ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ

by srinivas |
ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని, సమగ్ర ప్రాజెక్టు నివేదికపై కృష్ణా బోర్డు అధ్యయనం చేయడం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి మంజూరు చేయడం తదితరాలు ముగిసేంత వరకు దాని జోలికి వెళ్ళొద్దని బోర్డు సభ్యులు హరీకేశ్ మీనా సోమవారం ఆ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణపు పనులను తక్షణం నిలిపేయాలన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కృష్ణా బోర్డు నుంచి ఇప్పటికే మూడు లేఖలను రాసినట్లు గుర్తుచేశారు. గతేడాది మే, జూలై, అక్టోబరు మాసాల్లో రాసిన లేఖలను తాజా లేఖలో ప్రస్తావించారు.

రాయలసీమ పంపింగ్ స్టేషన్ (సిస్టమ్), పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పథకం విస్తరణ, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 80 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి నిర్మిస్తున్న బనకచర్ల కాంప్లెక్స్ తదితర పనులన్నింటినీ తక్షణం నిలిపేయాలని ఆ లేఖలో ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక అధ్యయనం తర్వాత అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి మంజూరయ్యేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆ లేఖలో హరీకేశ్ మీనా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ డిసెంబరు 19న రాసిన లేఖలో అన్ని విషయాలూ ఉన్నాయని గుర్తుచేశారు.

Advertisement

Next Story