కొండా వర్సెస్ గండ్రా.. భూపాలపల్లి కాంగ్రెస్ సీటు ఎవరికీ..?

by Anukaran |   ( Updated:2021-08-08 02:49:25.0  )
కొండా వర్సెస్ గండ్రా.. భూపాలపల్లి కాంగ్రెస్ సీటు ఎవరికీ..?
X

దిశ, భూపాలపల్లి : రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో రెండు సంవత్సరాల్లో జరగనుండడంతో భూపాల్‌పల్లి నియోజకవర్గానికి పలువురు కాంగ్రెస్ నేతలు పయనమవుతున్నారు. భూపాల్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి ఏకైక నాయకుడు ఉన్న గండ్ర వెంకటరమణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్ లోచేరడంతో కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుండి నాయకుడు కరువై పోయినాడు. ఈ పరిణామంలో భూపాల్ పల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేయడానికి పలువురు నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకుడు కొండ మురళి సైతం భూపాల్ పల్లి నియోజకవర్గం పై దృష్టిసారించినట్లు తెలిసింది. అందు కోసమై గత కొద్ది రోజుల నుండి భూపాల్ పెళ్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో టచ్ లోఉన్నట్లు సమాచారం.

ఈ ప్రాంతంలోని పలువురు నాయకులను కార్యకర్తలను వరంగల్ కి పిలిపించుకొని మాట్లాడుతున్నట్లు తెలిసింది. భూపాల్ పల్లి నియోజకవర్గం లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండా మురళి భూపాల్ పల్లి నుండి పోటీ చేస్తే తనకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని, అందుకే భూపాల్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. గతంలో సైతం భూపాల్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొండ మురళి భూపాల్ పల్లి నియోజకవర్గం తో సంబంధాలు ఎక్కువ లేకపోవడం భూపాలపల్లి నియోజకవర్గంపై దృష్టి సారించడం తో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు, ఎన్నికల కోసమే ఈ ప్రాంతానికి వచ్చే నాయకుల పట్ల నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.

కార్యకర్తలకు అండగా శ్రీధర్ బాబు

గండ్ర వెంకట రమణ రెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్ళినప్పటి నుండి భూపాల్ పల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులను శ్రీధర్‌ బాబు అతని సోదరుడు మాత్రమే అందుబాటులో ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏ కార్యకర్తలకు నాయకులకు సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో సైతం శ్రీధర్ బాబు అతని సోదరులు సైతం పాల్గొన్నారు. ఈ ప్రాంతలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టించుకునే వారు లేని సమయంలో చిట్యాల, రేగొండ, ఘన్‌పూర్, మొగుళ్లపల్లి, టేకుమట్ల, భూపాల్ పల్లి ఆరు మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీధర్ బాబు కనుసన్నల్లోనే వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పదవుల కోసం పార్టీలు మారడం ఈ ప్రాంతాలకు వలసలు రావడం పట్ల కాంగ్రెస్ లోని అసలైన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రాజకీయాల్లో సాధారణమే

రాజకీయ నాయకులు పార్టీలు మారడం, పదవుల కోసం వలసలు పోవడం సాధారణము అని పలు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజా సేవ చేయడానికి ప్రాంతంతో పార్టీలతో పనిలేదని, ఎక్కడికైనా వెళ్లి పోటీచేసి ప్రజల కోసం పని చేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణమైపోయింది అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

గండ్ర సత్తన్న చేరిక తో ఆశలు ఆవిరి

కాంగ్రెస్ పార్టీలోకి గండ్ర సత్తన్నా చేరడం ఖాయం కావడంతో పలువురు ఆశలు ఆవిరై పోతున్నట్లు సమాచారం. ఇన్ని రోజులుగా భూపాల్ పల్లి నియోజకవర్గం పై ఆశలు పెంచుకున్న కొండ మురళికి సైతం భూపాల్ పల్లి ప్రతికూలంగా ఉన్నది. గండ్ర సత్యనారాయణ స్థానికుడు కావడం, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రామంలో కార్యకర్తలతో సంబంధాలు ఉండడం, అతనికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తన అనుచరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, టీఆర్ఎస్‌లో అసమ్మతి నేతలు సైతం తనకు అనుకూలంగా మారే అవకాశాలు బాగున్నాయి. ఏ కోణంలో ఆశించిన కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి గండ్ర సత్తాన్న అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story