అయ్యా కేటీఆర్ గారు.. ఏంటీ మాకు ఈ పరిస్థితి

by Shyam |
అయ్యా కేటీఆర్ గారు.. ఏంటీ మాకు ఈ పరిస్థితి
X

దిశ, శేరిలింగంపల్లి : మంత్రి కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ ఓల్డ్ విలేజ్‌లో సమస్యలు తిష్ట వేసుకు కూర్చున్నాయి. హైదర్ నగర్ గ్రామంలోని పలు బస్తీలలో డ్రైనేజీ ఇబ్బందులు, మంచినీటి అసౌకర్యం, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయాయి. మంత్రి కేటీఆర్ దత్తత డివిజన్ కాస్త చెత్త డివిజన్‌గా తయారు అయిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హైదర్ నగర్ ప్రాథమిక పాఠశాల రోడ్లలో స్థానికులు చెత్తను పారబోసి వెళ్తున్నారు. దీంతో రోడ్డు మార్గంలో వాహనదారులు భయపడుతున్నారు. చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు.

ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన స్థానికుల్లో మార్పు రాకపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మసీదు రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు లేక పోవడంతో కొందరు ఆకతాయిలు, యువకులు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ పాదచారులను, ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదే రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాల పక్కన కొందరు తమ వాహనాలను అక్రమంగా పార్క్ చేసి వెళ్తున్నారు.

అసలే ఇరుకైన రోడ్డు దానికితోడు జన సంచారం ఎక్కువగా ఉండే వేళల్లో పాదచారుల, వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీనికితోడు స్కూలు ఆవరణ ముందు చెత్త వేస్తూ డంపింగ్ యార్డ్‌లా మార్చేశారని స్థానికులు తెలిపారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వేగ నియంత్రణను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story