రేపట్నుంచి కొత్త వాటర్​ ఇయర్.. రెండు రాష్ట్రాల మధ్య తెగని పంచాయతీ

by srinivas |   ( Updated:2021-05-29 12:09:05.0  )
రేపట్నుంచి కొత్త వాటర్​ ఇయర్.. రెండు రాష్ట్రాల మధ్య తెగని పంచాయతీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. కృష్ణా నదిపై ఇప్పటికే లెక్కకు మించి ప్రాజెక్టులు, కాల్వల సామర్థ్యం పెంచుతున్న ఏపీ.. ఎక్కువ నీటిని తరలిస్తుందని తెలంగాణ వాదిస్తూనే ఉంది. కేటాయింపుల కంటే అధికంగా నీటిని తోడుకుంటున్న ఏపీ.. పలు అంశాల్లో తెలంగాణపైనే ఆరోపణలు చేస్తోంది. తాజాగా వచ్చేనెల 1 నుంచి కొత్త జల సంవత్సరం మొదలుకానుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ఇంకా పెండింగ్ పెట్టారు. దీని కోసం ఈ నెల 25న కృష్ణా బోర్డు సమావేశం ఏర్పాటు చేసినా పలు కారణాలతో వాయిదా పడింది. దీంతో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు ఇంకా తేలలేదు.

మిగుల జలాలపై పేచీ..

జూన్ 1 నుంచి కొత్త నీటి సంవ‌త్సరం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో నీటి ల‌భ్యత అంచనా, కేటాయింపులు త‌దిత‌ర అంశాలన్నీ ఎటూ తేల్చలేదు. మరోవైపు మిగులు జ‌లాల‌ను ఎలా వినియోగించుకోవాల‌న్న అంశంపై గ‌తేడాది నుంచీ చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై ప్రత్యేక క‌మిటీని నియ‌మించిన‌ప్పటికీ స‌మ‌స్య కొలిక్కి రాలేదు. దీన్ని తేల్చేందుకు బోర్డు నుంచి కూడా ప్రయత్నాలేమీ జరుగడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాలు ప‌ర‌స్పరం ఫిర్యాదు చేసుకోవడంతో.. కేంద్రప్రభుత్వం డీపీఆర్‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సూచించింది.

కానీ ఇప్పటికీ డీపీఆర్‌లు ఇవ్వడంలో రెండు రాష్ట్రాలు వెనకడుగు వేస్తూనే ఉన్నాయి. బ్రిజేష్ కుమార్​ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకూ 50 శాతం చొప్పున రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలని తెలంగాణ కోరుతున్నా పరిగణలోకి తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఒక సంవత్సరంలో కేటాయించిన నీటిని వినియోగించుకోని నేపథ్యంలో ఆ నీటిని వచ్చే ఏడాది వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాలంటూ తెలంగాణ చెప్పుతున్నా ఏపీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఏటా ఏపీ.. కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీటిని వాడుకుంటుంది. కానీ తెలంగాణ మాత్రం కేటాయింపుల కంటే తక్కువ నీటిని వినియోగిస్తోంది. దీంతో ఇప్పటి వరకూ మన రాష్ట్రం పూర్తిస్థాయి కోటా వాడుకోలేదు.

పరిధిపై తొందరెందుకు?

కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్తున్నది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరిపాకే బోర్డు పరిధి నిర్ధారించాలని తెలంగాణ మొదటి నుంచీ వాదిస్తున్నది. దీనిపై బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో వాదనలు వినిపించింది. నీటి కేటాయింపులు జరుపకుండా పరిధి నిర్ణయించడం సరికాదని తెలిపింది. ప్రస్తుతమున్న 46:66 నిష్పత్తిని 50:50 నిష్పత్తికి మార్చాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తున్నది.

ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం, కేంద్ర జల్‌శక్తి శాఖ, కేఆర్‌ఎంబీకి స్పష్టంచేసింది. గతంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విజ్ఞప్తులను పక్కనబెడుతూ త్వరలో కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ధారించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అదనపు కార్యదర్శి రజత్‌కుమార్‌ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షించారు. కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ణయిస్తే జరిగే పరిణామాలపై చర్చించారు. ఒకవేళ కేంద్రం కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేస్తే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

బోర్డు ఏం చేస్తున్నట్టు..?

మరోవైపు కృష్ణా బోర్డు వైఖరిపై రెండు రాష్ట్రాలు అయిష్టంగానే ఉన్నాయి. కేఈఆర్​ఎంబీ ఛైర్మన్‌ను మార్చాలంటూ ఏపీ ఏకంగా కేంద్రానికి లేఖ రాసింది. ఇటు తెలంగాణ కూడా బోర్డుపై గుర్రుగానే ఉంది. ఏపీకి న్యాయం చేస్తుందనే ఆరోపణలున్నాయి. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై కేఆర్​ఎంబీ వత్తాసు పలుకుతుందని ఎప్పటి నుంచే ఆరోపిస్తోంది. అసలు కృష్ణా బోర్డు ఏం చేస్తుందనేది ఇప్పుడు తేల్చుకోవాల్సిన అంశంగా మారింది.

మేం డబ్బులివ్వం..

ఇక ఏపీ కృష్ణా బోర్డు నిర్వహణకు నిధులివ్వమంటూ చేతులెత్తేస్తోంది. నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉండగా.. తెలంగాణ ప్రతి ఏటా విడుదల చేస్తోంది. కానీ బోర్డు వైఖరి సరిగా లేదంటూ ఏపీ మాత్రం రెండేండ్ల నుంచి నిర్వహణ నిధులు ఆపేసింది. 2020–21లో రూ. 8.37 కోట్ల నిర్వహణ నిధులకు తెలంగాణ నుంచి రూ. 3.5 కోట్లు చెల్లించారు. కానీ ఏపీ ఇవ్వడం లేదు. అంతేకాదు.. రెండేండ్ల నుంచి నిర్వహణ నిధులు ఇవ్వడం లేదంటూ ఏపీకి కృష్ణా బోర్డు లేఖ పంపింది. ఇటీవల నిర్వహించాల్సిన సమావేశ ఎజెండాలో కూడా పొందుపర్చింది. 2021-22లో కేఈఆర్​ఎండీ నిర్వహణ వ్యయం రూ. 18 కోట్లుగా చూపించింది. ఇరు రాష్ట్రాలు రూ. 10 కోట్ల చొప్పున విడుదల చేయాలని పేర్కొంది. కానీ రెండు రాష్ట్రాలూ ఇంకా రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఏపీ ఇవ్వడం లేదనే సాకుతో ఈసారి తెలంగాణ కూడా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story