్యం ఇచ్చేవని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొలత లేకుండా.. సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని కడుపు నిండా పెడుతున్నామని తెలిపారు. పిల్లలు, టీచర్ల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కరోనా లాక్‌డౌన్ కాలంలో పాఠశాలలను బంద్ పెట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా లాక్‌డౌన్ కాలంలో రాష్ర్ట ప్రభుత్వానికి రూ. 52 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
ప్రైవేట్ విద్యా రంగంలో టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు 12 లక్షల మంది ఉన్నారని, వాళ్లందరికి సంతృప్తికరంగా సాయం అందించడం సాధ్యం కాదని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శరవేగంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో మూడేళ్ల సమయంలోనే లక్షల ఎకరాలకు నీరిచ్చి వలసలు ఆపామన్నారు. హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరంగా ఉందన్నారు. దీంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, పెట్టుబడులు వస్తున్నాయంటే సమర్ధవంతమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతలు పక్కాగా ఉన్నందుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్షా 32 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు కేవలం 24,048 మాత్రమేనని, ఇందులో తెలంగాణకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే చ్చాయన్నారు. ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు.
మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో సిలిండర్ ధర రూ. 400 ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ. 800లకు పెరిగిందన్నారు. మోదీ హయాంలో పెట్రోల్ ధర కూడా సెంచరీ కొట్టేసిందన్నారు. నల్లధనం తీసుకొస్తానని ఊదరగొట్టారని, విదేశాల నుంచి ఇప్పటి వరకు పైసా నల్లధనం తీసుకురాలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సురభి వాణిదేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మార్చి14 తేదిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఎన్నికలలో ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదు కావడం బాధాకరమని, ఈ ఎమ్మెల్సి ఎన్నికలలో ప్రతి గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కేశవరావు, తలసాని సాయి కిరణ్ యాదవ్, ప్రయివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పీఎల్ శ్రీనివాస్, ప్రేమ్ నారాయణ, శ్రీనివాస్, సుషీల్ కుమార్, రూప పాల్గొన్నారు.